West Bengal Results 2026: ఎల్లుండే బెంగాల్ ఫలితాలు..! హంగ్ తప్పదా ?
పశ్చిమ బెంగాల్ (west bengal) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లో మెజార్టీ బీజేపీ గెలుస్తుందని అంచనా వేశాయి. అలాగే మరికొన్ని పోల్స్ లో టీఎంసీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తేల్చాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ సగటు తీస్తే హంగ్ అసెంబ్లీ ఏర్పాటవుతుందని తేలుతోంది. ఎందుకంటే టీఎంసీ, బీజేపీకి మధ్య ఓట్ల శాతాల్లో తేడా ఉన్నా సీట్ల విషయంలో మాత్రం అంకెలు చాలా దగ్గరగా ఉండటమే కారణం.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో మెజార్టీ సాధించి అధికారం చేపట్లాలంటే కావాల్సిన సీట్లు 148. దీనికి దగ్గరగానే టీఎంసీ, బీజేపీలకు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇచ్చాయి. అదే నిజమైతే ఏ ఒక్క పార్టీ కూడా స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి తలెత్తుతుంది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 148 స్థానాలను ఏ పార్టీ కూడా చేరుకోలేకపోతే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో జాప్యం జరగవచ్చు. ఇది సంకీర్ణ చర్చలకు లేదా రాష్ట్రంలో తాత్కాలికంగా రాష్ట్రపతి పాలనకు దారితీయవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

2026 పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఒక స్పష్టమైన విజయ పవనాన్ని కాకుండా, గణాంకపరమైన ప్రతిష్టంభనను సూచిస్తున్నాయి. చాలా ఎగ్జిట్ పోల్స్ విజేత ఎవరు అని కాకుండా, 148 సీట్ల మెజారిటీ మార్కు చుట్టూ పోటీ ఎంత దగ్గరగా ఉందో వెల్లడిస్తున్నాయి. సీట్ల అంచనాల్లో అతివ్యాప్తి, బలహీనమైన ఆధిక్యతలు కనిపిస్తున్నాయి. అనేక అంచనాలలో కేవలం 5-10 సీట్ల తేడా రాష్ట్రానికి స్థిరమైన ప్రభుత్వాన్ని అందిస్తుందా, లేక హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందా అనేది నిర్ణయించే అవకాశం ఉంది. ఈ పరిస్థితి బెంగాల్ రాజకీయాల్లో ఉత్కంఠను పెంచుతోంది.

ఒకవేళ హంగ్ అసెంబ్లీ ఏర్పడితే, గవర్నర్ రంగంలోకి దిగి, మొదట అతిపెద్ద పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారు. బీజేపీకి మెజారిటీకి తక్కువగా ఉంటే, అది చిన్న పార్టీలు, స్వతంత్ర సభ్యుల మద్దతును కోరవచ్చు. అదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్.. కాంగ్రెస్, వామపక్షాల మద్దతు కోరవచ్చు. ఏ ప్రభుత్వం ఏర్పడినా అసెంబ్లీలో బలపరీక్ష ద్వారా మెజారిటీని నిరూపించుకోవాలి. సంకీర్ణం సాధ్యం కాకపోతే రాష్ట్రపతి పాలన (తాత్కాలికం), తాజా ఎన్నికలు జరిపించే అవకాశం ఉంటుంది.














Click it and Unblock the Notifications