విజయనగరం: ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఒమిక్రాన్ కేసు.. విశాఖపట్నంలో ఐసోలేషన్‌లో 30 మంది

ఒమిక్రాన్

ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదైంది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం వీరనారాయణం గ్రామంలో ఈ కేసు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ ధ్రువీకరించింది.

ఐర్లాండ్‌ నుంచి ముంబయి వచ్చిన ఓ ప్రయాణికుడికి మొదట ముంబయిలో కోవిడ్‌ పరీక్ష చేయగా, ఫలితం నెగటివ్‌ వచ్చింది. దాంతో, ఆయన ముంబయి నుంచి విమానంలో విశాఖపట్నం చేరుకున్నారు.

విశాఖపట్నం విమానాశ్రయంలో మళ్లీ నమూనాలు ఇచ్చి స్వగ్రామానికి వెళ్లారు. అయితే గ్రామంలో కూడా ఆయన నమూనాలు సేకరించి విజయనగరంలో పరీక్ష చేయించారు.

ఈ పరీక్షల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత అతడి నమూనాలను హైదరాబాద్‌ పంపి పరీక్ష చేయించగా, అది ఒమిక్రాన్ వేరియంట్ అని నిర్ధరణైంది.

ఆయన్ను ప్రస్తుతం విశాఖపట్నంలో ఐసొలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఒమిక్రాన్

నాలుగు రోజుల క్రితం జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు....

ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారందరికి ఒమిక్రాన్ వేరియంటే వచ్చిందంటూ వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి.

రెండు రోజుల క్రితం కూడా శ్రీకాకుళం జిల్లాలో ఒమిక్రాన్ కేసు బయటపడిందంటూ సోషల్ మీడియాలో కలకలం రేగింది.

అయితే అందులో నిజం లేదంటూ జిల్లా వైద్యశాఖ అధికారులు ఖండించారు. కానీ ఆదివారం విజయనగరానికి చెందిన ఒక వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ రిపోర్టు వచ్చిదనే విషయాన్ని ఆ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి అరుణకుమారి తెలిపారు.

విజయనగరం జిల్లా వీరనారాయణం గ్రామానికి చెందిన వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ రావడంతో అతని శాంపిల్స్ సేకరించారు.

వాటిని ఒమిక్రాన్ నిర్ధరణ పరీక్షల కోసం నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌కు పంపించారు. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ పరీక్షల అనంతరం ఇవాళ ఆయన ఒమిక్రాన్ పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది.

ప్రస్తుతం బాధితుడు విశాఖపట్నం మధురవాడ ప్రాంతంలో ఉండటంతో.. ఆయనను, ఆయనతో పాటు మరో 30 మందిని ఐసోలేషన్‌లో ఉంచి వైద్యం అందిస్తున్నారు. ప్రజలు అందరూ మాస్కులు ధరించాలని వైద్యాధికారులు తెలిపారు.

ఒమిక్రాన్

ఒమిక్రాన్ జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలు

ఒమిక్రాన్‌ వేరియంట్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాము ఇప్పటికే విడుదల చేసిన గైడ్ లైన్స్ పాటించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

అలాగే కొత్త వేరియంట్‌పై కేంద్రం ఎయిర్‌ పోర్టులకు గైడ్‌ లైన్స్‌ కూడా విడుదల చేసింది. ఒమిక్రాన్‌ ప్రభావం ఉన్న దేశాల నుంచి వచ్చినవారికి, టెస్టింగ్‌ తప్పనిసరి అని కేంద్రం ప్రకటించింది.

వ్యాక్సిన్‌తో సంబంధం లేకుండా విమానాశ్రయాల్లో టెస్టింగ్స్‌ తప్పనిసరి చేసింది. ఈ పరీక్షల్లో పాజిటివ్‌ వస్తే, బాధితులను ఎయిర్ పోర్టు నుంచే నేరుగా క్వారంటైన్‌కు తరలించాలని స్పష్టం చేసింది.

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేసి, నెగిటివ్‌ వస్తేనే ఎయిర్‌ పోర్టు నుంచి బయటకు వెళ్లడానికి అనుమతించాలని ఆదేశించింది.

ఆర్టీపీసీఆర్‌లో పాజిటివ్ వచ్చిన వ్యక్తుల శాంపిల్స్‌ సేకరించి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం పంపాలని కేంద్రం సూచించింది.

ఒమిక్రాన్

రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒమిక్రాన్ విషయంలో పాటించాల్సిన మార్గదర్శకాలను విడుదల చేసింది.

కేంద్ర ప్రభుత్వం, డబ్ల్యూహెచ్‌వో విడుదల చేసిన గైడ్‌లైన్స్‌ ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించింది.

అలాగే బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించకపోతే రూ.100 జరిమానా, మాస్కులు లేకుండా షాపులు, వాణిజ్య ప్రదేశాల్లోకి అనుమతిస్తే యాజమాన్యానికి రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకూ జరిమానా విధించనున్నారు.

దీనితోపాటూ నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలను రెండు రోజులు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారి సమాచారాన్ని 8010968295 నంబరుకు తెలియజేయాలని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అలాగే ప్రజలందరూ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి చేయాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+