• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వనపర్తి: రూ. 10 వేలు ఎంటర్ చేస్తే రూ. 50 వేలు ఇస్తున్న ఏటీఎం, ఎగబడిన జనం - ప్రెస్ రివ్యూ

By BBC News తెలుగు
|

ఏటీఎంలో డబ్బులు తీస్తున్న ఖాతాదారులు

తెలంగాణలోని అమరచింతలోని ఒక ఏటీఎంలో రూ.100 నోట్లకు బదులు రూ.500 నోట్లు వచ్చాయని, దీంతో డబ్బు డ్రా చేసుకోడానికి జనం ఎగబడ్డారని ఆంధ్రజ్యోతి దిన పత్రిక కథనం ప్రచురించింది.

అది వనపర్తి జిల్లా అమరచింతలోని ఇండియావన్‌ ఏటీఎం కేంద్రం..! శనివారం ఆ ఏటీఎం కేంద్రానికి జనాలు క్యూకట్టారు.

డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు ఎగబడ్డారు. నోట్ల రద్దు తర్వాత ఏటీఎం కేంద్రాలకు పెరిగినంతగా డిమాండ్‌ నెలకొంది.

అందుకు కారణం.. రూ. 100 నోటు బదులు రూ. 500 రావడమే..! తొలుత ఓ కస్టమర్‌ రూ. 4 వేలు విత్‌డ్రా చేసుకోగా.. వంద నోట్ల స్థానం లో ఐదొందల నోట్లు వచ్చాయి. మొత్తం రూ. 20 వేలు చేతికి అందాయని పత్రిక రాసింది.

దాంతో అతడు అవాక్కయ్యాడు. అతని ద్వారా విషయం చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. దాంతో.. ఆ ఏటీఎం కేంద్రానికి బ్యాంకు ఖాతాదారుల తాకిడి పెరిగింది.

డబ్బులు డ్రా చేసుకోవడానికి జనాలు ఎగబడ్డారు. అటుగా వచ్చిన పెట్రోలింగ్‌ సిబ్బంది.. విషయాన్ని ఆరా తీశారు. వెంటనే ఏటీఎం కేంద్రానికి తాళం వేయించి, నిర్వాహకులకు సమాచారం అందించారు.

ఏటీఎంలో నగదును లోడ్‌ చేసినప్పుడు.. రూ. 100 నోట్ల ట్రేలో రూ. 500 నోట్లను పొరపాటున పెట్టినట్లు అధికారులు గుర్తించారు. ఇలా మూడు రోజుల్లో రూ. 5.88 లక్షల మేర అతనపు విత్‌డ్రావల్స్‌ జరిగినట్లు లెక్క తేల్చారు.

అదనంగా డబ్బులు డ్రా అయిన వారు స్వచ్ఛందంగా వెనక్కి ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో పోలీసులకు ఫిర్యాదు చేసి, డబ్బులు రికవరీ చేస్తామని ఏటీఎం ఏజెన్సీ టెక్నికల్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌ హెచ్చరించారని ఆంధ్రజ్యోతి వివరించింది.

కేంద్ర మంత్రి హర్షవర్ధన్

ఏపీలో పాజిటివిటీ రేటుపై ఆందోళన వ్యక్తం చేసిన కేంద్రం

ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండడంతో కేంద్రం ఆందోళన వ్యక్తం చేసినట్లు ఈనాడు దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

ఆంధ్రప్రదేశ్‌లో పాజిటివిటీ రేటు ఏప్రిల్‌ తొలినాళ్ల నుంచి పెరిగిపోతుండటంపై కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

వారం వృద్ధిరేటు అత్యధికంగా 30% వరకు ఉందని, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో పరిస్థితులు గంభీరంగా ఉన్నాయని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లోని కొవిడ్‌ స్థితిగతులపై శనివారం ఆయన వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు.

ప్రస్తుతం దేశంలో నిరంతరం కొవిడ్‌ కేసుల పెరుగుదల కనిపిస్తున్న 8 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో ఉంది.

కేంద్ర వైద్యఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌అగర్వాల్‌ శనివారం విలేకర్ల సమావేశంలో విడుదల చేసిన డేటా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందులో తమిళనాడు తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది.

గత రెండువారాలుగా నిరంతరం కేసులు పెరుగుతున్న జిల్లాలు 15 ఉండగా అందులో ఆరో స్థానంలో తూర్పుగోదావరి, పదో స్థానంలో విశాఖపట్నం, 12వ స్థానంలో కడప జిల్లాలు ఉన్నాయి.

క్రియాశీలక కేసుల పరంగా ఆంధ్రప్రదేశ్‌ 5వ స్థానం(2,03,787)లో నిలిచింది. దేశంలోని 516 జిల్లాల్లో 10%కి మించి పాజిటివిటీ రేటు ఉండగా, వాటిలో ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలున్నాయని ఈనాడు వివరించింది.

