దుర్గాదేవి గుడిని పునర్నిర్మించిన ముస్లిం మహిళ
మండసూర్: ఓ ముస్లిం మహిళ హిందూ ఆలయాన్ని పునర్నిర్మించి మతసామరస్యాన్ని చాటి చెప్పింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మండసూర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండసూర్ ప్రాంతానికి చెందిన సుఘర బీ(45) అనే మహిళ కూలీ పనులు చేసుకుంటూ గత పదేళ్లుగా అక్కడే నివసిస్తోంది.
మూడేళ్ల క్రితం తన ఇంటికి సమీపంలో ఆమె ఓ ఆలయాన్ని గుర్తించింది. అది పాడుబడి ఉండటంతో పునర్‌నిర్మించాలని సంకల్పించింది. తాను నివసించే ప్రాంతంలోని ఇంటింటికీ తిరిగి చందాలు సేకరించింది.
అలా వచ్చిన డబ్బుతో ఆలయాన్ని పునర్ నిర్మించింది. ఇప్పుడు ఆ ఆలయంలో హిందువులు, ముస్లింలు కలిసి దేవీ నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తుండటం విశేషం.
ఆలయ నిర్మాణం గురించి సుఘర బీని ఎవరైనా అడిగితే... దుర్గా దేవి ప్రపంచానికే తల్లి వంటిదని.. అందుకే ఆలయాన్ని పునర్నిర్మించాలని అనుకున్నానని చెబుతోంది.
ఇక్కడి హిందువులు, ముస్లింలు అన్ని పండగలను కలిసి జరుపుకుంటారని స్థానికులు చెబుతున్నారు. ప్రతీరోజు ఉదయం దుర్గామాత ఆలయంలో జరిగే హారతి, పూజల్లో హిందువులు, ముస్లింలు పాల్గొంటారని చెప్పారు.
ఈ ఆలయ కమిటీలో కూడా ముస్లిం, హిందువులు కలిసి సభ్యులుగా ఉండటం విశేషం.తమ కాలనీ వాసులంతా అందరూ కలిసిమెలసి ప్రశాంతంగా జీవిస్తామని.. మొహర్రం రోజున కూడా తాము దుర్గా మాత ఆలయాన్ని దర్శిస్తామని అక్కడి ముస్లింలు చెప్పారు.












Click it and Unblock the Notifications