బీజేపీలో కొందరు కాంగ్రెస్ తో డీల్ మాట్లాడి ?, మాజీ మంత్రి సంచలనం !
బెంగళూరు/రామనగర: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి బీజేపీలోని కొందరు నాయకుల రాజీ రాజకీయాలే కారణమని మాజీ మంత్రి, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి మీద పోటీ చేసి ఓడిపోయిన బీజేపీ నాయకుడు సీపీ. యోగేశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో ఉంటూనే ప్రత్యర్థి పార్టీ నాయకులతో కొందరు బీజేపీ నాయకులు డీల్ మాట్లాడుకోవడంతో కర్ణాకట అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని సీపీ. యోగేశ్వర్ బహిరంగంగా చెప్పడం కలకలం రేపింది.
బీజేపీకి చెందిన కొందరు నేతలు ప్రత్యర్థి పార్టీలతో పొత్తుపెట్టుకోవడమే బీజేపీ ఓటమికి కారణమని మాజీ మంత్రి సీపీ యోగేశ్వర్ అన్నారు. బెంగళూరులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్. సంతోష్‌తో భేటీ అనంతరం సీపీ, యోగేశ్వర్ విలేకరులతో మాట్లాడారు. కొన్ని ప్రాంతాల్లో బీజేపీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పొత్తు పెట్టుకున్నారని సీపీ యోగేశ్వర్ ఆరోపణలు చేశారు.

బీజేపీ నాయకులు కొందరు సర్దుబాటు రాజకీయాల్లో ఉన్నారని నాకు కూడా అనిపించింది. దీని గురించి నేను ఎక్కువ మాట్లాడదలచుకోలేదు. అది ఇప్పుడు అనవసరం అయిన సందర్బం కనుక నేను పూర్తి సమాచారం చెప్పడం లేదని, ఈ విషయంపై వివరంగా మాట్లాడితే రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయ ప్రకంపనలు తప్పవు అని మాజీ మంత్రి సీపీ. యోగేశ్వర్ అన్నారు. బీజేపీలోని ఎవరి పేరు ప్రస్తావించకుండానే మాజీ మంత్రి సీపీ. యోగేశ్వర్ ఇలాంటి ఆరోపణలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

బసరాజ్ బోమ్మయ్ ప్రభుత్వంలోని మంత్రివర్గ విస్తరణలో వైఫల్యం, అవినీతిపై కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు ఎదుర్కోకపోవడం కూడా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కారణమని మాజీ మంత్రి సీపీ. యోగేశ్వర్ అన్నారు. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, బీజేపీ మైసూర్ లోక్ సభ ఎంపీ ప్రతాప్ సింహా కూడా సొంత పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు.
రాజీ రాజకీయాలు బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో వెన్నుపోటు పొడిచిందని ఎవరి పేరు ప్రస్తావించకుండానే సీపీ యోగేశ్వర్ ఆరోపణలు చెయ్యడంతో బీజేపీ నాయకులు అయోమయంలో పడిపోయారు. అర్కావతి లేఔట్ డీనోటిఫికేషన్ వ్యవహారంలో విచారణకు ఎందుకు ఆదేశించలేదని మాజీ మంత్రి సీపీ యోగేశ్వర్ గత బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే కోరికను వ్యక్తం చేసిన సీపీ యోగేశ్వర్ ఈ విషయంలో పార్టీ నేతల నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని, అయితే అవకాశం వస్తే కచ్చితంగా 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని మాజీ మంత్రి సీపీ యోగేశ్వర్ చెప్పారు.












Click it and Unblock the Notifications