యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం: కోటి మంది యువతకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు
లక్నో: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని యోగి ఆదిత్యనాథ్ సర్కారు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. మరోసారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు ప్రజాకర్కక పథకాలను ప్రవేశపెట్టిన యోగి ఆదిత్యనాథ్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో అత్యధిక యువత కలిగిన రాష్ట్రంగా యూపీ కొనసాగుతోంది.

యువతకు కోటి స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు
ఈ నేపథ్యంలో యువతనే లక్ష్యంగా చేసుకుని ఓ భారీ పథకం ప్రవేశపెడుతున్నారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. డిజిటల్ సాధికారత పేరిట ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కోటి మంది యువతకు స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్స్ ఇవ్వనున్నట్లు యూపీ సర్కారు ప్రకటించింది. బుధవారం అసెంబ్లీలో అనుబంధ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆదిత్యనాథ్ ఈ ప్రకటన చేశారు. ఈ పథకం కోసం సుమారు రూ. 3వేల కోట్లు ఖర్చచేయనున్నారు.

పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికీ భత్యం
డిజిటల్ సాధికారత పథకం కింద రాష్ట్రంలోని కోటి మంది విద్యార్థుల్ని ఎంపిక చేస్తామన్నారు సీఎం యోగి. గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యూయేషన్, టెక్నికల్, డిప్లొమా కోర్సులు చదివే విద్యార్థులకు స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్స్ అందించనున్నామని తెలిపారు. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు సన్నహాక భత్యం ఇచ్చి సహకరిస్తామని చెప్పారు. గరిష్టంగా మూడు పరీక్షల కోసం ఈ భత్యాన్ని అందజేయనున్నట్లు తెలిపారు.

ఇటీవలే డీఏ పెంచిన యోగి సర్కారు
కాగా, గతంలో సమాజ్ వాది పార్టీ కూడా ఈ తరహా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. 12వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇస్తామని ప్రకటించి.. 2012లో ఆ పార్టీ విజయం సాధించింది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో యువ ఓటర్లను ఆకర్షించేందేకు యోగి ఆదిత్యనాథ్ ప్రకటన కీలకం కానుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ యోగి సర్కారు నిర్ణయం తీసుకుంది. యోగి ఆఫర్లపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అయితే, యోగి ఆదిత్యనాథ్ అధికారం చేపట్టినప్పటి నుంచి సంచలన నిర్ణయాలే తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఏ మాఫియా ఉండకూదని.. కరుడుగట్టిన నేరస్తులందర్నీ ఎన్‌కౌంటర్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో వందలాది మంది గ్యాంగ్‌స్టర్లు, హంతకులకు పోలీసు తూటానే సమాధానం చెప్పింది. ఈ క్రమంలో అనేకమంది నేరస్తులు తమ నేరాలను అంగీకరించి జైల్లో వేయాలంటూ ముందుకు రావడం గమనార్హం.

కరోనాను సమర్థంగా కట్టడి చేసిన యోగి సర్కారు
ఉత్తరప్రదేశ్ యోగి ప్రభుత్వం కరోనావైరస్ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొంది. దేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రమైనప్పటికీ.. కఠిన చర్యలు తీసుకుని కరోనాను కట్టడి చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో స్వల్పంగానే కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా కేవలం 35 కరోనా కేసులే వెలుగుచూశాయి. 53 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు నమోదు కాకపోవడం గమనార్హం. 20 కోట్లకుపైగా జనాభా ఉన్న ఈ రాష్ట్రంలో ప్రస్తుతం 400 కంటే తక్కువ యాక్టివ్ కేసులున్నాయి. ఈ నేపథ్యంలో సాధారణ పరిస్థితుల్లానే దుకాణాలకు అనుమతిస్తున్నారు. కర్ఫ్యూను పూర్తిగా ఎత్తివేశారు. అంతేగాక, అత్యధిక కరోనా టెస్టులు చేసిన రాష్ట్రంగా యూపీ రికార్డుల్లోకెక్కింది. ఇప్పటి వరకు ఏడు కోట్లకుపైగా కరోనా టెస్టులను ఈ రాష్ట్రంలో నిర్వహించారు.












Click it and Unblock the Notifications