బీజేపీకి వరుస షాక్‌లు: టీఎంసీలో చేరిన మూడో ఎమ్మెల్యే బిశ్వజిత్ దాస్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు బీజేపీ నుంచి అధికార టీఎంసీలో చేరగా.. తాజాగా మరో ఎమ్మెల్యే కూడా అదే బాటలో నడిచారు. తాజాగా, బాగ్దా బీజేపీ ఎమ్మెల్యే బిశ్వజిత్ దాస్, పార్టీ కౌన్సిలర్ మనోతోష్ నాథ్ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో చేరారు.
ఎమ్మెల్యే తన్మయ్ ఘోష్ బీజేపీ నుంచి టీఎంసీలో చేరిన 24 గంటల్లోనే మరో ఎమ్మెల్యే కూడా పార్టీని వీడటం గమనార్హం. తాను బీజేపీలో ఇమడలేకపోతున్నానని టీఎంసీలో చేరిన తర్వాత ఎమ్మెల్యే బిశ్వజిత్ దాస్ పేర్కొన్నారు. తాను ఆ పార్టీలో కొనసాగలేనని తెలిసిన తర్వాతే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

కొన్ని అపార్థాల కారణంగా గతంలో కొన్ని మార్పులు జరిగాయని, కానీ, ఇప్పుడు తిరిగి తన ఇంటికి చేరుకున్నాననంటూ ఈ సందర్భంగా బిశ్వజిత్ వ్యాఖ్యానించారు. నియోజకవర్గ ప్రజలకు తన సేవలు కొనసాగుతాయని అన్నారు.
సోమవారం టీఎంసీలో చేరిన బీజేపీ ఎమ్మెల్యే తన్మయ్ ఘోష్
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల ముందు టీఎంసీ నుంచి బీజేపీలోకి వెళ్లిన నేతలు.. ఇప్పుడు మళ్లీ బీజేపీ నుంచి టీఎంసీ బాటపడుతున్నారు. ఇప్పటికే ముకుల్ రాయ్ తోపాటు సీనీయిర్ నేతలు టీఎంసీలోకి తిరిగి వెళ్లిన విషయం తెలిసిందే.
తాజాగా, బిష్నుపూర్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే తన్మయ్ ఘోష్ కూడా టీఎంసీకి పార్టీలో చేరారు. టీఎంసీ చీఫ్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, టీఎంసీ నేత బ్రత్య బసు సమక్షంలో ఆయన ఆ పార్టీ తీర్తం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఘోష్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
అంతేగాక, పశ్చిమబెంగాల్ సంస్కృతిని బీజేపీ నాశనం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఇందుకు వ్యతిరేకంగానే తాను టీఎంసీలో చేరినట్లు తన్మయ్ ఘోష్ తెలిపారు. ఇటీవల బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్యే ముకుల్ రాయ్ కూడా టీఎంసీలో చేరిన విషయం తెలిసిందే.
2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాకపోవడంతో పలువురు నేతలు అధికార టీఎంసీ వైపు చూస్తున్నారు. వరుసగా బీజేపీ నుంచి గెలిచిన నేతలు టీఎంసీలో చేరుతుండటంతో ప్రతిపక్ష పార్టీలో ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ 213 స్థానాలు గెలుపొందగా.. బీజేపీ 77 స్థానాల్లో విజయం సాధించింది.
కాగా, ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్‌లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీజేపీ, టీఎంసీ నేతల మధ్య విమర్శలు, ఆరోపణలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల మమతా బెనర్జీ బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజకీయంగా తమతో పోరాటం చేయలేకపోతోందని, అందుకే దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తోందని కేంద్రం, బీజేపీపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. బొగ్గు అక్రమ రవాణా కేసులో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ, ఆయన భార్య రుజిరా బెనర్జీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం సమన్తు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే మమతా బెనర్జీ కేంద్రంపై ఫైరయ్యారు.












Click it and Unblock the Notifications