ఎన్టీఆర్‌కు వెన్నుపోటు- మాకు తెలియదని అనుకుంటున్నారా?: నిండు సభలో మోదీ సంచలనం
అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఆర్థిక మోసాలకు పాల్పడ్డాయంటూ హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ ఇచ్చిన నివేదికపై పార్లమెంట్ లో దుమారం కొనసాగుతోంది. దీనిపై ప్రధాని మోదీ ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్ తప్పులను తవ్వి తీశారు.
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య పెద్ద ఎత్తున ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటు చేసుకుంటోన్నాయి. మాటలు తూటాల్లో పేలుతున్నాయి. ఒకరి చరిత్రను ఒకరు తవ్వి తీస్తోన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం దీనికి మినహాయింపేమీ కాదు. గౌతమ్ అదాని మోసాలను వెలికి తీసిన హిండెన్ బర్గ్ నివేదికపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు కోసం ప్రతిపక్షాలు పట్టుబట్టగా- మోదీ మాత్రం కాంగ్రెస్ చేసిన తప్పులను బయటికి తీసే పనిలో పడ్డారు.

హిండెన్ బర్గ్ నివేదికపై..
దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదాని సారథ్యంలోని అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఆర్థిక మోసాలకు పాల్పడ్డాయంటూ హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్యుద్ధం కొనసాగుతోంది. ఈ నివేదికపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు కోసం ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఉభయ సభల రోజువారీ కార్యకలాపాలను స్తంభింపజేస్తోన్నాయి. దర్యాప్తు జరిపించడానికి అధికార పార్టీ ససేమిరా అంటోంది. ఎదురుదాడికి దిగుతోంది.

ప్రధాని ఎదురుదాడి మంత్రం..
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలను తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్షాలపై తన కౌంటర్ అటాక్ ను ఇవ్వాళ కూడా కొనసాగించారు ప్రధాని మోదీ. బుధవారం లోక్ సభలో చేసిన ఎదురుదాడితో పోల్చుకుంటే తాజాగా రాజ్యసభలో దాని తీవ్రత పెరిగినట్టు కనిపించింది. హిండెన్ బర్గ్ నివేదికపై దర్యాప్తు కోసం కాంగ్రెస్ పట్టుబట్టగా- ఆ పార్టీ గతంలో చేసిన తప్పులను ఎత్తి చూపే పనిలో పడ్డారు ప్రధాని. నెహ్రూ, ఇందిరాగాంధీ ప్రభుత్వాల గురించి ఆయన మాట్లాడారు.

గత ప్రభుత్వాలను కూల్చలేదా..?
తాము బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చామంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోందని, ఆ పార్టీ గత చరిత్రను చూస్తే ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయంటూ మోదీ విమర్శించారు. తమిళనాడులో ఎంజీ రామచంద్రన్, కరుణానిధి ప్రభుత్వాలను కాంగ్రెస్ నాయకులు కూల్చివేశారని గుర్తు చేశారు. మహారాష్ట్రలో శరద్ పవార్ ప్రభుత్వాన్ని కూడా గతంలో కూల్చేసిన ఘన చరిత్ర కాంగ్రెస్ కు ఉందని ధ్వజమెత్తారు.

ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేసే కుట్ర..
కేరళలో కమ్యూనిస్టుల సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైతే- పండిట్ నెహ్రూ దాన్ని పడగొట్టారని అన్నారు. ఈ క్రమంలో ఆయన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేరును తన ప్రసంగంలో ప్రస్తావించారు. ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఎన్టీ రామారావు- చికిత్స కోసం విదేశాలకు వెళ్లిన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆయనను గద్దె దించే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. నాదెండ్ల భాస్కర్ రావు ఉదంతాన్ని పరోక్షంగా గుర్తు చేశారు ప్రధాని మోదీ.

ఆర్టికల్ 356 దుర్వినియోగం..
ఈ రకంగా చూస్తే- ఆర్టికల్ 356ను అత్యధికంగా దుర్వినియోగం చేసింది కాంగ్రెస్ నాయకులేనని మోదీ విమర్శించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కాంగ్రెస్ నాయకులు 90 సార్లు కూలదోశారని ధ్వజమెత్తారు. తన ప్రభుత్వ హయాంలో ఇందిరా గాంధీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆర్టికల్ 356ను 50 సార్లు దురుపయోగం చేశారని మండిపడ్డారు. ఇలాంటి ఎన్నో లోపాలను పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఇవ్వాళ తన ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేయడం సరికాదని అన్నారు.












Click it and Unblock the Notifications