లాజిక్ లాగిన నాగబాబు: ఆస్తికుడినని చెప్పుకొనే ప్రయత్నం
పవిత్రమైన తిరుమల లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కల్తీ కాలేదంటూ సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం క్లీన్ చిట్ ఇచ్చిన అనంతరం రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఈ వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఏకంగా సీబీఐ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా కల్తీ జరిగిందంటూ ప్రచారం జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కల్తీ జరిగిందంటూ రాష్ట్రంలో పలు చోట్ల ఫ్లెక్సీలు వెలిశాయి.
ఈ పరిణామాల మధ్య జనసేన సీనియర్ నాయకుడు, శాసన మండలి సభ్యుడు నాగబాబు తెరమీదికి వచ్చారు. తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో దేవాలయాల్లో చోటు చేసుకున్న ఉదంతాల గురించి ఇప్పుడు ప్రస్తావించారు. 2020 సెప్టెంబర్ 6న అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి రథం దగ్ధం కావడం, అదే ఏడాది డిసెంబర్ లో విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరామచంద్రుడి విగ్రహం ధ్వంసం కావడాన్ని గుర్తుచేశారు.

ఈ రెండింట్లోనూ సమగ్ర దర్యాప్తు జరగలేదని అన్నారు. రథం దగ్ధం కేసును సీబీఐకి అప్పగించలేదని చెప్పారు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం నాడు వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ ఒక్కరు కూడా కనీసం ట్వీట్ కూడా పెట్టలేదని ఆరోపించారు. అవతలి వాళ్ల వ్యక్తిగత జీవితంపై ఉన్న శ్రద్ధం హిందూ దేవాలయాలపై లేదని విమర్శించారు. రైల్వే కోడూరుకు చెందిన జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాసలీలల ఉదంతాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించినట్టయింది.
వైసీపీ నాయకులకు హిందువులపై కుళ్లు, కుతంత్రాలు తప్ప ఇంకేమీ లేవని నాగబాబు మండిపడ్డారు. తిరుమలలో గెస్ట్ హౌస్ ల అద్దెలను భారీగా పెంచిన ఘనత కూడా వైసీపీదేనని ఆయన ధ్వజమెత్తారు. దీనివల్ల భగవంతుడి దర్శనానికి సామాన్యుడిని దూరం చేసే ప్రయత్నానికి పాల్పడిందని అన్నారు. తిరుమల దర్శనానికి వెళ్లినప్పుడు జగన్ ఏ నాడు కూడా డిక్లరేషన్ ఇవ్వలేదని నాగబాబు విమర్శించారు. గతంలో రాష్ట్రపతి అబ్దుల్ కలాం, పవన్ కల్యాణ్ కుమార్తె పొలీనా డిక్లరేషన్ ఇచ్చారని గుర్తుచేశారు.
తాను నాస్తికుడిని కాదని నాగబాబు వివరణ ఇచ్చారు. నిరాకారుడైన పరమాత్ముడిని తాను సదా నమ్ముతానని పేర్కొన్నారు. అసేతు హిమాచలం నుండి హిందూ మహాసముద్రం వరకు ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ హిందువేనని చెప్పారు. హిందూ ధర్మంలో చార్వాకులకు కూడా చోటుందని, అందుకే తాను నిఖార్సియన హిందువునని అన్నారు. ఓ ప్రౌండ్ సనాతనిగా చెప్పుకొచ్చారు. హిందూ ధర్మాన్ని తాను ఆచరిస్తానని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications