నాడు ఎక్కడైతే అవమానమో.. నేడు అక్కడే సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం
చెన్నైలోని నెహ్రూ స్టేడియం ఓ చారిత్రక ఘట్టానికి వేదికైంది. ఒకప్పుడు ఎదురైన అవమానాలకు ప్రతిగా, సరిగ్గా అదే స్థలంలో ఇప్పుడు పట్టాభిషేకం జరిగింది. సినిమాను తలపించేలా సాగిన ఈ పరిణామం దళపతి అభిమానుల్లో ఆనందం నింపింది. కేవలం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం మాత్రమే కాకుండా, దశాబ్ద కాలం నాటి పరాభవానికి కాలం తీర్చుకున్న ప్రతీకారంగా ఫ్యాన్స్ దీనిని భావిస్తున్నారు.
భారతీయ చలనచిత్ర పరిశ్రమకు 2013 సంవత్సరం అత్యంత కీలకమైనది. సినిమాకు వందేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని అప్పటి తమిళనాడు ప్రభుత్వం ఘనంగా వేడుకలు నిర్వహించింది. ముఖ్యమంత్రి జయలలిత ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కానీ ఆ వేడుకలలో విజయ్‌కు సరైన గౌరవం లభించలేదు.

అప్పటికే అగ్ర కథానాయకుడిగా ఆయనకు ఉన్న స్టార్‌డమ్ ఉన్నప్పటికీ.. వేదికకు దూరంగా వెనుక వరుసల్లో కూర్చోబెట్టారు. కనీసం ఆయన ఉనికిని కూడా నిర్వాహకులు గుర్తించలేదని అభిమానుల్లో అప్పట్లోనే తీవ్ర ఆవేదన మొదలైంది. ఒక స్టార్ హీరోకు జరిగిన ఈ అవమానం ఆనాడు విస్తృత చర్చకు దారితీసింది.
అయితే నేడు కాలచక్రం తిరిగినట్లైంది. పన్నెండేళ్ల క్రితం ఏ స్టేడియంలోనైతే విజయ్‌ను ఒక సామాన్యుడిలా వెనుక సీట్లకు పరిమితం చేశారో, ఇప్పుడు అదే వేదికపై ఆయనకు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం జరగడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో కూడా 'CM Vijay' అనే ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఆనాడు వెనుక వరుసలో కూర్చున్న వ్యక్తి, నేడు రాష్ట్ర భవిష్యత్తును నడిపించడానికి సిద్ధమయ్యారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications