వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తర్‌ప్రదేశ్: 'మాది పేద పార్టీ.. మాకు పెట్టుబడిదారులు, ధనవంతుల అండ లేదు' - మాయావతి

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి

ఉత్తర్ ప్రదేశ్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి ఇంకా ప్రచారం ప్రారంభించకపోవడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది.

అన్ని పార్టీల నేతలూ ర్యాలీలు నిర్వహిస్తున్నా నాలుగుసార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన మాయావతి మాత్రం ఇంతవరకు ఒక్క ర్యాలీ కూడా నిర్వహించలేదు.

ఆమె మౌనానికి కారణమేమిటో తెలియక మద్దతుదారులు, విశ్లేషకులు, రాజకీయ ప్రత్యర్థులు కూడా తికమకపడుతున్నారు.

వారందరి సందేహాలకు సమాధానం ఇస్తూ ఇటీవల మాయావతి ఓ ప్రకటన విడుదల చేశారు.

అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలు, ర్యాలీల గురించి వివరిస్తూ... బీజేపీ, కాంగ్రెస్‌లను లక్ష్యంగా చేసుకుంటూ నూతన సంవత్సరం తొలి రోజున ఆమె ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు.

https://twitter.com/Mayawati/status/1477198014552756227

ఎన్నికలకు రెండు, రెండున్నర నెలల ముందు నుంచీ ర్యాలీలు నిర్వహించడం తమ పార్టీ పద్ధతి కాదని మాయావతి స్పష్టం చేశారు.

"కేంద్రంలో లేదా రాష్ట్రంలో ఎక్కడ అధికారంలో ఉన్నా, ఎన్నికలు ప్రకటించడానికి ముందే బీజేపీ, కాంగ్రెస్‌లు ర్యాలీలు ప్రారంభిస్తాయి. ఎందుకంటే అక్కడ పెట్టుబడిదారులు, వడ్డీ వ్యాపారులు డబ్బు పెడతారు. కానీ, బీఎస్పీ అలా చేస్తే ఎన్నికల సమయంలో జరిగే బహిరంగ సభ ఖర్చులు పార్టీకు భారం అవుతాయి" అన్నారామె.

Getty Images

'ర్యాలీలు ఎందుకు నిర్వహించట్లేదంటే..'

"అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ, కాంగ్రెస్‌లు ఎన్నికలకు రెండున్నర నెలల ముందు నుంచీ ర్యాలీలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తాయి. ప్రభుత్వ ఖర్చుతో బహిరంగ సభలు ఏర్పాటు చేస్తాయి. ఆ సభల్లో సగం మంది ప్రభుత్వ అధికారులు, మిగతా సగం టికెట్ పొందేవాళ్లే ఉంటారు. ఈ పార్టీలు అధికారంలో లేకపోతే మాలాగే ఎన్నికలు ప్రకటించిన తరువాతే ప్రచారం ప్రారంభిస్తారు. ఎందుకంటే అప్పుడు పార్టీ డబ్బు ఖర్చవుతుంది. ప్రభుత్వానిది కాదు.

"ఇతర పార్టీలను కాపీ కొట్టడంపై మాకు నమ్మకం లేదు. మా పార్టీ సభ్యుల ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని పూర్తి అవగాహనతో మేం పనిచేస్తాం. ఆ పార్టీలను అనుకరిస్తూ మేమూ ఇప్పటి నుంచే బహిరంగ సభలు నిర్వహిస్తే, ఎన్నికలు ప్రకటించిన తరువాత ర్యాలీలు నిర్వహించడానికి మా దగ్గర డబ్బు ఉండదు. ఎందుకంటే మాది పేద పార్టీ. పెట్టుబడిదారుల, ధనవంతుల పార్టీ కాదు. మనం ఇతరులను అనుకరిస్తే, డబ్బు ఇబ్బందులతో ఎన్నికల్లో చాలా నష్టపోతాం" అని మాయవతి వివరించారు.

"ప్రతిపక్ష పార్టీలు చాలా వ్యంగ్యంగా మాట్లాడినా, మీడియా వక్రీకరించినా మాకేం నష్టం లేదు. ఎన్నికల సన్నాహాల విషయంలో మా పనితీరు వేరు. మాకు భిన్నమైన పద్ధతులు ఉన్నాయి. వీటిని మార్చాలని మేం అనుకోవట్లేదు. మా పార్టీ పనితీరు పట్ల ఇతర పార్టీలు ఆందోళన పడక్కర్లేదు. మా సంగతి మేం చూసుకుంటాం."

అమిత్ షా

అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు

బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎన్నికల ర్యాలీలు నిర్వహించకపోవడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల వ్యాఖానించారు.

గురువారం మొరాదాబాద్‌, అలీఘర్‌, ఉన్నావ్‌లలో జరిగిన 'జన్‌ విశ్వాస్‌ యాత్ర' సందర్భంగా మాట్లాడుతూ మాయావతికి భయం పట్టుకుందని అన్నారు.

"బెహెన్‌జీ (మాయావతి)కి ఇంకా చలి వణుకు తగ్గలేదు. ఆమెకు భయంగా ఉంది. బెహెన్‌జీ ఎన్నికలు వచ్చేశాయి. కాస్త బయటికొచ్చి చూడండి. మళ్లీ తరువాత నేను ప్రచారమే చేయలేదు అనకండి. అత్త (మాయావతి), అల్లుడు (అఖిలేశ్ యాదవ్), సోదరి (ప్రియాంకా గాంధీ వాద్రా) ముగ్గురూ కలిసి వచ్చినా మా బీజేపీ కార్యకర్తల ముందు వారి పప్పులు ఉడకవు" అంటూ అమిత్ షా వ్యాఖ్యలు చేశారు.

