ఎయిర్ పోర్టుల్లో తనిఖీలు: కేంద్ర మంత్రి రాజుపై రాబర్ట్ వాద్రా విమర్శలు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజుపై సోషల్ మీడియా వెబ్‌సైట్ ఫేస్‌బుక్ వేదికగా చేసుకొని కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ విమర్శలు మంత్రి అశోక్ గజపతిరాజుని లక్ష్యంగా చేసుకుని చేయడం గమనార్హం.
దేశంలోని విమానాశ్రయాల్లో వీఐపీ హోదా కోల్పోయిన ఆయన, తొలుత సానుకూలంగానే స్పందించినా, నిత్యం విమానాశ్రయాల్లో తనిఖీల పేరుతో సహనం కోల్పోయారు. ఎయిర్ పోర్టు తనిఖీ అధికారులు ఆదేశిస్తే కోటులు తొలగించాం, బెల్టులూ తీసేశాం. కానీ కొంత మంది మంత్రి స్ధానంలో ఉండి అన్ని భద్రతా నిబంధనలను యధేచ్చగా ఉల్లంఘిస్తున్నారంటూ బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ.. తాను అగ్గిపెట్టెతోనే విమానాలు ఎక్కుతానని కానీ తనను ఎపుడు కూడా తనిఖీలు చేయలేదంటూ వ్యాఖ్యానించి వివాదంలో చిక్కుకున్న విషయం తెల్సిందే. దీంతో కౌంటర్‌గా రాబర్ట్ వాద్రా విమర్శనాస్త్రాలు సంధించినట్లు అందరూ భావిస్తున్నారు.

లోకసభ సమావేశాల్లో సోమవారం కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ విమానాశ్రయాల్లో పార్లమెంట్ సభ్యులతో పాటు వీఐపీ ప్రయాణికులకు కల్పిస్తున్న ప్రత్యేక సదుపాయాలను, ప్రొటోకాల్స్‌ను కుదించాలన్న ప్రతిపాదన ఏదీలేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో వీఐపీలు, ఎంపీలకు రిజర్వ్‌డ్ లాంజ్‌ను ఇవ్వడంతోపాటు టెర్మినల్ భవనం, సందర్శకుల గ్యాలరీల్లోకి ఉచిత ప్రవేశాన్ని కల్పించడం వంటి మరికొన్ని ఇతర ప్రత్యేక సదుపాయాలను కల్పించడం జరుగుతోందని, అలాగే ఎంపీల వ్యక్తిగత సిబ్బందికి ఎయిర్‌పోర్టు ఎంట్రీపాస్‌లు ఇవ్వడం జరుగుతోందని, అంతేకాకుండా పైన పేర్కొన్న అన్ని సదుపాయలు ఎంపీలకు సరిగా అందేలా చూసేందుకు ప్రతి విమానాశ్రయంలో ఒక అధికారిని ప్రొటోకాల్ అధికారిగా నియమించామని మంత్రి వెల్లడించారు.
వీఐపీలు, ఎంపీలకు కల్పిస్తోన్న కల్పిస్తున్న ప్రత్యేక సదుపాయలు, ప్రొటోకాల్స్‌ను ప్రైవేటు విమానాశ్రాయలు, విమానయాన సంస్థలు సహా సంబంధిత అధికారులంతా అనుసరించాల్సిందేనని అశోక్ గజపతిరాజు స్పష్టం చేసిన నేపథ్యంలో రాబర్ట్ వాద్రా పైవిధంగా వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications