తక్కువ ధరకే వందే భారత్ రైలు ఎక్కొచ్చు!
సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ రైలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్రమోడీ జెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. మధ్య తరగతికి, దిగువ మధ్యతరగతికి టికెట్ ధర అందుబాటులో లేదంటూ విమర్శలు వస్తున్నాయి. తక్కువ ధరకే వందే భారత్ రైలు ఎక్కి ఎలా ప్రయాణించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఛైర్ కార్ టికెట్ ధర రూ.1680గా నిర్ణయించారు. ఇందులో బేస్ ధర రూ.1168గా ఉంది. రిజర్వేషన్ చార్జీ రూ.40, సూపర్ ఫాస్ట్ చార్జీ రూ.45, జీఎస్టీ రూ.63, క్యాటరింగ్ చార్జీ 364గా ఉంది. ఒకవేళ మీరు ఆహారం వద్దనుకుంటే టికెట్ బుకింగ్ సమయంలో నో ఫుడ్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఈ ఆప్షన్ ఎంపిక చేసుకున్నవారికి క్యాటరింగ్ చార్జీల నుంచి మినహాయింపు లభిస్తుంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి టికెట్ ధర రూ. 1340కి తగ్గుతుంది. తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు కూడా ఇదే ధరకు చేరుకోవచ్చు.

కొందరు వందే భారత్ రైలు ఎక్కి ఒక్కసారైనా జర్నీ చేద్దామనుకునేవారు కోకొల్లలుగా ఉన్నారు. అలాంటివారు తక్కువ దూరం ప్రయాణం చేస్తే వీరికి ఛార్జీలు కలిసివస్తాయి. సికింద్రాబాద్ నుంచి నల్గొండకు, గుంటూరు నుంచి ఒంగోలు వరకు తక్కువ ఛార్జీతో ప్రయాణించవచ్చు. సికింద్రాబాద్ నుంచి నల్గొండకు ప్రయాణించేవారు 'నో ఫుడ్' ఆప్షన్ ఎంచుకొని టికెట్ బుక్ చేసుకోవాలి. టికెట్ ధర రూ.455 అవుతుంది. అలాగే నో ఫుడ్ ఆప్షన్ ఎంచుకొని గుంటూరు నుంచి ఒంగోలు వరకు ప్రయాణిస్తే.. టికెట్ ధర రూ.490 అవుతుంది. వందేభారత్ రైలు ఎక్కి ఒక్కసారైనా ప్రయాణించాలనుకునేవారు ఇలా చేయొచ్చు.
సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు.. ఉదయం 6.00 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 02:30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుపతిలో మధ్యాహ్నం 3:15 గంటలకు బయలుదేరి.. రాత్రి 11:45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. నల్గొండలో ఒక నిముషం, గుంటూరులో 5 నిముషాలు, ఒంగోలులో ఒక నిముషం, నెల్లూరులో ఒక నిముషం ఆగుతుంది.












Click it and Unblock the Notifications