BJP కోరినా తిరస్కరించిన వెంకయ్యనాయుడు.. కారణం?
భారతీయ జనతాపార్టీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడును రెండోసారి కూడా కొనసాగాలని పార్టీ పెద్దలు కోరినా ఆయన తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఉప రాష్ట్రపతి పదవి వల్ల ప్రొటోకాల్ ఇబ్బంది ఎదురవుతోందని, దీనివల్ల పలు కార్యక్రమాలకు, వ్యక్తులకు దూరమయ్యాననేది ఆయన అభిప్రాయం. పలు సందర్భాల్లో వెంకయ్యే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
అందుకే తాను రెండోసారి కొనసాగదలుచుకోలేదని చెప్పినట్లు సమాచారం. ఒకవేళ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసివుంటే అంగీకరించేవారేమోకానీ ఉప రాష్ట్రపతిగా రెండోసారి కొనసాగడానికి ఆయన అంగీకరించలేదని బీజేపీ ఢిల్లీ వర్గాలు వెల్లడించాయి.

మనసు చంపుకొని నిర్ణయాలు తీసుకోవాలి!
ఉప రాష్ట్రపతి పదవి రాజ్యాంగబద్ద పదవి కావడం.. పెద్దల సభను సున్నితంగా నడిపించాల్సి రావడం.. మనసు చంపుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం లాంటివి ఆయన్ను ఇబ్బంది పెట్టాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఎవరైనా పదోన్నతి కోరుకుంటారని, ఆ అవకాశం లేకపోవడంవల్ల అన్ని అంశాలను బేరీజు వేసుకొనే రెండోసారి కొనసాగడానికి తిరస్కరించినట్లు చెప్పారు.

స్వర్ణభారతి ట్రస్ట్ ద్వారా సేవచేయాలని..
అంతేకాకుండా తన రాజకీయ జీవితంలో ఎటువంటి మచ్చ లేకపోవడంతో, ఈసారి కొనసాగితే మళ్లీ ఏదైనా మచ్చ పడే అవకాశం ఉండటం, అటువంటివేవీ లేకుండా రాజకీయ జీవితాన్ని ముగించాలనుకోవడం కూడా ఒక కారణమని వెల్లడించారు. వివాదాలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని, ప్రొటోకాల్ వల్ల ఇబ్బంది పడుతున్నానని ఆయనే స్వయంగా చెప్పారు. తన కుమార్తె నిర్వహిస్తున్న స్వర్ణభారతి ట్రస్ట్ ద్వారా సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఉండటం కూడా మరో కారణమని తెలిపారు.

మైనార్టీ వ్యక్తిని ఎంపిక చేయాల్సిన అవసరాన్ని కల్పించిన నూపుర్ శర్మ!!
నూపుర్‌శర్మ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టను మంట కలిపాయి. దీంతో మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తిని ఉప రాష్ట్రపతిపదవికి ఎంపిక చేయాలని పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ముక్తార్ అబ్బాస్ నక్వీ రాజ్యసభ పదవీకాలం ముగియడంతో ఆయన తన కేంద్ర మంత్రిపదవికి రాజీనామా చేశారు. వెంకయ్యనాయుడు వద్దని చెప్పడంతో పార్టీ పెద్దలు నక్వీవైపు చూస్తున్నట్లు ఢిల్లీవర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఉప రాష్ట్రపతి పదవికి నోటిఫికేషన్ వెలువడింది. ఆగస్టు 10వ తేదీతో వెంకయ్యనాయుడి పదవీ కాలం ముగియనుంది.












Click it and Unblock the Notifications