వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పళ్లు, కూరగాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఏం చేయాలి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పళ్లు, కూరగాయలు

మన నోటివరకు చేరేముందే చాలా పళ్లు, కూరగాయలు వృథాగా పోతున్నాయి. దీన్ని అరికట్టేందుకు నేడు హైటెక్ కోటింగ్స్‌తో మొదలుపెట్టి చాలా పరిష్కారాలు అందుబాటులోకి వస్తున్నాయి. అవేమిటో చూద్దామా...

మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఆహారం లభిస్తున్నప్పటి నుంచీ ఈ సమస్య మనల్ని వేధిస్తోంది. ఆహారం ఎక్కువ ఉన్నప్పుడు, మన బుర్రలోకి వచ్చే మొదటి ప్రశ్న.. ''దీన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చేసుకోవడం ఎలా?’’

ఎన్నిరకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయో.. దీనికి అన్నే రకాల సమాధానాలు కూడా ఉన్నాయి. అంజూర పండ్లను (ఫిగ్స్) ఎక్కువ కాలం నిల్వ ఉంచేలా చూసేందుకు, మొదట వాటిని గ్రీకులు సముద్రపు నీటిలో కడిగేవారు. ఆ తర్వాత ఎండబెట్టేవారు.

మధ్యయుగంలో చైనాలో నిమ్మకాయలు, నారింజ పళ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చూసేందుకు వ్యాక్స్‌తో పూత పోసేవారు. 15వ శతాబ్దంలో జపాన్‌లోనూ ఇలానే కూరగాయలను సోయా పాలలో ముంచితీసేవారు. దీని వల్ల తేమ శాతం కోల్పోకుండా ఎక్కువ కాలం అవి నిల్వ ఉంటాయని భావించేవారు. 16వ శతాబ్దంలో ఇంగ్లండ్‌లోనూ కూరగాయలపై కొవ్వు రాసేవారు.

పళ్లు, కూరగాయలు

కుళ్ళిపోతున్న యాపిల్స్, ఇతర ధాన్యాల సమస్య మన పూర్వీకులనూ వెంటాడేదని చెప్పడానికి ఇవి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. నేడు ఆహార వృథాను అడ్డుకోవడం ఒక పెద్ద సవాల్‌గా మారింది. మరోవైపు ఈ ఆహార వృథా నుంచి విడుదలవుతున్న గ్రీన్ హౌస్ వాయువులు బ్రిటన్ లాంటి దేశాల ఉద్గారాల కంటే పది రెట్లు ఎక్కువగా ఉన్నాయి.

ముఖ్యంగా మాంసం నుంచి విడుదల అవుతున్న ఉద్గారాలు మరింత ఎక్కువగా ఉంటాయి. మరోవైపు వీటి ఉత్పత్తి కోసం మొక్కల నుంచి వచ్చే ఆహార పదార్థాల కంటే ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. ఒక వంద గ్రాముల మాంసాన్ని మీరు బయటపడేస్తే, ఇది దాదాపు పది కేజీల కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను ఉత్పత్తి చేయగలదు.

అయితే, ఆహార వృథాలో సింహభాగం పళ్లు, కూరగాయలదే. ఇవి ఏటా దాదాపు వందల కోట్ల టన్నుల్లో వృథాగా పోతున్నాయి. బ్రిటన్‌లో నారింజ పళ్లు ఇలా వృథా అవుతున్నవాటిలో మొదటి స్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత యాపిల్స్, టమాటోలు కూడా భారీగా వృథా అవుతున్న పళ్ల జాబితాలో ఉన్నాయి.

మరి మన నోటివరకు చేరేముందే వృథా అవుతున్న ఈ పళ్లు, కూరగాయలను అడ్డుకోవడం ఎలా?

