అమ్మోరి గుడిలో పీజీ స్టూడెంట్: విగ్రహంపై రక్తం: తెగిన గొంతు..గంటలకు ఉరి వేసుకున్న స్థితిలో
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. అమ్మవారి గుడిలో ఓ యువతి నిర్జీవంగా కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలానికి దారి తీసింది. తెగిన గొంతుతో.. గుడి గంటలకు ఉరి వేసుకున్న స్థితిలో ఉన్న ఆ యువతి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తొలుత అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం ఆత్మహత్యగా నిర్ధారించారు. సంఘటనా స్థలాన్ని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ పరిశీలించారు.
ఉత్తర ప్రదేశ్ మీరట్ జిల్లాలోని ఖర్‌ఖోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని కాళికా అమ్మవారి ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుడి గ్రామం సమీపంలోని అడవుల్లో ఉంటుందీ ఆలయం. సాయంత్రం పూట అమ్మవారికి పూజలను నిర్వహించడానికి వెళ్లిన అర్చకుడు మొదట ఆ యువతి మృతదేహాన్ని గుర్తించాడు. ఖర్‌ఖోడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, గ్రామస్తులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

మృతురాలు పీజీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అని నిర్ధారించారు. తల్లితో కలిసి ప్రతివారం కాళికా అమ్మవారి గుడికి వచ్చేదని అర్చకుడు, స్థానికులు పేర్కొన్నారు. కొంతకాలంగా ఆమె విచిత్రంగా ప్రవర్తిస్తుండేదని, తాను అమ్మవారి కూతురుగా చెబుతుండేదని అన్నారు. ఎప్పట్లాగే ఉదయం అమ్మవారి గుడికి వెళ్లిన ఆమె మళ్లీ ఇంటికి వెళ్లలేదు. సాయంత్రమైనప్పటికీ.. ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు అన్ని చోట్లా గాలించారు. అదే సమయంలో కాళిక అమ్మవారి గుడిలో మృతదేహం లభించినట్లు తెలియడంతో అక్కడికి వెళ్లారు. మృతురాలిని గుర్తించారు.
గర్భగుడిలో ఎండిన రక్తపు మరకలు కనిపించాయి. అమ్మవారి విగ్రహం, దీపస్తంభంపై రక్తాన్ని చల్లిన ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీనితో మృతురాలు తొలుత గొంతు కోసుకుని, ఆ తరువాత ఉరి వేసుకుని ఉండొచ్చని నిర్ధారించారు. సమాచారం అందుకున్న వెంటనే ఖర్‌ఖోడా పోలీసులు, మీరట్ జిల్లా సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ ప్రభాకర్ చౌదరి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Recommended Video
మృతురాలి బంధువులు కొందరు క్రైమ్ సీన్‌లో కొన్ని సాక్ష్యాధారాలను తుడిచి పెట్టడానికి ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. దీనితో ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తామని ఎస్ఎస్‌పీ ప్రభాకర్ చౌదరి తెలిపారు. ప్రస్తుతం- ఆత్మహత్యగా నిర్ధారించామని చెప్పారు. అమ్మవారి విగ్రహం, దీపస్తంభంపై రక్తాన్ని చల్లిన ఆనవాళ్లు, క్రైమ్ సీన్ ఆధారంగా సూసైడికల్ కేసుగా నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులను విచారిస్తోన్నామని అన్నారు.












Click it and Unblock the Notifications