వందేమాతరంపై రాజకీయ రచ్చ: బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వార్!
జాతీయ గీతం వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పాటను వక్రీకరించారంటూ బీజేపీ కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ హయాంలోనే వందేమాతరం గీతంలో దుర్గాదేవి స్తుతికి సంబంధించిన చరణాలను ఉద్దేశపూర్వకంగానే తొలగించారని బీజేపీ విమర్శలు గుప్పించింది. బీజేపీ జాతీయ ప్రతినిధి సీఆర్ కేసవన్ ఈ వివాదాన్ని లేవనెత్తారు. జవహర్‌లాల్ నెహ్రూ నాయకత్వంలోని కాంగ్రెస్ వందేమాతరం గీతాన్ని చారిత్రకంగా వక్రీకరించిందని ఆరోపించారు. 1937లో జరిగిన కాంగ్రెస్ ఫైజ్‌పూర్ సమావేశంలో దుర్గాదేవిని స్తుతించే చరణాలను తొలగించి వందేమాతరం క్లుప్త రూపాన్ని మాత్రమే ఆమోదించారని కేసవన్ అన్నారు.
జవహర్‌లాల్ నెహ్రూ 1937లో సుభాష్ చంద్రబోస్‌కు రాసిన లేఖలో వందేమాతరం గీతానికి దుర్గాదేవితో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఆ గీతాన్ని జాతీయ గీతంగా స్వీకరించడానికి అది అనుచితమని కూడా జవహర్‌లాల్ నెహ్రూ అభిప్రాయపడ్డారని సీఆర్ కేసవన్ వెల్లడించారు. కాంగ్రెస్ తమ సాంప్రదాయ ఎజెండాను ముందుకు తీసుకుపోతూ దుర్గాదేవి స్తుతి చరణాలను తొలగించి వందేమాతరం సంక్షిప్త రూపాన్ని స్వీకరించిందని కేసవన్ విమర్శించారు.

కాంగ్రెస్ కౌంటర్
వందేమాతరంపై బీజేపీ చేసిన ఈ ఆరోపణలకు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దీటుగా సమాధానం ఇచ్చారు. వందేమాతరం భారత స్వాతంత్ర్య పోరాటంలో పోషించిన పాత్రను ఆయన వివరించారు. 1905లో బెంగాల్ విభజన నుండి మన వీర పోరాట యోధుల చివరి శ్వాస వరకు వందేమాతరం దేశమంతా మారుమోగిందని ఖర్గే తెలిపారు. దాని ప్రజాదరణకు భయపడి బ్రిటిష్ వారు దానిని నిషేధించారని, ఎందుకంటే అది స్వాతంత్ర్య పోరాటంలో భారత హృదయ స్పందనగా మారిందని ఆయన అన్నారు. మహాత్మా గాంధీ, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ సైతం వందేమాతరం దేశభక్తిని పెంచే సామ్రాజ్యవాద వ్యతిరేక నినాదంగా పేర్కొన్నారని.. నెహ్రూ నాయకత్వంలోనే రవీంద్రనాథ్ ఠాగూర్, మౌలానా ఆజాద్, సుభాష్ చంద్రబోస్‌లతో కూడిన కాంగ్రెస్ కమిటీ 1937లో వందేమాతరాన్ని జాతీయ గీతంగా అధికారికంగా గుర్తించిందని ఖర్గే గుర్తు చేశారు.
జాతీయవాద సంరక్షకులుగా చెప్పుకునే ఆర్‌ఎస్‌ఎస్ (RSS), బీజేపీలు వందేమాతరం లేదా జనగణమనలను తమ శాఖలలో ఎప్పుడూ ఆలపించలేదని ఖర్గే విమర్శించారు. వాటికి బదులుగా ఆ సంస్థ సొంత పాటైన 'నమస్తే సదా వత్సలే'ను పాడుతూ తమ సంస్థ గొప్పతనాన్ని కీర్తించుకుంటారని ఆయన మండిపడ్డారు.
రాహుల్ గాంధీపై కూడా విమర్శలు
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా నెహ్రూ 'హిందూ వ్యతిరేక' మనస్తత్వాన్ని ముందుకు తీసుకుపోతున్నారని బీజేపీ నాయకుడు సీఆర్ కేసవన్ ఆరోపించారు. రాహుల్ గాంధీ గత సంవత్సరం "హిందూ ధర్మంలో 'శక్తి' అనే పదం ఉంది. మనం ఆ శక్తికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం" అని వ్యాఖ్యానించడాన్ని ఆయన ప్రస్తావించారు.
బంకిం చంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం గీతం మొట్టమొదటగా నవంబర్ 7, 1875న 'బంగదర్శన్' అనే సాహిత్య పత్రికలో ప్రచురించబడింది. ఆ తర్వాత ఇది ఆయన నవల 'ఆనంద మఠ్'లో భాగమైంది. నేటితో ఆ గీతానికి 150 ఏళ్లు పూర్తి అయింది. వందేమాతరం గీతంపై గతంలోనూ రాజకీయ వివాదాలు చెలరేగాయి.












Click it and Unblock the Notifications