
Viral video : వీధుల్లో ప్రత్యక్షమైన మొసలి... భయభ్రాంతులకు గురైన జనం...
కర్ణాటకలోని కోగిలబన్న గ్రామ వీధుల్లో హఠాత్తుగా ఓ మొసలి ప్రత్యక్షమైంది. గురువారం(జులై 1) తెల్లవారుజామున 7గంటల సమయంలో ఆ మొసలి వీధుల్లో తిరుగుతూ కనిపించింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దాదాపు 45 నిమిషాల పాటు శ్రమించిన అధికారులు ఎట్టకేలకు దాన్ని బంధించి తీసుకెళ్లి సమీపంలోని నదిలో వదిలారు.
మొసలి వీధుల్లో తిరుగుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానికులు మొసలికి దూరంగా నిలబడి సెల్‌ఫోన్లలో దాన్ని చిత్రీకరించారు. కోగిలబన్న గ్రామానికి 5కి.మీ దూరంలో ఉన్న 'కలి' నది నుంచి ఈ మొసలి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. 'ఆ మొసలి నది నుంచే వచ్చింది. దాదాపు అరగంట పాటు వీధుల్లో కలియతిరిగింది. మొసలిని చూడగానే మేమంతా ఆశ్చర్యపోయాం. దూరం నుంచే దాన్ని గమనించి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చాం.' అని సుధీర్ అనే స్థానికుడు వెల్లడించాడు.
Scenes from coastal Karnataka where a crocodile got up from the river and went to town pic.twitter.com/UWYK0ftwiM
— Soumya Chatterjee (@Csoumya21) July 1, 2021
అటవీశాఖ అధికారులు సిబ్బందితో వచ్చి దాదాపు 45 నిమిషాల పాటు శ్రమించి ఎట్టకేలకు దాన్ని బంధించగలిగారు. అనంతరం కలి నదిలోనే దాన్ని విడిచిపెట్టారు. కోగిలబన్న గ్రామం కలి నదిని ఆనుకుని ఉండటంతో ఇక్కడికి తరచూ మొసళ్లు వస్తుంటాయని అటవీ అధికారి తెలిపారు. ముఖ్యంగా గుడ్లు పెట్టే సమయంలో అవి గ్రామం వైపు వస్తుంటాయని అన్నారు.
ఇప్పటికైతే ఈ మొసళ్లు ఎవరి పైనా దాడి చేసినా దాఖలా లేదు. అయితే గతంలో ఓ మొసలి గ్రామంలోకి వచ్చి మేకపై దాడి చేసిందని తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఆ మొసలిని బంధించామని... ఆ మేక యజమానికి పరిహారం కూడా చెల్లించామని చెప్పారు. సాధారణంగా మొసళ్లు దాడులకు పాల్పడవని... అయితే మనుషుల అలికిడికి లేదా మనుషుల గుంపును చూస్తే అవి బెదిరిపోయి దాడులకు పాల్పడే అవకాశం ఉందని వెల్లడించారు.

మూడు రోజుల క్రితం శ్రీలంకలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అనురాధపురంలోని హబరగమాలో ఉన్న ఓ ఇంట్లోకి మొసలి దూరింది. 8 అడుగుల భారీ కాయంతో ఉన్న ఆ మొసలిని చూసి యజమాని గుండెలు అదిరిపోయాయి. వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించగా... హుటాహుటిన వారు అక్కడికి చేరుకున్నారు. దాదాపు 5 గంటల పాటు శ్రమించి దాన్ని బంధించగలిగారు.