తొక్కిసలాట నేపథ్యంలో విజయ్ తాజా సంచలన నిర్ణయం?
ప్రముఖ నటుడు, టీవీకే అధినేత విజయ్ కరూర్ లో నిర్వహించిన ర్యాలీలో సంభవించిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. 39కి చేరింది. ఈ దుర్ఘటన పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జ్యుడీషియల్ విచారణకు ఆదేశించారు. వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, గాయపడ్డ వారికి లక్ష రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. ఈ వేకువ జామున ఆయన కరూర్ ఆసుపత్రికి సందర్శించారు. బాధిత కుటుంబాల వారిని పరామర్శించారు.
ఈ దుర్ఘటన నేపథ్యంలో విజయ్ తాజా ప్రకటన చేశారు. కరూర్ సభలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు 20 లక్షల రూపాయలు, గాయపడ్డ వారికి రెండు లక్షల రూపాయల చొప్పన పరిహారాన్ని ప్రకటించారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేశారు. పలు అంశాలను ఇందులో ప్రస్తావించారు. మృతుల కుటుంబాలు, గాయపడ్డవారిని తాను స్వయంగా కలుస్తానని, వారిని ఓదార్చుతానని అన్నారు.

తన హృదయంలో కొలువై ఉన్న అందరికీ నమస్కారం అని పేర్కొంటూ విజయ్ తన ప్రకటనను ప్రారంభించారు. కరూర్ లో జరిగిన ఊహించని ఘటన తన హృదయాన్ని బరువెక్కిస్తోందని, మాటల్లో చెప్పలేనంత బాధను అనుభవిస్తున్నానని అన్నారు. ప్రియమైన వారిని కోల్పోయిన వారి దుఃఖాన్ని తానూ పంచుకుంటున్నానని తెలిపారు. తాను కలిసిన ప్రతీ ఒక్కరి ముఖం తన కళ్ళ ముందు మెదులుతోందని విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
తన పట్ల ప్రేమను, అభిమానాన్ని చూపించే ఆత్మీయులను తలచుకున్నప్పుడల్లా తన గుండె మరింత భారమవుతుందని పేర్కొన్నారు. "నా ఆత్మీయ బంధువులారా.. ప్రగాఢ సానుభూతి. ప్రియమైన వారిని కోల్పోయిన మీకు చెప్పలేనంత బాధతో ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ విషాదంలో మీ మనసుకు దగ్గరగా నిలబడి భాగస్వామ్యం అవుతున్నాను. ఈ నష్టాన్ని పూడ్చలేను, ఎవరూ ఎంత ఓదార్చినా ప్రియమైన వారిని కోల్పోయిన బాధను తట్టుకోవడం కష్టం.." అని అన్నారు.
என் நெஞ்சில் குடியிருக்கும் அனைவருக்கும் வணக்கம்.
— TVK Vijay (@TVKVijayHQ) September 28, 2025
கற்பனைக்கும் எட்டாத வகையில், கரூரில் நேற்று நிகழ்ந்ததை நினைத்து, இதயமும் மனதும் மிகமிகக் கனத்துப் போயிருக்கும் சூழல். நம் உறவுகளை இழந்து தவிக்கும் பெருந்துயர்மிகு மனநிலையில், என் மனம் படுகிற வேதனையை எப்படிச் சொல்வதென்றே…
అయినప్పటికీ, మీ కుటుంబంలో ఒకడిగా, ఆత్మీయులను కోల్పోయి బాధపడుతున్న ప్రతి కుటుంబానికి రూ. 20 లక్షల చొప్పున, గాయపడి చికిత్స పొందుతున్న వారికి రూ. 2 లక్షల చొప్పున అందజేయాలనుకుంటున్నాను.. విజయ్ తెలిపారు. ఈ నష్టం ముందు ఇది పెద్ద మొత్తం కాదని ఆయన పేర్కొన్నారు. ఈ సమయంలో తన ఆత్మీయులైన మీతో కలిసి నిలబడటం తన కర్తవ్యం అని విజయ్ అన్నారు.
చికిత్స పొందుతున్న వారందరూ త్వరగా కోలుకుని ఇంటికి తిరిగి రావాలని తాను భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. చికిత్సలో ఉన్న వారందరికీ టీవీకే తరఫున అన్ని సహాయ సహకారాలను అందిస్తామని విజయ్ హామీ ఇచ్చారు. భగవంతుడి దయతో ఈ కష్టాలన్నింటి నుంచీ బయటపడటానికి ప్రయత్నిద్దాం అని విజయ్ తన ప్రకటనను ముగించారు.












Click it and Unblock the Notifications