వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండు నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలపై దిల్లీలో టీకా ట్రయల్స్: ప్రెస్ రివ్యూ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కరోనావైరస్

దిల్లీలో పిల్లలపై టీకా ట్రయల్స్ ప్రారంభమైనట్లు నమస్తే తెలంగాణ దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.

రెండు నుంచి 18 ఏండ్లలోపు వారిలో కొవాగ్జిన్‌ టీకా ప్రభావం ఎలా ఉండనుంది అన్నదానిపై దిల్లీలోని ఎయిమ్స్‌ దవాఖానలో ట్రయల్స్‌కు కసరత్తు మొదలైంది.

పిల్లలను ఎంపిక చేయటం కోసం ఆరోగ్యపరీక్షలు ప్రారంభించారు. ఎంపికైన వారిపై టీకా ట్రయల్స్‌ జరుపుతారు.

కొద్దిరోజుల కిందటే పాట్నాలోని ఎయిమ్స్‌లో మొదలుపెట్టిన ట్రయల్స్‌ను ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్‌లోనూ ప్రారంభించటానికి వీలుగా ఈ కసరత్తు ప్రారంభించారు.

దీంట్లోభాగంగా 525 మందిపై ట్రయల్స్‌ నిర్వహిస్తారు. ఇంట్రామస్క్యులర్‌ రూట్‌లో తొలిరోజున ఒక డోసు, 28వ రోజున రెండో డోసు ఇస్తారు.

ఈ వివరాల్ని ఎయిమ్స్‌ సెంటర్‌ ఫర్‌ కమ్యూనిటీ మెడిసిన్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సంజయ్‌ రాయ్‌ సోమవారం వెల్లడించారు.

2-18 ఏండ్లలోపు పిల్లల్లో నిర్వహించాల్సిన మూడుదశల క్లినికల్‌ ట్రయల్స్‌లో రెండోదశకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఏ) మే 12న అనుమతి ఇచ్చింది.

హైదరాబాద్‌ కంపెనీ భారత్‌ బయోటెక్‌ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్‌ టీకాను ప్రస్తుతం 18 ఏండ్లు నిండినవారు, ఆ పైన వయసున్న వాళ్లకే ఇస్తున్న విషయం తెలిసిందే.

దేశంలో కరోనా తొలి, రెండో వేవ్‌లలో పిల్లలపై అంతగా ప్రభావం పడలేదు. కానీ, కరోనా వైరస్‌లోగానీ, దానివ్యాప్తిలోగానీ మార్పులు వస్తే పిల్లలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం లేకపోలేదని కేంద్రప్రభుత్వం గత వారం హెచ్చరించింది.

అటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోవటానికి వీలుగా సిద్ధంగా ఉండాలని, పిల్లలకు అవసరమైన చికిత్సను, ఔషధాలను, వైద్యులను సమకూర్చుకోవాలని, దవాఖానాల్లో ఆ మేరకు ఏర్పాట్లు కూడా చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించిందని నమస్తే తెలంగాణ చెప్పింది.

{image-_117569083_avolunteerreceivesthecovid-19vaccineatamockruninindia'skarnataka.jpg telugu.oneindia.com}

థర్డ్ వేవ్‌ను దృష్టిలో ఉంచుకుని ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు ముందుగా టీకాలు

ఏపీలో ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులందరికీ వ్యాక్సిన్‌ వేయాలని నిర్ణయించినట్టు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ చెప్పారని సాక్షి పత్రిక తెలిపింది.

ఇప్పటివరకు 45 ఏళ్ల వయసు పైన వారికే వ్యాక్సిన్‌ వేస్తున్నామన్నారు. కానీ చిన్నారుల్లో కరోనా వచ్చినప్పుడు తల్లి అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తల్లులకు కూడా టీకా వేస్తే రక్షణ ఉంటుందని చెప్పారు.

