మనకూ ఓ వందేభారత్ రైలు - ట్రయల్ రన్ మొదలు..!!
బెంగళూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనత పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్- వందేభారత్ ఎక్స్‌ప్రెస్. ఇప్పటికే నాలుగు రైళ్లు పట్టాలక్కాయి. అవన్నీ కూడా ఉత్తరాది రాష్ట్రాలకే దక్కాయి. మోదీని లోక్‌సభకు పంపించిన ఉత్తరప్రదేశ్, అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లకు ఈ నాలుగు రైళ్లను మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం.
తన వేర్వేరు పర్యటనల సందర్భంగా ఆయన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌ల్లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. న్యూఢిల్లీ-వారణాశి, న్యూఢిల్లీ-శ్రీమాతా వైష్ణోదేవి కాట్రా స్టేషన్ల మధ్య ఈ రైలు పట్టాలెక్కింది. మూడో ఎక్స్‌ప్రెస్ గాంధీనగర్-ముంబై సెంట్రల్ మధ్య అందుబాటులోకి వచ్చింది. నాలుగో రైలు ఢిల్లీ-హిమాచల్‌లోని ఏఎంబీ అందౌర మధ్య పరుగులు తీస్తోంది.

16 బోగీలు ఉండే ఈ సెమీ హైస్పీడ్ రైలు సీట్ల సామర్థ్యం 1,128. గరిష్ఠ వేగం గంటకు 160 కిలోమీటర్లు. శతాబ్దితో సమానంగా పరుగులు తీయగలదీ రైలు. ఆటోమేటిక్ డోర్ సిస్టమ్, జీపీఎస్ ఆధారిత ఆడియో-విజువల్ పాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, హాట్‌స్పాట్ వైఫై కనెక్షన్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ రొటేటింగ్ ఛైర్స్ ఇందులో అందుబాటులో ఉంటాయి. ప్రతి బోగీకీ నాలుగు అత్యవసర ద్వారాలను అమర్చారు. సీసీ కెమెరాల నిఘా ఉంటుంది.
అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ప్రధాని మోదీ ఇలాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌కు మంజూరు చేశారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వ్యక్తం అయ్యాయి. దక్షిణాది రాష్ట్రాలకు ఇప్పటివరకూ ఒక్క వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా కేటాయించలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరిణామాల మధ్య వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న నేపథ్యంలో- కర్ణాటకకు ఈ రైలును కేటాయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

దక్షిణాది రాష్ట్రానికి మంజూరు చేసిన మొట్టమొదటి వందేభారత్ రైలు ఇది. చెన్నై నుంచి మైసూరు మధ్య అందుబాటులోకి రానుంది. చెన్నై-బెంగళూరు-మైసూరు మధ్య ఈ రైలును ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. నవంబర్ 11వ తేదీన దీన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. మైసూరు లేదా చెన్నైల్లో ఏర్పాటు చేసే కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. ఇవ్వాళ ఈ రైలు ట్రయల్ రన్ ఆరంభమైంది. చెన్నైలోని ఎంజీ రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి మైసూరు వరకు ట్రయల్ చేపట్టారు.












Click it and Unblock the Notifications