పళ్లు, కూరగాయలు

నేడు ఆహార వృథాను అడ్డుకునేందుకు అనుసరిస్తున్న మార్గాల్లో చాలావరకు ప్లాస్టిక్స్, రసాయనాలను ఉపయోగిస్తున్నారు. దీనిపై 2022లో ఒక స్విట్జర్లాండ్ అధ్యయనం ప్రచురితమైంది. కీరా దోసకాయలను ప్లాస్టిక్‌లో చుట్టి నిల్వచేయడంతో చేకూరే ప్రయోజనాలు.. ప్లాస్టిక్ ప్యాకేజీతో వచ్చే నష్టాల కంటే ఐదు రెట్లు ఎక్కువగా ఉన్నాయని దీనిలో వెల్లడించారు. క్లోరిన్, హైడ్రోజన్ పెరాక్సైడ్, ట్రైసోడియం ఫాస్ఫేట్ లాంటి రసాయనాలను కూడా పళ్లు, కూరగాయల్లో చాలా సూక్ష్మజీవులను హతమార్చేందుకు ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు.

అయితే, ఇలాంటి రసాయనాలు, ప్లాస్టిక్స్ వాడుతున్న పళ్లు, కూరగాయలను చాలా మంది వినియోగదారులు దూరం పెడుతున్నారు. క్లోరినేషన్ వల్ల వీటిలో క్యాన్సర్ కారక కార్సినోజెన్ల స్థాయిలు పెరుగుతాయని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఇక ప్లాస్టిక్స్ విషయానికి వస్తే, వీటి వినియోగం ఇప్పటికే చాలా ఎక్కువగా ఉందని చాలా మంది భావిస్తున్నారు. ''ప్లాస్టిక్స్‌కు ప్రత్యామ్నాయాల వైపు ప్రజలు చూడటం ఎక్కువైంది. మరోవైపు రసాయనాలను ఉపయోగించని పళ్లు, కూరగాయలకు ప్రజలు ప్రాధాన్యం ఇస్తున్నారు’’అని మసాచుసెట్స్ యూనివర్సిటీలోని ఫుడ్ సైంటిస్టు డేవిడ్ మెక్‌క్లెమెంట్స్ చెప్పారు.

అయితే, ఈ దిశగా వస్తున్న చాలా టెక్నాలజీలు నేడు ల్యాబ్‌ల దశలోనే ఉన్నాయి. మరికొన్ని మాత్రం త్వరలోనే సూపర్ మార్కెట్ వరకు చేరే అవకాశముంది.

పళ్లు, కూరగాయలు

సమస్య ఎక్కడ?

ప్రస్తుతం ఎక్కువగా చర్చ జరుగుతున్న టెక్నాలజీల్లో ''ఎడిబుల్ కోటింగ్’’ కూడా ఒకటి. పళ్లు, కూరగాయలను మనం తినగలిగే పొరలతో కప్పే టెక్నాలజీ ఇది. ఒకప్పుడు జపాన్, ఇంగ్లండ్‌తోపాటు చాలా ప్రాంతాల్లో సోయా లేదా ఇతర పూతల నుంచి నేటివరకు ఈ కోటింగ్స్ చాలా మెరుగుపడ్డాయి.

తేనెటీగల తుట్ట నుంచి ఉత్పత్తిచేసే బీస్‌వ్యాక్స్ లేదా పారాఫిన్‌లను 1930లలోనే కోటింగ్‌గా ఉపయోగించినట్లు చరిత్ర చెబుతోంది. మరోవైపు యాపిల్ లాంటి పళ్లపై సహజంగానే ఒక వ్యాక్స్ కోటింగ్ ఉంటుంది. అయితే, కడిగే ప్రక్రియల్లో ఇది నీటితోపాటు పోతుంది. నేడు కొన్ని యాపిల్స్‌, నారింజ, నిమ్మ లాంటి పళ్లకు కృత్రిమ కోటింగ్‌లు వేస్తున్నారు. ఇవి తేమను కోల్పోకుండా ఎక్కువకాలం నిల్వ ఉండేందుకు దోహదపడతాయి.

