అడ్డంగా బుక్ అయిపోయిన విజయ్, ఒకే రోజు మూడు షాకులు
తమిళనాడు ఎన్నికల రణక్షేత్రంలో అడుగుపెట్టిన సూపర్ స్టార్ విజయ్‌కి చట్టపరమైన చిక్కులు మొదలయ్యాయి. తన అభిమాన గణంతో చెన్నై వీధుల్లో ప్రభంజనం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న విజయ్‌పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఆరోపణలు వెల్లువెత్తాయి. అనుమతి లేని రోడ్‌షోలు నిర్వహించడం, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించడం వంటి కారణాలతో చెన్నైలోని మూడు కీలక పోలీస్ స్టేషన్లలో విజయ్‌తో పాటు ఆయన పార్టీ నేతలపై కేసులు నమోదయ్యాయి.
ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ ఇచ్చిన ఫిర్యాదుల మేరకు వెస్ట్ మాంబలం, నుంగంబాక్కం, వేపేరి పోలీస్ స్టేషన్లలో ఈ ఎఫ్ఐఆర్‌లు (FIR) నమోదయ్యాయి.

వెస్ట్ మాంబలంలో కేవలం సభ నిర్వహించుకోవడానికి అనుమతి తీసుకుని, దానికి విరుద్ధంగా భారీ రోడ్‌షో నిర్వహించారని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి సంతోష్ కుమార్ ఫిర్యాదు చేశారు. దీంతో విజయ్, టీ నగర్ అభ్యర్థి ఎన్. ఆనంద్‌లపై బిఎన్‌ఎస్ (BNS) సెక్షన్ 223 కింద కేసు నమోదైంది.
నుంగంబాక్కంలో వల్లువర్ కొట్టం వద్ద ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండానే రోడ్‌షో నిర్వహించి జనాలను సమీకరించినందుకు విజయ్, జేసీటీ ప్రభాకరన్‌లను నిందితులుగా చేర్చారు.
వేపేరిలో ఎన్నికల మార్గదర్శకాలను గాలికొదిలేసి ఎగ్మోర్ అభ్యర్థి రాజ్‌మోహన్‌తో కలిసి ప్రచారం చేసినందుకు మరో కేసు నమోదైంది.
ట్రాఫిక్ జామ్.. అధికారుల సీరియస్!
విజయ్‌ని చూసేందుకు అభిమానులు వేల సంఖ్యలో ఎగబడటంతో చెన్నై ప్రధాన రహదారులు స్తంభించిపోయాయి. ఎన్నికల సంఘం విధించిన జన సమూహ పరిమితులు, రోడ్‌షోల నిషేధం వంటి షరతులను టీవీకే కార్యకర్తలు ఉల్లంఘించారని అధికారులు నిర్ధారించారు. దర్యాప్తు కొనసాగుతోందని, చట్టాన్ని అతిక్రమిస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
రాజకీయాల్లోకి రాగానే వరుసగా కేసులు నమోదు కావడం విజయ్ అభిమానుల్లో ఆగ్రహం కలిగిస్తుండగా, ఇది అధికార పార్టీ పన్నాగమని టీవీకే శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల వేళ ఈ కేసులు విజయ్ ప్రచార జోరును తగ్గిస్తాయా లేక సింపతీని పెంచుతాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.














Click it and Unblock the Notifications