విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖపట్నం: రింగు వలలు అంటే ఏంటి, మత్స్యకారుల మధ్య కొట్లాటకు ఇవి ఎలా కారణమవుతున్నాయి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
రింగు వలల వివాదం

విశాఖ నగరంలో ఉన్న పెదజాలరిపేట, చినజాలరిపేట మత్స్యకారుల మధ్య వివాదం రేగింది. సముద్రంలో ఒక వర్గాన్ని మరో వర్గం బోట్లపై వెంటాడింది. సముద్రంలోనే ఆరు బోట్లకు నిప్పుపెట్టారు.

దీంతో తీరంలో ఏం జరుగతుందో తెలియని స్థితిలో పోలీసులతో పాటు నేవీ, కోస్ట్ గార్డు సిబ్బంది రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. సినిమాల్లోని సీన్లను తలపించేలా జరిగిన ఈ సంఘటనలకు కారణలేంటి? ఈ గొడవకు మూలాలెక్కడ? అధికారులు, ప్రజాప్రతినిధులు ఏమంటున్నారు?

చేపలు పట్టేందుకు కొందరు మత్స్యకారులు రింగు వలల వాడుతుండటమే ఈ వివాదానికి కారణం. విశాఖ తీరంలో పదే పదే రింగు వలల వివాదం మత్స్యకార వర్గాల మధ్య నడుస్తుంది. అయితే, మంగళవారం నాడు పరిస్థితి ఎప్పుడు లేనంత ఉద్రిక్తంగా మారింది.

ఏడాదిన్నర కాలంగా విశాఖలోని మత్స్యకారుల మధ్య రింగు వలల విషయమై ఘర్షణలు జరుగుతున్నాయి. పెదజాలరిపేట, చిన జాలరిపేట మత్స్యకారుల మధ్య రేగిన వివాదంత, బోట్లకు నిప్పుపెట్టుకోవడంతో వంటి సంఘటనలతో పెదజాలరిపేటతో పాటు పరిసర ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు.

రింగు వలల వివాదం

మంగళవారం తీరంలో ఏం జరిగింది?

వలల విషయంలో మత్స్యకార వర్గాల మధ్య చాలా నెలలుగా వివాదం కొనసాగుతోంది. మంగళవారం ఉదయం చినజాలరిపేటకు చెందిన కొందరు మత్స్యకారులు పెదజాలరిపేట తీరంలో రింగు వలలతో చేపల వేట చేస్తున్నారనే విషయం పెదజాలరిపేట మత్స్యకారులకు తెలిసింది.

వెంటనే పెదజాలరిపేట మత్స్యకారులు బృందాలుగా ఏర్పడి పడవలపై సముద్రంలోకి బయలుదేరారు. రింగు వలలు వేసిన చినజాలరిపేట మత్స్యకారులు కనపడగానే ఇరు వర్గాల మధ్య సముద్రం మధ్యే వాగ్వివాదం తీవ్ర స్థాయిలో జరిగింది. అనంతరం ఒక బోటుకు నిప్పుపెట్టారు. మరి కాసేపటికి ఒక్కొక్కటిగా మొత్తం ఆరు బోట్లు తలగబడ్డాయి. అయితే ఎవరి బోటుకు ఎవరు నిప్పుపెట్టారనే విషయం తెలియలేదు.

సమద్రంలో బోట్లకు నిప్పుపెట్టడంతో పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నేవీ, కోస్టు గార్డు సిబ్బందికి కూడా వెంటనే అక్కడకి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నేవీ అధికారులు ఏకంగా హెలికాప్టర్లను రంగంలోకి దింపి తీరంలో ఏం జరుగుతోందనే విషయంపై ఉదయం నుంచి సాయంత్రం వరకు పెట్రోలింగ్ చేశారు.

రింగు వలల వివాదం

రింగు వలలు అంటే?

మత్స్యకారుల మధ్య వివాదానికి కారణం రింగు వలలు. మత్స్యకారులు వేట కోసం అనేక రకాల వలలను వినియోగిస్తుంటారు. వీటిలో రింగు వల, బల్ల వల, అల్లి వల, పోస వల ఇలా అనేక వలలు ఉంటాయి. చేప రకం, వేట చేసే స్థలం, వేట చేసే సీజన్ బట్టి ఈ వలలను వాడుతుంటారు. కోనాం, సొర, వంజరం, కవ్వళ్లు, సందువ, వంటి రకరకాలైన చేపలను పట్టేందుకు అనుగుణంగా ఈ వలలను వాడతారు.

వలలు తయారు చేసేటప్పుడే అందులో ఏ సైజు చేప చిక్కాలి అనే లెక్కలేసుకుని దానికి తగ్గట్టుగానే వలకు పెట్టే ఖాళీ (నెట్ హాల్) సైజుని నిర్ణయిస్తారు. ఈ హాల్ ను మత్స్యకారులు కళ్లు, అచ్చు, మెడ అని మూడు రకాలైన పేర్లతో పిలుస్తారు. పెద్ద చేపలను వేటాడే మత్స్యకారుల వలలో పడిన చిన్న చేపలు సముద్రంలోకి వెళ్ళి పోయేలా వలల కళ్లు పరిమాణం ఉంటుంది.

అయితే, ఇటువంటి లెక్కలు లేకుండా ఎటువంటి చేపలనైనా పట్టేందుకు మిగతా వలల కంటే భిన్నంగా ఉండేవే రింగు వలలు. వలను సముద్రంలో వేసిన తర్వాత అది అటు ఇటు జరిగిపోకుండా, లేదంటే పైకి తేలిపోకుండా చేపలు చిక్కేందుకు వీలుగా గిన్నెలాగా ఉండేందుకు ఈ వలకు దిగువ భాగాన బరువుగా ఉండే రింగులను వేలాడదీస్తారు. అందుకే ఈ వలలను రింగు వలలు అంటారు.

"ఈ వలలో చిక్కితే ఏ చేప కూడా మళ్లీ సముద్రంలోకి పోలేదు. దాంతో మత్స్యసంపద వృద్దికి అసవరమైన పిల్ల చేపలు కూడా ఈ వలలో చిక్కుకుంటాయి. సంప్రదాయ మత్స్యకారులమైన మేము చేపల వృద్ధి కోసం చిన్న చేపలను వేటాడం. రింగు వలలో చిన్న చేపలు పెద్ద సంఖ్యలో చిక్కుతాయి. అవి బయటకు పోలేవు. రింగు వలల కళ్లు అంత చిన్నగా ఉంటాయి. చిన్న చేపలైన నెత్తళ్లు వంటివి కిలోమీటర్ల మేర సముహాలుగా ఉంటాయి. అర కిలో మీటరు నుంచి కిలోమీటరు వ్యాసార్థం వరకు ఉండే నెత్తళ్ల సముహాలను సైతం ఈ రింగువలలు చుట్టిపడేస్తాయి. అందుకే వీటిని కనీసం పది నుంచి పదిహేను బోట్ల సహాయంతో 30 నుంచి 50 మంది కలిసి సముద్రంలో వేస్తారు. దాంతో, రింగువలలతో వేట చేసే పరిసరాల్లో మాలాంటి సంప్రదాయ మత్స్యకారులకు చేపలు దొరకవు. దీంతో మేం జీవనోపాధిని కోల్పోతున్నాం" అని శంకరరావు అనే మత్స్యకారుడు తెలిపారు.

రింగు వలల వివాదం

రింగు వలలు ఎందుకు వాడుతున్నారు?

వేటకు వెళ్లే సమయంలో మత్స్యకారులు వినియోగించే వలలు, తీరం నుంచి వేట చేసే దూరం, వేటాడే చేపల రకం వంటి వాటిపై మత్స్యశాఖ నిబంధనలు పెట్టింది. ఆ నిబంధనల ప్రకారం రింగు వలలను తీరానికి ఎనిమిది కిలోమీటర్ల దూరం తర్వాతే వినియోగించాలి. ఆ లోపు వినియోగించడంపై నిషేధం ఉంది. ఎందుకంటే ఆ 8 కిలోమీటర్ల ఇవతల మత్స్య సంపద వృద్ధికి అవసరమైన చేపలు, సంతానోత్పతికి సిద్ధంగా ఉండే చేపలు ఉంటాయి. అలాగే పరిమాణంలో చిన్నసైజు చేపలు కూడా ఇక్కడే ఉంటాయి. ఇటువంటి చేపలే మత్స్య సంపద వృద్ధికి దోహదపడతాయని మత్స్యశాఖ అధికారులు తెలిపారు.

అయితే, కొందరు విశాఖలోని కొందరు మత్స్యకారులు రింగువలలతో ఎనిమిది కిలోమీటర్ల ఇవతల, అంటే నిత్యం సంప్రదాయ మత్స్యకారులు (చిన్న చిన్న పడవలు, తెప్పలపై వేట సాగించేవారు) వేట చేసే పరిసరాల్లో ఈ వలలను వేసి చేపలను పడుతున్నారని, ఇదే వివాదానికి మూలమని మత్స్యకారులు అంటున్నారు. ఈ వివాదం కేవలం విశాఖకు మాత్రమే కాదు...తీర ప్రాంతమున్న అన్ని జిల్లాల్లోనూ ఉంది.

"మేం నిత్యం ఇక్కడే (పెదజాలరిపేట)లో వేట చేసుకుని మా జీవనోపాధి పొందుతున్నాం. తెల్లారే వేటకు వెళ్లి మా మత్స్యకార సంఘాలు నిర్ణయించిన విధంగా ఒక్కొ పడవ పది, ఇరవై కేజీలు అన్ని కుదిరితే ఒక 50 కేజీల వరకు చేపలు పట్టుకొస్తాం. వాటినే అమ్ముకుని జీవనం సాగిస్తాం. కానీ, కిలోమీటర్ల పొడవుండే రింగు వలలతో ఒకే సారి టన్నుల కొద్ది చేపలు పట్టుకుపోతున్నారు. అది కూడా 8 కిలోమీటర్ల ఇవతల వేట చేసి మా పొట్ట కొడుతున్నారు. రింగు వలల వేసిన తర్వాత మళ్లీ మాకు ఆ ప్రాంతంలో చేప చిక్కదు. మళ్లీ కొన్ని నెలల తర్వాతే అక్కడికి చేప వస్తుంది. మెకనైజ్డ్ బోట్లతో వేట చేసే వారు రింగు వలలను వాడుతున్నారు. రింగు వలల ఖరీదు రూ. 2 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటుంది. ఇంత ఖరీదైన వలలతో వేట చేసే వారితో మేం పోటిపడలేం." అని పెదజాలరిపేటకు చెందిన మత్స్యకారుడు వాసుపల్లి గంగబాబు బీబీసీతో చెప్పారు.

