అర్ద్రరాత్రి పార్లమెంట్ లో ఉత్కంఠ - ఎట్టకేలకు..!!
అర్ద్రరాత్రి వరకు పార్లమెంట్ లో ఉత్కంఠ కొనసాగింది. రెండు రోజుల పాటు జరిగిన సుదీర్ఘ చర్చ, తీవ్రస్థాయి వాదోపవాదాల అనంతరం వక్ఫ్ (సవరణ) బిల్లు-2025పై పార్లమెంటు ఆమోదముద్ర పడింది. విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్యే లోక్‌సభలో బిల్లును ఆమోదించారు. రాజ్యసభలో చర్చ మొదలైన సమయం నుంచి వాడీ వేడి చర్చ కొనసాగింది. అనేక సవరణలు ప్రతిపాదనలతో ఉత్కంఠ పెరిగింది. అర్ద్రరాత్రి తరువాత పెద్దల సభలో జరిగిన ఓటింగ్ లో బిల్లుకు ఆమోదం లభించటంతో.. ఇప్పుడు రాష్ట్రపతి వద్దకు బిల్లు పంపనున్నారు.
అర్ద్రరాత్రి ఉత్కంఠగా
ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించిన వక్ఫ్ (సవరణ) బిల్లు కు పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. రాజ్యసభలో అర్ద్రరాత్రి దాటే వరకు హోరా హోరీ చర్చ సాగింది. విమర్శలు - ప్రతి విమర్శలతో సభ హోరెత్తింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు సమాధానం అనంతరం సవరణల వారీగా ఓటింగ్ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటు వేసారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. బుధవారం లోక్ సభలోనూ సుదీర్ఘ చర్చ తరువాత ఆమోదం పొందిన సవక్ఫ్ (సవరణ) బిల్లు.. రాజ్యసభ ముందుకు వచ్చింది. కాగా, సభలో బిల్లు ను కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు ప్రారంభించారు.

హోరా హోరీ వాదనలు
కొందరు విపక్ష సభ్యులు వక్ఫ్ (సవరణ) బిల్లుకు నిరసనగా నల్ల బ్యాడ్జీలతో సభకు హాజరు అయ్యారు. వక్ఫ్ (సవరణ) బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని.. ఏ ఒక్కరి మత విశ్వాసాలను దెబ్బ తీయటం ప్రభుత్వ ఉద్దేశం కాదని వెల్లడించారు. సంక్లిష్టతలను తెలిగించి పారదర్శకత తీసుకురావటంతో పాటుగా సాంకేతికతను ప్రవేశ పెట్టటం ద్వారా వక్ఫ్ బోర్డు పనితీరు మెరుగు పర్చటమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. ఈ బిల్లుకు మతంతో ఎలాంటి సంబంధం లేదని.. అన్ని వర్గాలకు చెందిన ముస్లింలకు వక్ఫ్ బోర్డు పరిధిలోకి తీసుకొస్తామని వివరించారు. 2004 లో 4.9 లక్షలుగా ఉన్న వక్ఫ్ ఆస్తులు.. ఇప్పుడు 8.72 లక్షలుగా పెరిగినట్లు చెప్పుకొచ్చారు.
పార్లమెంట్ ఆమోదం
గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు నెరవేర్చని లక్ష్యాల కోసమే ఈ బిల్లు తీసుకొచ్చినట్లు వివరించారు. మద్దతు ఇవ్వాల్సిందిగా విపక్షాలను కోరారు. ముస్లిం హక్కులను హరిస్తున్నట్లు ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టారు. షియా, సన్నీలతో ఇతర వెనుకబడిన తరగతుల వారు వక్ఫ్ బోర్డు సభ్యులుగా కొనసాగేలా నిబంధనలు చేర్చామని చెప్పారు. కాగా, వక్ఫ్ (సవరణ) బిల్లుకు ఇండియా కూటమి వ్యతిరేకించింది. మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకే ఈ బిల్లును ఎన్డీఏ తీసుకొచ్చిందని ఆరోపించాయి. జేపీసీలో ప్రతిపక్షాలు చేసిన ఏ ఒక్క సిఫార్సు బిల్లులో చేర్చలేదని మండిపడ్డారు. అంతకు ముందు విపక్ష నేత ఖర్గే సభలో చేసిన వ్యాఖ్యలతో వాగ్వాదం చోటు చేసుకుంది. అర్ద్రరాత్రి తరువాత రాజ్యసభలో ఆమోదంతో వక్ఫ్ (సవరణ) బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. ఈ బిల్లును రాష్ట్రపతి సంతకం కోసం పంపనున్నారు.












Click it and Unblock the Notifications