డీహైడ్రేషన్‌ను అడ్డుకోవడంలో ఇవి కొంతవరకు ఉపయోగపడతాయి. అయితే, వీటిని మెరుగుపరచాల్సిన అవసరం చాలా ఉంది. సురక్షితమైన ఎడిబుల్ కోటింగ్‌ల కోసం శాస్త్రవేత్తలు కొత్త ప్రయోగాలు కూడా చేస్తున్నారు. పట్టుపురుగులు ఉత్పత్తిచేసే ప్రోటీన్ ఫిబ్రోయిన్, షెల్‌ఫిష్ పైచిప్పల్లోని షుగర్ చిటోసాన్, క్యాషూ గమ్, ఫిష్ జెలాటిన్, మెంతుల్లోని ప్రోటీన్, సోయా ప్రోటీన్, సెల్యూలోజ్ ఇలా చాలా కోటింగ్‌లపై ప్రస్తుతం పరిశోధనలు చేపడుతున్నారు.

పళ్లు, కూరగాయలు

ఈ కోటింగ్ ద్రావణాల్లో పళ్లు, కూరగాయలను ముంచడం, లేదా బ్రష్‌లతో కోటింగ్ వేయడం లేదా స్ప్రే చేయడం లాంటి విధానాల్లో ప్రస్తుతం కోటింగ్స్ వేస్తున్నారు. వీటి వల్ల గ్యాస్ చేరడం, లేదా నీటి ఆవిరి బయటకు వెళ్లడం, లేదా రంగు మారిపోవడం లాంటివి అడ్డుకోవచ్చు. అంతిమంగా వీటితో ఆ పళ్లు, కూరగాయల జీవిత కాలం పొడిగించొచ్చు. అయితే, దీనితో మనం పూర్తిగా పళ్లను సీల్ చేయడం సాధ్యంకాకపోవచ్చు. ఒక్కోసారి దీని వల్ల ఏనారోబిక్ ఫెర్మెంటేషన్‌కు కూదా ఇది దారితీయొచ్చు.

చేపల పెంపకం లాంటి వ్యవసాయ విధానాల్లో చిటోసాన్‌ను కూడా ఉత్పత్తి చేసుకోవచ్చని మెక్‌క్లెమెంట్స్ చెప్పారు. చిటోసాన్‌తో కోటింగ్ వేసిన స్ట్రాబెర్రీలలో జీవిత కాలాన్ని ఫ్రిడ్జిలో పెట్టినప్పటి కంటే 60 శాతం ఎక్కువ పొడిగించొచ్చని ఒక అధ్యయనంలో రుజువైంది. టమాటోలపైనా చిటోసాన్‌ లేదా గ్రీన్ ఆల్గేతో కోటింగ్ వేస్తే, కోత తర్వాత 30 రోజులవరకు ఇవి తాజాగా ఉంటాయని కూడా వెల్లడైంది.

ప్రస్తుతం ఎడిబుల్ కోటింగ్స్‌ను వాణిజ్య పరంగా అభివృద్ధిచేసే టెక్నాలజీపై చాలా కంపెనీలు కృషి చేస్తున్నాయి. కాలిఫోర్నియాకు చెందిన అంకుర సంస్థ అపీల్ సైన్సెస్ మొక్కల నుంచి ఉత్పత్తి చేసే చమురు నుంచి ఇలాంటి కోటింగ్స్ తయారుచేస్తోంది.

అమెరికాలో ప్రస్తుతం యాపిల్స్‌, ఆవొకాడోలు, నారింజలపై ఇలాంటి కోటింగ్స్ కనిపిస్తున్నాయి. బ్రిటన్‌లో నారింజ, నిమ్మ పళ్లపై ఇలాంటి కోటింగ్స్ కోసం టెస్కో పనిచేస్తోంది.

మరో కంపెనీ లిక్విడ్‌సీల్ కూడా బ్రిటన్‌లో పాలివినైల్ ఆల్కహాల్‌తో మావిడి, ఆవొకాడోలపై కోటింగ్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. మరోవైపు కీరాదోసలపై ప్రస్తుతమున్న ప్లాస్టిక్ ర్యాప్‌లకు బదులుగా ఎడిబుల్ కోటింగ్‌లను సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇవి త్వరలో యూరప్‌లోనూ అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

పళ్లు, కూరగాయలు

నానో ట్రీట్‌మెంట్

ఎడిబుల్ కోటింగ్స్‌ తయారీలో కొన్ని కంపెనీలు నానో మెటీరియల్స్‌ను ఉపయోగిస్తున్నాయి. ''పార్టికల్స్ పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు, ఎడిబుల్ కోటింగ్స్ పనితీరును మెరుగుపరచొచ్చు. ఫలితంగా పళ్లు, కూరగాయలు ఎక్కువ కాలం నిల్వ ఉంచొచ్చు’’అని మెక్ క్లెమెంట్స్ చెప్పారు.

