Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దుకాణం పేరు వివాదం; మానవత్వం ప్రశ్నగా మారింది

ఆయనో జిమ్ ట్రైనర్. అందరితో సరదాగా ఉంటూ.. జిమ్ లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. వీలున్నప్పుడు పక్కన షాపు వారిని కూడా పలకరిస్తుంటాడు. అయితే ఆ సమయంలోనే ఒక గ్యాంగ్ వచ్చి.. ఓ పెద్దాయన షాప్ పై ఉన్న పేరు మార్చాలని దాడి చేసేంత పని చేశారు. అంతే.. ప్రశాంతంగా ఉన్న ఆ స్ట్రీట్ అంతా ఒక్కసారిగా హైటెన్షన్ నెలకొంది. భారీగా పోలీసులు ఒక వైపు, దాడి చేయడానికి వచ్చిన గ్యాంగ్ మరో వైపు, మధ్యలో ఈ జిమ్ ట్రైనర్. అతను చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఏకంగా మత విద్వేషాలే రెచ్చగొట్టాయి. దీంతో సోషల్ మీడియా ఒక్కసారిగా హీటెక్కింది. అసలేం జరిగింది.

ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్‌ పట్టణంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఆ సంఘటనకు కేంద్ర బిందువుగా మారిన వ్యక్తి.. 46 ఏళ్ల జిమ్ యజమాని దీపక్ కుమార్. సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు, తీసుకున్న వైఖరి, ఆ తర్వాత ఎదురైన పరిణామాలు... ఇవన్నీ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర స్పందనను రేకెత్తిస్తున్నాయి. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన ఒక వీడియోలో దీపక్ కుమార్ తన ఆలోచనలను బహిరంగంగా వెల్లడించారు. "నేను హిందువుని కాదు, ముస్లింని కాదు, సిక్కుని కాదు, క్రైస్తవుడిని కాదు. అన్నింటికంటే ముందు నేను ఒక మనిషిని. చనిపోయిన తర్వాత నేను జవాబు చెప్పాల్సింది దేవుడికి, మానవత్వానికి తప్ప మతానికి కాదు" అని ఆయన పేర్కొన్నారు.

Uttarakhand Gym Owner Deepak Kumar Faces Threats After Defending Muslim Shopkeeper In Kotdwar Case UP

ఈ వ్యాఖ్యలు చేయడానికి ముందు జరిగిన ఒక సంఘటన దీపక్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. జనవరి 26న కోట్‌ద్వార్‌లోని పటేల్ మార్గ్ ప్రాంతంలో ఉన్న ఒక దుకాణంలో దీపక్ ఉన్న సమయంలో, 70 ఏళ్ల ముస్లిం దుకాణదారుడు వకీల్ అహ్మద్‌ను కొందరు యువకులు వేధించడం ఆయన చూశారు. తమను బజ్‌రంగ్ దళ్ సభ్యులమని చెప్పుకున్న ఆ వ్యక్తులు, అహ్మద్ దుకాణం పేరు 'బాబా స్కూల్ డ్రెస్'లోని 'బాబా' పదాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. ఆ పదం హిందూ మత పెద్దలకు మాత్రమే చెందిందని వారు వాదించారు. పేరు మార్చకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారు.

ఎందుకు పేరు మార్చాలి?..

ఈ దృశ్యాన్ని చూసి దీపక్ అక్కడే జోక్యం చేసుకున్నారు. "ఈ దుకాణం 30 ఏళ్లుగా ఇదే పేరుతో ఉంది. ఇప్పుడు ఎందుకు పేరు మార్చాలి?" అని ఆయన ప్రశ్నించారు. ఇతరులు 'బాబా' అనే పదాన్ని వాడగలిగినప్పుడు, అహ్మద్ ఎందుకు వాడకూడదని నిలదీశారు. అప్పుడే ఆ గుంపులోని ఒక వ్యక్తి.. నీ పేరేంటని అడిగాడు. దానికి దీపక్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అయింది. "నా పేరు మహ్మద్ దీపక్" అని ఆయన అన్నారు. ఈ మాటలు అక్కడున్నవారిని ఆశ్చర్యపరిచాయి. తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాప్తి చెందింది. కొందరికి అది ధైర్యంగా అనిపించగా, మరికొందరికి ఆగ్రహానికి కారణమైంది. ఈ వ్యాఖ్య వెనుక ఉద్దేశాన్ని దీపక్ తర్వాత స్పష్టం చేశారు. "నేను.. మతాల కలయికను, భారతీయ గుర్తింపును చూపించాలనుకున్నాను. చట్టం ముందు అందరూ సమానమే అన్న సందేశం ఇవ్వడమే నా ఉద్దేశం" అని ఆయన తెలిపారు.