స్థానికంగా కరోనా కట్టడే కీలకం-ప్రధాని మోదీ

రాష్ట్రాలు కోవిడ్-19 గణాంకాలను పారదర్శకంగా వెల్లడించాలని మోడీ సూచించినట్లు సాక్షి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు మెరుగుపర్చాలని, ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహించాలని, లక్షణాలున్న వారిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

అధిక పాజిటివిటీ రేటున్న జిల్లాల్లో స్థానిక కట్టడియే ప్రస్తుత దశలో అత్యంత కీలకమన్నారు. కోవిడ్‌-19 నియంత్రణ, వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై ప్రధాని మోదీ శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఆక్సిజన్‌ సరఫరాకు ప్రణాళికను రూపొందించాలని, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు అందించడంతో పాటు ఇతరత్రా అన్ని అవకాశాలను పరిశీలించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారని పత్రిక చెప్పింది.

ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, ప్రాణవాయువును అందించే ఇతరత్రా ఉపకరణాల వినియోగంపై ఆరోగ్య కార్యకర్తలకు అవసరమైన శిక్షణ ఇవ్వాలని, వీటి వినియోగానికి వీలుగా గ్రామీణ ఆసుపత్రుల్లో నిరంతర విద్యుత్‌ ఉండేలా చూడాలన్నారు.

దేశంలో పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో నియంత్రణకు స్థానికంగా అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు.

అధిక పాజిటివిటీ రేటు ఉన్న ప్రాంతాల్లో ఆర్టీ-పీసీఆర్, ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు.. రెండింటినీ ఉపయోగించి కరోనా పరీక్షలను మరింత పెంచాలని ప్రధాని ఆదేశించారు.

రాష్ట్రాలు పారదర్శకంగా కోవిడ్‌-19 గణాంకాలను వెల్లడించేలా ప్రోత్సహించాలన్నారని సాక్షి రాసింది.

తమ ప్రభుత్వాల కృషిపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఎలాంటి ఒత్తిడి లేకుండా పారదర్శకంగా గణాంకాలను కేంద్రానికి నివేదించాలని ఆయన అన్నారు.

కొత్త కేసులు, మరణాల సంఖ్యలు పలు రాష్ట్రాలు తక్కువ చేసి చూపుతున్నాయని వార్తలు వెలువడిన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

కరోనా మహమ్మారి సంక్రమణను ఆపేందుకు అవసరమైన ఇంటింటికీ పరీక్షలు, నిరంతర నిఘాకు వీలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ వనరులను పెంచాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారని సాక్షి వివరించింది.

హైదరాబాద్ యువతికి రూ.2 కోట్ల వార్షిక వేతనం

హైదరాబాద్ యువతికి రూ.2 కోట్ల వార్షిక వేతనంతో అమెరికాలోని మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం వచ్చిందని నమస్తే తెలంగాణ దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

హైదరాబాద్‌కు చెందిన నర్కుటి దీప్తి అమెరికాలోని మైక్రోసాఫ్ట్‌ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగానికి రూ.2 కోట్ల వార్షిక ప్యాకేజీతో క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఎంపికయ్యారని తెలిపింది.

హైదరాబాద్‌ పోలీస్‌ క్లూస్‌ టీమ్‌ విభాగంలో సైంటిస్ట్‌ డాక్టర్‌ వెంకన్న కుమార్తె దీప్తి ఈ ఘనత సాధించారు.

2019లో దీప్తి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. వర్సిటీ ఆఫ్‌ ఫ్లోరిడాలో ఎంఎస్‌ (కంప్యూటర్స్‌) ఈ నెల 2న పూర్తిచేశారు.

కోర్సు పూర్తి కాకముందే వర్సిటీలో క్యాంపస్‌ ఇంటర్వ్యూలు జరిగాయి. గోల్డ్‌మన్‌ సాక్స్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి సంస్థలు దీప్తికి ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకొచ్చాయని పత్రిక రాసింది.

ఆమె మైక్రోసాఫ్ట్‌ వైపు మొగ్గుచూపారు. సాధారణంగా ఎంఎస్‌ విద్యార్థులకు న్యూగ్రేడ్‌ పొజిషన్‌ కింద కంపెనీలు ఆఫర్‌చేస్తుంటాయి.

అందుకు భిన్నంగా దీప్తి ఎస్‌డీఈ (సాఫ్ట్‌వేర్‌ డెవెలప్‌మెంట్‌ ఇంజినీర్‌) గ్రేడ్‌-2కు ఎంపికయ్యారు.

300 మంది విద్యార్థుల్లో అత్యధిక జీతంతో దీప్తి ఉద్యోగానికి ఎంపికయ్యారని కథనంలో రాశారు.

ఈ నెల 17న సియాటెల్‌ నగరంలోని మైక్రోసాఫ్ట్‌ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలు తీసుకోబోతున్నదని దీప్తి తండ్రి వెంకన్న తెలిపారని నమస్తే తెలంగాణ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Wanaparthy:ATM gives Rs.50000 when Rs.10000 is entered
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X