వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా సోకితే గర్భిణులు ఏం చేయాలి? తల్లి నుంచి బిడ్డకు వస్తుందా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
గర్భిణి

సుకన్యకు ఆరో నెల ప్రెగ్నన్సీ. ఇంట్లో బావగారికి కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. ఆయన్ను వేరే గదిలో ఉంచి ఆహారం, అన్నీ బయట నుంచి అందిస్తున్నారు. ఆయన దగ్గుతుంటే బయటికి వినిపిస్తోంది. సుకన్యకు భయం వేస్తోంది.

తనకూ కరోనా వస్తే ఎలా? బిడ్డకు సోకుతుందా? పుట్టింటికి వెళ్లిపోతే? ఈ సమయంలో ప్రయాణం మంచిదేనా? పైగా అక్కడ తండ్రికి కూడా కరోనా. నాలుగు రోజుల తర్వాత డాక్టర్ చెకప్ ఉంది. వెళ్లాలా, వద్దా? ఎన్నో సందేహాలు!

కరోనా వ్యాధి ప్రధానంగా తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది.

కరోనా సోకిన వ్యక్తితో సన్నిహితంగా అంటే రెండు మీటర్ల లోపు ఉంటే వారి శ్వాసకోశ స్రావాలు(Aerosols) కళ్లు, నోరు, ముక్కులోకి ప్రవేశించడం వల్ల; కలుషితమైన ఉపరితలాన్ని తాకడం లేదా కోవిడ్ బాధిత వ్యక్తి చేతిని తాకిన చేతితో ముక్కు, నోరు, లేదా కళ్లను తాకడం వల్ల కరోనా వ్యాప్తి చెందుతుంది.

ప్రెగ్నన్సీ వల్ల త్వరగా సంక్రమిస్తుందా?

సాధారణ ప్రజలతో పోలిస్తే, గర్భధారణ వల్ల కోవిడ్ త్వరగా సంక్రమించడం అనేది జరగదు. కానీ గర్భం దాల్చాక, మహిళలకు రోగ నిరోధక శక్తి కొంత తగ్గుతుంది. శ్వాసకోశాల పనితీరులో కొన్ని మార్పులు వస్తాయి. ఆ మార్పుల వల్ల ఊపిరితిత్తుల వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వచ్చే అవకాశముంది.

తల్లి నుంచి బిడ్డకు వస్తుందా?

చైనాలో జరిగిన విస్తృత పరిశోధనల్లో- ఉమ్మనీరులో, బొడ్డు తాడులోని రక్తంలో, శిశువు గొంతులో, తల్లిపాలలో కరోనా జాడలు లేవు.

కానీ తాజాగా వెలువడిన డేటాను పరిశీలించినప్పుడు రెండు సందర్భాల్లో తల్లి నుంచి బిడ్డకు కోవిడ్ సంక్రమించిన ఆధారాలు దొరికాయి. మున్ముందు మరిన్ని కేసుల పరిశోధనలో ఈ అనుమానం నివృత్తి కావొచ్చు.

గర్భిణిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

చాలా మంది మహిళలకు తేలికపాటి లక్షణాలే కనిపిస్తాయి.

జలుబు/ఫ్లూ వంటి దగ్గు, జ్వరం, ఊపిరి పీల్చడంలో కష్టం, తలనొప్పి, వాసన, రుచి కోల్పోవడం లాంటి లక్షణాలతో బాధ పడతారు.

అయితే ప్రెగ్నన్సీలో రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల కోవిడ్ సంక్రమించినపుడు లక్షణాలు తీవ్రంగా ఉండేందుకు అవకాశం ఉంది.

సాధారణ ప్రజలతో పోలిస్తే, గర్భిణులకు కరోనా వచ్చినపుడు, హాస్పిటల్ చికిత్స, ఐసీయూలో చేర్చాల్సిన అవసరం, వెంటిలేటర్‌పై చికిత్స అందించాల్సిన అవసరం ఎక్కువనే చెప్పాలి.

అధిక బరువు, మధుమేహం, తల్లి వయస్సు 35 ఏళ్ల కన్నా ఎక్కువ ఉండటం గర్భిణుల్లో తీవ్రమైన లక్షణాలకు, క్రిటికల్ పరిస్థితికి దారితీయొచ్చు.

గర్భిణి

పిండంపై కోవిడ్ ప్రభావం ఎలా ఉంటుంది?

ఇప్పటివరకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, కోవిడ్ వల్ల గర్భస్రావం జరుగుతుందా, లేదా బిడ్డకు అంగవైకల్యం వచ్చే అవకాశం ఉందా అనేది కచ్చితంగా చెప్పలేం.

కోవిడ్ సోకిన మహిళల్లో, నెలల ముందుగానే కాన్పు వచ్చిన సందర్భాలు, కేస్ రిపోర్టులు ఉన్నాయి. అయితే ముందుగానే కాన్పు జరగడం డాక్టర్ల నిర్ణయమా లేదా ఆకస్మికంగా జరిగిందా అనే విషయంలో స్పష్టత లేదు.

ఇంట్లో వారికి కోవిడ్ వస్తే గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ప్రెగ్నన్సీ చెకప్‌కు వెళ్లాల్సి ఉంటే రెండువారాలపాటు వాయిదా వెయ్యండి.

కోవిడ్ సోకకుండా తగిన రక్షణ చర్యలను పాటించాలి. కరోనా లక్షణాలున్న వ్యక్తులకు, పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు దూరంగా వుండాలి. సామాజిక దూరం పాటించాలి.

స్వీయ ఐసొలేషన్‌లో ఉన్నవారు ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మంచానికే పరిమితం కాకుండా సాధ్యమైనంత కదులుతూ వుండాలి. ఇలా చేయడం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డలు కట్టకుండా నివారించవచ్చు.

ఐసొలేషన్‌లో ఉన్నప్పుడు అత్యవసర పరిస్థితులెదురైతే మొదట ఫోను ద్వారా సీనియర్ వైద్యుల సలహా తీసుకోవాలి.

గర్భిణుల వైద్యంలో వచ్చిన మార్పులు ఏమిటి?

కరోనా మహమ్మారి వ్యాప్తి తర్వాత, గర్భిణులు చెకప్‌లకు బయటకు వెళ్లి ఇన్ఫెక్షన్ బారిన పడే ముప్పును తగ్గించేలా చికిత్సా మార్గదర్శకాలను సవరించారు.

అంతకుముందు గర్భిణి కనీసం పది సార్లు ప్రసూతి వైద్యుల వద్దకు చెకప్‌కు వెళ్లాలన్న నియమాలను కోవిడ్‌కు అనుగుణంగా మార్చారు.

కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఇతర ఆరోగ్య సమస్యలు లేని (Low-risk Women) గర్భిణులు చెకప్ కోసం నాలుగుసార్లు వెళితే చాలు.

ఎప్పుడెప్పుడు వెళ్లాలంటే..

1) బుకింగ్ విజిట్ (గర్భధారణను నిర్ధరించేందుకు).

2) 22-24 వారాలప్పుడు (బిడ్డకు అవయవాలను పరిశీలించే స్కాన్- Anomaly Scan).

3) 32-34 వారాలప్పుడు (బిడ్డ పెరుగుదలని గమనించే స్కాన్- Growth Scan).

4) 36-38 వారాలప్పుడు (కాన్పు ప్లానింగ్ కోసం).

గర్భిణులందరికీ సంబంధిత ఆరోగ్య సంస్థ ఫోన్ నంబర్/కాల్ సెంటర్ వివరాలు అందించాలి.

ప్రెగ్నన్సీ

గర్భధారణ చెకప్ కోసం క్లినిక్‌లోకి ప్రవేశించే మహిళలందరికీ కోవిడ్ లక్షణాలు ఉన్నాయేమో పరిశీలించాలి. లక్షణాలున్న వారిని పరీక్ష నిమిత్తం కోవిడ్ కోసం కేటాయించిన ప్రాంతానికి తరలించాలి. కరోనా పరీక్ష ఫలితం వచ్చే వరకు చెకప్ వాయిదా వేయాలి.

తేలికపాటి లక్షణాలతో బాధపడుతుంటే, ఇంటి వద్ద 14 రోజులపాటు సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఉండటమే మంచిది. వారి సమస్యల పరిష్కారానికి ఫోన్‌లో సంప్రదించే వీలు కల్పించాలి.

కరోనా నిర్ధరణ అయిన గర్భిణులకు లేదా లక్షణాలతో ఉన్న గర్భిణులకు ఆస్పత్రిలో చికిత్స అవసరమైనపుడు- పీపీఈ కిట్ వేసుకున్న ఆస్పత్రి సిబ్బంది, వారికి ప్రవేశ ద్వారం వద్ద సర్జికల్ మాస్క్ అందించాలి. వారిని ఐసొలేషన్ గదికి తరలించాలి. అవసరమైన వైద్య సిబ్బంది మాత్రమే ఆ గదిలోకి ప్రవేశించాలి. తక్కువ మంది విజిటర్స్‌నే అనుమతించాలి.

కోవిడ్ లక్షణాల తీవ్రతను అంచనా వేయడంతోపాటు తల్లీబిడ్డ పరిస్థితిని అంచనా వేయాలి. శరీర ఉష్ణోగ్రత, శ్వాసకోశ రేటు, ఆక్సిజన్ శాచురేషన్ స్థాయులను పర్యవేక్షిస్తూ వుండాలి.

కాన్పు చేయాల్సి వచ్చినా లేదా ఇంకేదైనా ప్రసవ సంబంధ చికిత్స అవసరమైనా ఆలస్యం చేయకూడదు.

గర్భిణులు కరోనాతో ఆస్పత్రిలో చేరినపుడు సిరల్లో రక్తం గడ్డలు కట్టకుండా నివారించేందుకు హెపారిన్ ఇంజెక్షన్లు ఇవ్వాలి.

శ్వాసకోశాలకు సంబంధించిన లక్షణాలను అంచనా వేసేందుకు, ఆక్సిజన్ చికిత్సపై నిర్ణయాలు తీసుకునేందుకు సంబంధిత విభాగాల వైద్య నిపుణులతో చర్చించాలి.

గర్భిణి ఛాతీకి ఎక్స్‌రేగాని, వేరే రేడియోగ్రాఫిక్ పరిశోధనలుగాని అవసరమైనపుడు, తల్లి ఆరోగ్యానికే ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. గర్భంలో ఉన్న బిడ్డ గురించి ఆందోళన చెందకుండా పొట్టపైన లెడ్ షీల్డ్‌తో కప్పి, ఆ పరీక్షలు జరిపించాలి.

కోవిడ్ సోకిన గర్భిణులకు జ్వరం వచ్చినపుడు అది కరోనావైరస్ వల్లే అని భావించకుండా ఇతర కారణాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. బాక్టీరియా ఇన్ఫెక్షన్ కారణమని తేలితే యాంటీబయాటిక్ చికిత్స అందించాలి.

కరోనావైరస్

ఔషధాల వాడకం

ప్రస్తుతం అనుసరిస్తున్న మార్గదర్శకాల ప్రకారం స్టీరాయిడ్స్ వాడవచ్చు. రెమెడెసివిర్ పరిశోధనల్లో గర్భిణులను చేర్చలేదు కాబట్టి ఆ మందు వాడకం గురించి స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు.

కోలుకున్నవారికి సంరక్షణ

తేలికపాటి లక్షణాలతో కోలుకున్న గర్భిణులకు, ప్రత్యేకమైన ప్రసూతి సంరక్షణ అవసరం లేదు. స్వీయ ఐసొలేషన్ గడువు ముగిసిన వెంటనే వీలైనంత త్వరగా వారికి ప్రెగ్నన్సీ చెకప్ చేయాలి. కోవిడ్ వల్ల తీవ్రమైన అనారోగ్యం బారినపడి, ఆస్పత్రిలో చేరి కోలుకున్న మహిళలకు ప్రత్యేకమైన ప్రసూతి సంరక్షణ ప్రణాళిక రూపొందించాలి. సీనియర్ వైద్యులు, శ్వాసకోశ నిపుణుల పర్యవేక్షణలో, ఆమెకు చికిత్సా ప్రణాళికను సిద్ధం చేయాలి.

అనారోగ్యం నుంచి కోలుకున్న 14 రోజుల తరువాత పిండం పెరుగుదలను పరిశీలించే స్కాన్ చేయాలి.

ప్రెగ్నన్సీ

కాన్పు సమయంలో సూచనలు

సాధారణ కాన్పు చేయాలా, సిజేరియన్ ద్వారా కాన్పు చేయాలా అనేది కోవిడ్ ఇన్‌ఫెక్షన్‌పై ఆధారపడి వుండదు. తల్లీబిడ్డ పరిస్థితిని బట్టి ఏ కాన్పు సరైనదో వైద్యులు నిర్ణయిస్తారు.

అత్యవసర కారణాల వల్ల కాన్పు చేయాల్సి వస్తే, ఆలస్యం చేయకూడదు. కరోనా సోకిన గర్భిణులకు కాన్పు సమయంలో నొప్పి తెలియకుండా ఎపిడ్యూరల్ ఇంజెక్షన్లు ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదు.

కాన్పు సమయంలో నొప్పులు తెలియకుండా వుండేందుకు Entonox వాడకం నిషిద్ధం.

సిజేరియన్ కాన్పు అవసరమైనపుడు, మత్తు ఇచ్చే పద్ధతుల్లో వెన్నుకుగానీ, జెనరల్ అనస్తీషియాగానీ ఇవ్వవచ్చు.

అయితే జెనరల్ అనస్తీషియా ఇవ్వడానికి గొంతులో ట్యూబ్ అమర్చాల్సి ఉంటుంది. ఆ సమయంలో వెలువడే శ్వాసకోశ స్రావాల వల్ల, అక్కడున్న వైద్య సిబ్బందికి కరోనావైరస్ సోకే ప్రమాదం గణనీయంగా ఉంటుందని తేలింది.

తల్లీబిడ్డలు

కోవిడ్ సోకిన మహిళలు తల్లిపాలు ఇవ్వవచ్చా?

తల్లిపాల ద్వారా బిడ్డకు కరోనా సోకే ప్రమాదం లేదు.

ఆ విషయంలో తల్లికి ఉన్న భయాలను పోగొట్టడానికి తగిన కౌన్సెలింగ్ అవసరం.

అయితే బిడ్డకు పాలిచ్చే సమయంలో, వెలువడే శ్వాసకోశ స్రావాల వల్ల బిడ్డకు కరోనా సోకే అవకాశముంది కాబట్టి బ్రెస్ట్ పంప్ ద్వారా పాలను సేకరించి ఆరోగ్యంగా ఉన్న సహాయకుల ద్వారా బిడ్డకు పట్టించడం మంచిది.

పాలను సేకరించే సమయంలో చేతులు, సీసాలు, బ్రెస్ట్ పంప్ అన్నీ పరిశుభ్రంగా ఉండేలా చూడాలి. చేతులకు గ్లౌవ్స్, ముఖానికి సర్జికల్ ఫేస్ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి.

కౌన్సెలింగ్ తర్వాత, బ్రెస్ట్ పంప్ ద్వారా కాకుండా, స్వయంగా బిడ్డకు పాలివ్వాలని నిర్ణయించుకుంటే..

1) బిడ్డను తాకబోయే ముందు చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి.

2) సర్జికల్ ఫేస్ మాస్క్ తప్పని సరిగా ధరించాలి.

3) బిడ్డ ముఖమ్మీద దగ్గడం, తుమ్మడం చేయకుండా జాగ్రత్త పడాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What should pregnant women do if they are infected with Corona, Does it come from mother to child
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X