రింగు వలల వివాదం

'సముద్రంలో లెక్క మాకు తెలుసు'

రింగు వలలకు సంబంధించి చాలాకాలంగా జాలర్ల మధ్య వివాదం జరుగుతోంది. రింగు వలలను నిషేధించాలని, వీటి వల్ల చేపల ఉత్పత్తి తగ్గుతుందని...తమకు వచ్చే చేపల వాటా కూడా తగ్గుతుందని సంద్రదాయ మత్స్యకారులు అంటున్నారు. అయితే, రింగు వలలు వాడే వారి వాదన మరో విధంగా ఉంది.

"రింగు వలలు పెద్దవిగా, కళ్లు చిన్నవిగా ఉంటాయి. అందుకే ఈ వలల్లో ఎక్కువ చేపలు పడతాయి. ఒకేసారి ఎక్కువ చేపలు పట్టుకునేందుకే రింగువలలు వాడతాం. అయితే 8 కిలోమీటర్ల ఇవతల వేట చేస్తున్నామనేది అబద్ధం. రోజు సముద్రంలో తిరగే మాకు ఆ లెక్కలు తెలుసు. మాకు ఎక్కువ సందప చిక్కుతుందని...కొందరు కావాలనే అప్పుడప్పుడు రాద్ధాంతం చేస్తుంటారు. 8 కిలోమీటర్ల అవతలే మేం ఎప్పుడైనా వేట చేస్తాం. మా వెనుక నాయకులు, అధికారులు ఉన్నారనే మాట కూడా అవాస్తవం. రింగు వలలు వాడుతున్నామంటూ మా మీద తరచూ దాడులు చేస్తున్నారు. రింగు వలల వివాదంపై కోర్టులో కేసు నడుస్తోంది. ఇంకా తీర్పు రావాల్సి ఉంది. తీర్పు ఎలా వస్తే అలా నడుచుకుంటాం" అని యారాడ మత్స్యకార గ్రామానికి చెందిన రామారావు చెప్పారు.

రింగు వలల వివాదం

దాడులు చేస్తే సహించం

ఈ రింగు వలల వివాదం చాలా రోజులుగా నడుస్తుండటంతో దీనిపై గతంలో అధికారులు, మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులందరితో కూడా మత్స్యకార వర్గాలు చర్చలు జరిపాయి. ఎప్పటికప్పుడు సామరస్యంగా పరిష్కరించుకోవాలని మత్స్యకార వర్గాలకు సూచించినా...తరచూ ఉద్రిక్తత, వివాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజా వివాదంపై మత్స్యకార సంఘాలతో పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడారు.

"ఈ సమస్యపై గతంలోనే నేను మత్స్యకారులతో మత్స్యశాఖ మంత్రి, నేను సమావేశమై చర్చించాం. సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించాం. అలాగే నిబంధనలను పాటించాలని కూడా చెప్పాం. ఈ విషయాన్ని సీఎం దృష్టికి కూడా తీసుకుని వెళ్తానని కూడా తెలిపాం. మళ్లీ ఈ స్థాయిలో ఇరు వర్గాల మధ్య వివాదం చేలరేగడం దురదృష్టకరం. మత్స్యశాఖ అధికారులు, మత్స్యకార సంఘాలు, మెరైన్ పోలీసులతో మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాం" అని శ్రీనివాస్ అన్నారు.

అయితే, బోట్లు దగ్గం చేయడం దారుణమని వ్యాఖ్యానించిన మంత్రి, " ఎవరి బోట్లను ఎవరు తగలబెట్టారనే విషయం తెలుసుకుని చర్యలు తీసుకుంటాం" అని హామీ ఇచ్చారు. అన్నాదమ్ముళ్లలా కలిసి వేటను కొనసాగించాల్సిన వారి మధ్య కొంతమంది స్వలాభం కోసం చిచ్చు పెడుతున్నారని కూడ అవంతి శ్రీనివాస్ ఆరోపించారు.

రింగు వలల వివాదం

కేసు నమోదు

ఈ ఘటనలపై మెరైన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు.

పరిస్థితి ఇంకా అదుపులోకి రాకపోవడంతో, శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా 144 సెక్షన్ విధించామని, పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేశామని సిన్హా చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Visakhapatnam: What are ring nets and how do they cause fights among fishermen
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X