ఆయన సోమవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో థర్డ్‌వేవ్‌ వస్తుందో రాదో ఖచ్చితంగా చెప్పలేమని, ముందస్తు అంచనాలతో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలి కాబట్టి తల్లులందరికీ వ్యాక్సిన్‌ వేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులు 15 లక్షల నుంచి 20 లక్షల మంది ఉండవచ్చన్నారు.

వీరికి వ్యాక్సిన్‌ ఇవ్వడంపై వయసు నిబంధనలు సడలిస్తూ త్వరలోనే మార్గదర్శకాలు జారీచేస్తామని తెలిపారు. భవిష్యత్‌ అంచనాలనుబట్టి ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాకుండా ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా వారం రోజుల్లోగా వసతులను పరిశీలించాలని ఆదేశించినట్టు చెప్పారు.

ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోనూ ఈ అంచనా వేస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని ఆస్పత్రుల్లో చిన్నారులకు అవసరమైన వెంటిలేటర్లు, వార్డులు తదితరాలు సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారని సాక్షి వివరించింది.

జులై 8న షర్మిల కొత్త పార్టీ 'వైఎస్ఆర్‌‌టీపీ' ఏర్పాటు

వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి రోజు జులై 8న ఏర్పాటు చేయబోతున్నట్లు ఆ పార్టీ పేరు రిజిస్ట్రేషన్‌ కోసం ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు చేసిన వాడుక రాజగోపాల్‌ ప్రకటించారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

పార్టీ ఆవిర్భావానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను, కార్యక్రమాలనూ ఇప్పటికే ప్రారంభించామన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ నుంచి అధికారికంగా అనుమతి పత్రాలు రాగానే పార్టీకి సంబంధించిన మరిన్ని వివరాలను ప్రకటిస్తామని చెప్పారు.

ఈ మేరకు సోమవారం షర్మిల పార్టీ కార్యాలయం ఆ ప్రకటనను విడుదల చేసింది. పార్టీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల కమిషన్‌ దగ్గర పనులన్నీ పూర్తయ్యాయని, పార్టీ పేరుపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ వైఎస్‌ విజయమ్మ ఇచ్చిన లేఖనూ ఎన్నికల కమిషన్‌కు ఇచ్చామని వాడుక రాజగోపాల్‌ ఆ ప్రకటనలో వెల్లడించారు.

పార్టీ పేరుకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలంటూ మార్చి 23వ తేదీనే అధికారిక వెబ్‌సైట్‌లో ఎన్నికల కమిషన్‌ పేర్కొందన్నారు. ఇప్పటి వరకూ ఎలాంటి అభ్యంతరాలు రానందున అనుమతుల ప్రక్రియ పూర్తయిందనే తాము భావిస్తున్నామని ఆయన తెలిపారు.

బ్లాక్ ఫంగస్

ఏపీలో తగ్గిన కరోనా మరణాలు పెరిగిన బ్లాగ్ ఫంగస్ మరణాలు

ఆంధ్రప్రదేశ్‌లో బ్లాక్‌ ఫంగస్‌ కేసుల్లో మరణాలు క్రమంగా పెరుగుతున్నాయని, ఫంగస్‌ లక్షణాలు ముందే గుర్తించకపోవడం, చికిత్సకు అత్యవసరంగా ఉపయోగించాల్సిన ఇంజెక్షన్ల కొరత మరణాలు పెరిగేందుకు కారణమవుతున్నాయని ఈనాడు ఒక కథనాన్ని ప్రచురించింది.

రాష్ట్రంలో సోమవారం నాటికి 17,63,211 కరోనా కేసులు నమోదు కాగా 11,552 (0.65%) మరణాలు సంభవించాయి. తాజా లెక్కల ప్రకారం సోమవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 1,623 మంది బ్లాక్‌ ఫంగస్‌ బారినపడ్డారు. వీరిలో 103 (6.34%) మంది ప్రాణాలు విడిచారు. కోవిడ్‌తో పోలిస్తే బ్లాక్‌ ఫంగస్‌ కేసుల్లో మరణాలు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నాయి.

