ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 1300 శాతం పెరిగిన కరోనా కేసులు: కొత్తగా 7595 పాజిటివ్ కేసులు
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న క్రమంలో రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా 7695 కేసులు నమోదయ్యాయి. గత వారం కంటే ఇది 13 రేట్లు పెరిగాయి. గత ఆదివారం 552 కరోనా కేసులు నమోదయ్యాయి. నాలుగు మరణాలు సంభవించాయి.
లక్నోలో 1115 కేసులు నమోదు కాగా, నోయిడాలో 1149 కేసులు నమోదయ్యాయి. గత 24గంటల్లో రాష్ట్రంలో 2.22 లక్షల నమూనాలను పరీక్షించారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆంక్షలను విధించింది ప్రభుత్వం. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ముందు ఒక వారంలో రోజువారీ కోవిడ్ కేసులలో 1,300 శాతం పెరిగింది.
రాత్రి కర్ఫ్యూ కూడా కొనసాగుతుందని, గత సంవత్సరం కోవిడ్ రెండవ వేవ్ భారాన్ని భరించిన రాష్ట్రం తెలిపింది. గంగా నది ఒడ్డున లేదా నదిలో ప్రవహిస్తున్న వేలాది మృతదేహాల చిత్రాలు దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతిని, భయానకతను రేకెత్తించాయి. కాగా, వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు.

ఆదివారం సీనియర్ అధికారులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్-19 పరిస్థితిని సమీక్షించారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. "జనవరి 15 నాటికి రాష్ట్రంలోని అర్హులైన కౌమారదశలో ఉన్న వారందరికీ టీకాలు వేయాలనే లక్ష్యాన్ని సాధించడమే ప్రభుత్వ ప్రయత్నం. ప్రత్యేక శిబిరాలు సెకండరీ పాఠశాలల్లో నిర్వహించబడాలి. ఈ వారం చివరి నాటికి 100 శాతం కౌమారదశలో ఉన్నవారు వారి మొదటి డోస్‌ను పొందేలా చూడాలి అని అధికారులకు స్పష్టం చేశారు.
కాగా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్‌లలో మొత్తం 690 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు మార్చి 10న ఒకేసారి చేపడతారు. శనివారం ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే.
మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. గడిచిన 24 గంటల్లో లక్షా 60 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ వ్యాప్తి కూడా పెరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో రోజువారి కరోనా పాజిటివిటీ రేటు 10.21 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
శనివారం ఒక్కరోజే 15,63,566 కరోనా పరీక్షలు నిర్వహించగా.. వారిలో 1,59, 632 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయిందని తెలిపింది. కరోనాతో పోరాడుతూ చికిత్స పొందుతున్న 327 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకూ మృతుల సంఖ్య 4,83,790కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు సంఖ్య 5,90,611కు చేరింది. శనివారం 40,863 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 3,44,53,603కు చేరింది. గడిచిన 24 గంటల్లో 56,91,175 మంది కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 151.58 కోట్ల మందికి వాక్సిన్స్ ఇచ్చినట్లు వివరించింది.












Click it and Unblock the Notifications