అంతకుముందు డిసెంబర్ 23న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ, మాయావతి క్షేత్ర స్థాయి సమస్యలకు దూరంగా ఉంటున్నారని, గత కొన్నేళ్లుగా ప్రతిపక్ష పార్టీల్లో కాంగ్రెస్ మాత్రమే ప్రజా సమస్యలను లేవనెత్తుతున్నదని అన్నారు.

"గత రెండేళ్లుగా ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ తప్ప ప్రజల కోసం ధర్నాలు చేసిన లేదా ప్రజల సమస్యలను భుజాలకెత్తుకుని రోడ్డు పైకి దిగిన పార్టీ లేదు. దీనికి కారణం నా అవగాహనకు మించినది. మాయవతి గారు ఇంత మౌనంగా ఎందుకు ఉంటున్నారో నాకర్థం కావట్లేదు" అని ఆమె అన్నారు.

Getty Images

అమిత్ షా వ్యాఖ్యలకు మాయవతి జవాబు

అమిత్ షా వ్యాఖ్యలకు కూడా మాయవతి తన ప్రకటన ద్వారా స్పందించారు.

"ఈ చలికాలంలో వారికి వెచ్చదనం లభిస్తోంది. అది, ప్రభుత్వంలో ఉంటూ పేదల ఖజానాలోంచి వచ్చిన వెచ్చదనం. అధికారంలో లేనప్పుడు ఈ పార్టీలకు ఇలాంటి చలి వణుకు వ్యాఖ్యలు చేయడం గుర్తు రాదు."

మాయావతి మైదానంలో ఎందుకు కనిపించట్లేదని బీఎస్పీ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి సతీష్ చంద్ర మిశ్రాను ఇటీవల 'టైమ్స్ ఆఫ్ ఇండియా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అడిగారు.

"బెహెన్‌జీ రోజుకు 18-18 గంటలు పని చేస్తున్నారు. బూత్ స్థాయి నుంచి పార్టీని పర్యవేక్షిస్తున్నారు. ఆమె ఇప్పటికే సెప్టెంబరు 7, అక్టోబర్ 9 తేదీల్లో పార్టీ నిర్వహించిన రెండు ర్యాలీల్లో ప్రసంగించారు. లఖ్‌నవూ ర్యాలీలో ఐదు లక్షల మందికి పైగా ప్రజలు తరలివచ్చారు. మాయావతి త్వరలోనే పార్టీ కోసం ప్రచారం ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు వెళ్తారు."

తమ పార్టీ ప్రచార సన్నాహాలు బూత్ స్థాయి నుంచే మొదలవుతున్నాయని, తమ కార్యకర్తలు వీధుల్లోకి రావడంగానీ, ఫొటోలు దిగడంగానీ చేయరని, తమ పార్టీ పని తీరు, టీవీలు, వార్తాపత్రికల్లో కనిపించే వారికి భిన్నంగా ఉంటుందని సతీష్ చంద్ర మిశ్రా అన్నారు.

ఈసారి తమ పార్టీ 2007 కంటే మెరుగైన ప్రదర్శన కనబరుస్తుందని, పూర్తి మెజారిటీతో గెలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

మాయావతి

పడిపోతున్న మాయావతి గ్రాఫ్

ఈసారి ఎన్నికల్లో అధికారంలోకి రావడం కన్నా ఎన్నికల బరిలో నిలదొక్కులోవడమే బీఎస్పీకి ముఖ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు.

2007లో ఆ పార్టీ పూర్తి మెజారిటీతో విజయం సాధించి మాయావతి నాలుగోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు.

ఆ తరువాత 2012లో మాయావతి ఓడిపోవడంతో పార్టీ గ్రాఫ్ పడిపోవడం ప్రారంభమైంది.

2017లో బీజేపీ బీసీ వర్గాలలో పట్టు సాధించింది. ఎన్‌డీఏ కూటమి యూపీలోని 403 అసెంబ్లీ స్థానాలకు 306 గెలుచుకుంది.

బీఎస్పీకి 22 శాతం ఓట్లు వచ్చినా కేవలం 19 సీట్లు మాత్రమే దక్కాయి. అంతే కాకుండా, కొంతమంది నేతలు పార్టీని విడిచి వెళ్లడం కూడా పెద్ద విఘాతమే. బీఎస్పీ నేతలు పార్టీ మారడంతో మాయావతి అసెంబ్లీలో రెండుసార్లు నేతలను మార్చాల్సి వచ్చింది.

2017లో మాయావతి టిక్కెట్లు అమ్ముకున్నారని ఆరోపిస్తూ పార్టీలో కీలక నేత స్వామి ప్రసాద్ మౌర్య నిష్క్రమించారు.

ఈసారి కూడా పార్టీ నుంచి వెళిపోయినవాళ్లు ఉన్నారు. ద్వితీయ శ్రేణి నాయకత్వం లేకపోవడం బీఎస్పీకి మరో ప్రధాన సమస్య.

లాల్జీ వర్మ, రామ్ అచల్ రాజ్‌భర్ వంటి నాయకులు కూడా బీఎస్పీ వీడి సమాజ్‌వాద్ పార్టీలో చేరారు. బీఎస్పీలో మాయావతి తప్ప ఇతర కులాలకు చెందిన జనాకర్షక నాయకులు లేరు.

2017లో అసెంబ్లీలో 19 మంది బీఎస్పీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుతం సభలో కేవలం ముగ్గురే ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Uttar Pradesh: 'Ours is poor party .. we have no investors, no rich people' - Mayawati
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X