కరోనా సోకినవారు ఆసుపత్రుల్లో చికిత్స పొంది.. ఇళ్లకు వెళ్లి, రెండు, మూడు వారాల అనంతరం బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలతో ఆసుపత్రులకు వస్తున్నారు.

రాష్ట్రంలో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 397 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు ఉన్నాయి. చిత్తూరు- 212, కృష్ణా -201, అనంతపురం - 178, కర్నూలు-160, విశాఖ జిల్లాలో 155 చొప్పున కేసులు నమోదయ్యాయి. తక్కువగా పశ్చిమగోదావరి జిల్లాలో 12, విజయనగరం జిల్లాలో 17 కేసులు నమోదయ్యాయి.

ప్రకాశం జిల్లాలో 83 కేసులు నమోదైతే 15 (14.45%) మంది ప్రాణాలు విడిచారు. కర్నూలు జిల్లాలో 14, గుంటూరు-14, విశాఖపట్నం-14, చిత్తూరు జిల్లాలో 13 మంది మృత్యువాతపడ్డారు. అనంతపురం జిల్లాలో 11 మంది మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లోనే ఐదుగురు మరణించారు.

బ్లాక్‌ ఫంగస్‌ బాధితుల్లో కొందరికి అత్యవసరంగా ఇవ్వాల్సిన ఆంఫోటెరిసిన్‌-బి ఇంజెక్షన్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఒక్కోసారి ఒకటి, రెండు రోజులపాటు ఆసుపత్రులకు ఇంజెక్షన్లు రావడంలేదు. దీంతో పోసోకొనజోల్‌ ఇంజెక్షన్లు, మాత్రలను బాధితులకు ఇస్తున్నారు.

మరోవైపు బ్లాక్‌ఫంగస్‌ను తొలి దశలోనే గుర్తించనందువల్ల పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి, మార్కాపురం, దొనకొండ, ఇతర ప్రాంతాల నుంచి బాధితులు ఆలస్యంగా ఒంగోలు జీజీహెచ్‌కు వస్తున్నారు.

అప్పటికే వారి కళ్లు మూసుకుపోయి ఉంటున్నాయి. దవడ వాపు ఎక్కువగా ఉంటున్నందున చికిత్స అందించేలోగా వారి పరిస్థితి విషమిస్తోందని బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స విభాగ పర్యవేక్షకులు డాక్టర్‌ కిరణ్‌ తెలిపారు.

విశాఖ కేజీహెచ్‌లో నమోదైన బ్లాక్‌ఫంగస్‌ కేసుల్లో వైరస్‌ సోకనివారు ఐదుగురు ఉన్నారని ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ సుధాకర్‌ చెప్పారు. బాధితులు ఆలస్యంగా రావడంవల్ల ముగ్గురు ప్రాణాలు విడిచినట్లు విజయవాడ జీజీహెచ్‌ ఈఎన్‌టీ వైద్య విభాగ అధిపతి ప్రొఫెసర్‌ రవి తెలిపారు.

ఆసుపత్రులకు వచ్చిన వారికి బ్లాక్‌ ఫంగస్‌ ఉన్నది, లేనిది తెలుసుకునేందుకు పరీక్షలు చేయడానికి, రిపోర్టులు వచ్చేందుకు 48 గంటల వరకు సమయం పడుతోంది. వీటి ద్వారా వ్యాధి నిర్ధారణ జరిగితే శస్త్రచికిత్సలు చేస్తున్నారు. విజయవాడ జీజీహెచ్‌లో సుమారు 50 మందికి శస్త్రచికిత్సలు చేసి ఫంగస్‌ తొలగించారని పత్రిక తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Vaccine trials in Delhi on children under two to 18 years of age
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X