వేల సంఖ్యలో కామెంట్లు..

అయితే ఈ ఘటన తర్వాత దీపక్‌పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర దూషణలు మొదలయ్యాయి. ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లలో ఆయనను లక్ష్యంగా చేసుకొని కొందరు దూషణలకు దిగితే. మరికొందరు మద్దతు తెలియజేస్తున్నారు. ఆయన ఇన్‌స్టాగ్రామ్ పేజీ వేల సంఖ్యలో కామెంట్లతో నిండిపోయింది. ఒకవైపు ముస్లిం సమాజం నుంచి, అలాగే ఆయన ఆలోచనలకు మద్దతు ఇచ్చే ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తగా... మరోవైపు కొందరు ఆయనను "ద్రోహి" అంటూ తీవ్రంగా దూషించారు.

ఇదిలా ఉండగా, శనివారం ఈ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. దీపక్ ఇంటి వద్ద పెద్ద సంఖ్యలో వ్యక్తులు గుమిగూడడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. "నేను వెనుకకు తగ్గను. భయపడను" అని దీపక్ స్పష్టంగా చెప్పారు. ఈ సంఘటనపై పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. వకీల్ అహ్మద్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, బజ్‌రంగ్ దళ్ సభ్యులమని చెప్పుకున్న వ్యక్తులు... దుకాణం పేరు మార్చాలని బెదిరించిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు కోట్‌ద్వార్ ఎస్‌ఎస్‌పి సర్వేశ్ పన్వార్ తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఫిర్యాదులో, అహ్మద్ గత 30 ఏళ్లుగా 'బాబా స్కూల్ డ్రెస్' పేరుతో దుకాణం నడుపుతున్నట్లు పేర్కొన్నారు. జనవరి 26న ఓ నలుగురు యువకులు షాప్ లోకి వచ్చి పేరు మార్చకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారని తెలిపారు. వారిలో పోలీసులు ఇద్దరిని గుర్తించారు. వారు గౌరవ్ కశ్యప్‌, శక్తి సింగ్ గోన్సాయ్‌లు అని తెలిపారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

అదే సమయంలో, శనివారం కోట్‌ద్వార్‌లో 30 నుంచి 40 మంది గుర్తించబడని వ్యక్తులు మత ఉద్రిక్తతను రెచ్చగొట్టేలా ప్రవర్తించారని పోలీసులు మరో కేసు నమోదు చేశారు. జాతీయ రహదారిని అడ్డుకోవడం, పోలీసులపై దాడి చేయడం వంటి ఆరోపణలు కూడా నమోదయ్యాయి. ఈ గుంపు పటేల్ మార్గ్ మార్కెట్‌లో నినాదాలు చేస్తూ ఉద్రిక్తతను మరింత పెంచిందని పోలీసులు తెలిపారు.

విలువలపై జరుగుతున్న వాదనగా..

మరోవైపు దీపక్ జిమ్ వెలుపల కూడా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పెద్ద సంఖ్యలో బజ్‌రంగ్ దళ్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని నిరసన చేపట్టారు. దీపక్ బయటకు రావాలని డిమాండ్ చేశారు. "తనను తాను 'మహ్మద్ దీపక్' అని పిలుచుకునే వ్యక్తి ఇప్పుడు పారిపోయాడు" అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఈ మొత్తం ఘటన కోట్‌ద్వార్‌లో మత సామరస్యంపై, వ్యక్తిగత స్వేచ్ఛపై, మానవత్వంపై పెద్ద చర్చకు దారి తీసింది. ఒక దుకాణం పేరు నుంచి మొదలైన వివాదం, ఇప్పుడు దేశవ్యాప్తంగా విలువలపై జరుగుతున్న వాదనగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+