లేజర్లు, వైబ్రేషన్లు, మొక్కల నుంచి లేదా సూక్ష్మజీవుల సాయంతో తయారుచేసిన పదార్థాలను కూడా ఇలాంటి నానోమెటీరియల్స్ తయారీలో ఉపయోగించొచ్చు. సాధారణంగా గదిలో సాధారణ ఉష్ణోగ్రత వద్ద స్ట్రాబెర్రీలను నిల్వ చేసినప్పుడు వారం రోజుల్లోనే ఫంగస్ వస్తుంది.

అయితే, చిటోసాన్ లేదా నానో-సిల్వర్‌లతో కోటింగ్ వేసినప్పుడు వీటిలో పది శాతం పళ్లు మాత్రమే పాడయ్యాయని ఒక అధ్యయనంలో రుజువైంది. మరోవైపు క్యారెట్లను నానోపార్టికల్స్‌తో కోటింగ్ వేసినప్పుడు ఇవి 70 రోజుల వరకు నిల్వ ఉన్నట్లు తేలింది. ఎలాంటి కోటింగ్‌లేని క్యారట్లు నాలుగు రోజుల్లోనే దెబ్బతింటున్నాయి.

నానోపార్టికల్స్ కేవలం ఎడిబుల్ కోటింగ్స్‌లా మాత్రమే కాదు. ఇవి యాంటోమైక్రోబయాల్స్‌లా కూడా ఉపయోగపడతాయి. మరోవైపు ఇకపై తినడానికి పనికిరావని వినియోగాదారులకు సంకేతాలు ఇచ్చే టెక్నాలజీకి ఇవి తోడ్పడే అవకాశముంది. వీటిసాయంతో కెనడాలోని మెక్‌మాస్టర్ యూనివర్సిటీ నిపుణులు ప్రత్యేక పట్టీలను తయారుచేశారు. ఇవి ఆ పళ్లు, కూరగాయలు పాడయ్యాయో లేదో చెప్పేందుకు ఉపయోగపడుతున్నాయి.

అయితే, ఇలాంటి నానో టెక్నాలజీతో కొన్ని భద్రతాపరమైన సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. ఎలుకలపై చేపట్టిన ప్రయోగంలో జింక్ ఆక్సైడ్ నానో పార్టికల్స్‌తో వాటి కాలేయం, కిడ్నీలు దెబ్బతిన్నట్లు తేలింది. మరోవైపు సిల్వర్ నానోపార్టికల్స్‌తో ఇటు సూక్ష్మజీవులకు అటు మనుషుల కణాలకు ముప్పుందని కూడా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

''అన్ని కొత్త టెక్నాలజీలతోనూ ఈ ముప్పు ఉంటుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి’’అని స్విస్ ఫెడరల్ ల్యాబొరేటరీస్ ఫర్ మెటీరియల్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైంటిస్టు గుస్తావ్ నైస్ట్రామ్ చెప్పారు. సిల్వర్, జింక్ నానో పార్టికల్స్ మనుషుల కణాల్లో చేరే ముప్పుంటుందని నైస్ట్రామ్ వివరించారు.

బయోలాజికల్ డిఫెన్స్

పళ్లు, కూరగాయల జీవిత కాలం పొడిగింపులో బ్యాక్టీరియోలను హతయార్చే వైరస్‌లు ''బాక్టీరియోఫేజెస్’’ కూడా ఉపయోగపడే అవకాశముంటుంది. పైగా వీటితో మనుషులకు పొంచివుండే ముప్పు కూడా తక్కువ. అమెరికా కంపెనీ ఇంట్రాలిటిక్స్ ఇప్పటికే బాక్టీరియోఫేజ్ మిక్స్‌లను అందుబాటులోకి తెస్తోంది. మరో కంపెనీ మైక్రియోస్ కూడా బ్రకోలీ, క్యార్లట్లు లాంటి కూరగాయలపై బ్యాక్టీరియోఫేజ్‌ పొరలను తయారుచేస్తోంది.

బ్యాక్టీరియోఫేజ్‌లనే ఫేజెస్ అని కూడా పిలుస్తుంటారు. ఇవి బ్యాక్టీరియా కణాల పొరలపై దాడులుచేసి వాటిని హతమారుస్తాయి. ''ఒక బుడగను సూదితో గుచ్చినట్లే ఇవి దాడిచేస్తాయి’’అని మైక్రోస్ మేనేజింగ్ డైరెక్టర్ జెరిట్ కీజర్ చెప్పారు. వీటి వల్ల కూరగాయల జీవిత కాలం మెరుగుపడుతుందని వివరించారు.

''మన శరీరం చుట్టూ ఈ ఫేజెస్ ఉంటాయి. అన్నిచోట్లా ఇవి కనిపిస్తాయి. మనం నిరంతరం వీటిని తీసుకుంటూనే ఉంటాం’’అని కార్నెల్ యూనివర్సిటీకి చెందిన ఫుడ్ సైంటిస్ట్ శామ్ న్యూజెన్ చెప్పారు. కొన్ని సంవత్సరాల్లో మార్కెట్లలో ఇలాంటి పొరలతో అమ్మే కూరగాయలు విరిగిగా చూడొచ్చని ఆయన అన్నారు.

పళ్లు, కూరగాయలను తాజాగా ఉంచేందుకు ఇలాంటి విధానాలు చాలా ఉన్నాయి. ప్లాస్మా యాక్టివేటెడ్ వాటర్, ఓజోన్ ట్రీట్‌మెంట్, హైపవర్ అల్ట్రాసౌండ్ బాక్టిరీయోసిన్స్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి.

పల్స్ లైట్ లేదా ఫ్లాష్ లైట్‌లతో స్ట్రాబెర్రీలను శుద్ధిచేసిన తర్వాత ఎనిమిది రోజులవరకు ఇవి చక్కగా ఉంటున్నట్లు మరొక అధ్యయనంలో తేలింది. మరోవైపు పల్స్‌లైట్ శుద్ధి చేయడంతో పళ్లు, కూరగాయల్లో ఆరోగ్యకర ఫైటోకెమికల్స్ స్థాయిలు కూడా పెరుగుతాయి.

అయితే, ఈ టెక్నాలజీలలో అన్నింటికంటే ముఖ్యమైనది ఏమిటంటే.. ఇవి సురక్షితమైనమని ప్రజలకు నమ్మకం కలిగించాలి. అదే సమయంలో ఇవి ఆ కూరగాయల జీవిత కాలం కూడా పొడిగించగలగాలి.

''మనం ఈ టెక్నాలజీలతో కోట్ల సంఖ్యలో పళ్లు, కూరగాయలను శుద్ధి చేయాల్సి ఉంటుంది. చాలా వేగంగా, మెరుగ్గానూ పనిచేయాలి’’అని మెక్ క్లెమెంట్స్ చెప్పారు.

పాడైన రోడ్లపై రవాణా వల్ల కూడా దక్షిణాఫ్రికాలో కొన్ని కూరగాయాలు దెబ్బ తింటున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. ట్రక్కుల్లో మరీ ఎక్కువగా కుదుపులకు గురికావడంతో ఇవి పాడవుతున్నాయి. దీంతో రోడ్లను మెరుగుపచడంపైనా మనం దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

మరోవైపు సరిగ్గా నిల్వ చేయకపోవడం, అతిగా కొనుగోలు చేయడం, ఫ్రిడ్జిలో అలానే పెట్టి మరచిపోవడం.. ఇలా చాలా అంశాలు ఇక్కడ ప్రభావం చూపిస్తాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What should be done to preserve fruits and vegetables for a long time?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X