వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రియాంకా గాంధీకి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఎందుకు అప్పగించట్లేదు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరీలో జరిగిన హింసాత్మక ఘటనను వివిధ పార్టీల నాయకులు ఖండించారు. సంఘటనా స్థలానికి వెళ్లేందుకు పలువురు నాయకులు ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రభుత్వం వారిని అడ్డుకుంటోంది.

ఈ క్రమంలో ప్రియాంకా గాంధీ వాద్రాతో సహా పలువురు కాంగ్రెస్ నేతలను సీతాపూర్‌లో అడ్డుకొని, అదుపులోకి తీసుకొన్నారు.

"రైతులను అణగదొక్కుతున్న విధానం చూస్తుంటే మాటలు రావట్లేదు. తమకు అన్యాయం జరుగుతోందని ఎన్నో నెలలుగా రైతులు గొంతెత్తి చెబుతున్నారు. కానీ, వినడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే, రైతులను అణచివేసే, నాశనం చేసే దిశలో ప్రభుత్వం రాజకీయలు చేస్తోందని స్పష్టం అవుతోంది" అంటూ ప్రియాంకా గాంధీ ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు.

"ఈ దేశం రైతులది. బిజేపీ సొత్తేం కాదు. దీన్ని రైతులు సాగుచేశారు. బలాన్ని ఉపయోగిస్తున్నారంటే పోలీసులు తమ నైతికతను కోల్పోయారనే అర్థం. తప్పు చేయడానికి నా ఇల్లు కదిలి రాలేదు. బాధితులను పరామర్శించడానికి వెళుతున్నాను. వారి కన్నీరు తుడవడానికి వెళుతున్నాను. నేనేం తప్పు చేశాను?

నేను నిజంగా తప్పు చేసుంటే మీ దగ్గర ఆదేశాలు ఉండాలి. వారెంట్ ఉండాలి. మీరు కారును ఆపుతున్నారు. నన్ను అడ్డుకొంటున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? నేను సీఎంను పిలుస్తుంటే ఆయన దాక్కొంటున్నారు. చేస్తున్న పని సరైనదే అయితే దాక్కోవడం ఎందుకు?" అని ఆమె ఆ వీడియోలో ప్రశ్నించారు.

కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ట్విట్టర్‌లో ఒక వీడియో పోస్ట్ చేసారు. అందులో ప్రియాంకా గాంధీ, హరియాణా కాంగ్రెస్ నాయకుడు దీపేందర్ హూడా పోలీసులతో గొడవపడుతూ కనిపించారు.

"నాకు ఆధారాలు చూపించండి. ఆర్డర్ చూపించండి. వారెంట్ చూపించండి. అవేమీ లేనట్లయితే మమ్మల్ని ఆపే హక్కు మీకు లేదు. మేం నలుగురం ఉన్నాం. ఏమనుకుంటున్నారు? ప్రజలను చంపగలరు, రైతులను అణగదొక్కగలరు కాబట్టి మమ్మల్నీ ఆపగలరు అనుకుంటున్నారా?" అంటూ ప్రియాంక ఆ వీడియోలో కోపంగా ప్రశ్నిస్తూ కనిపించారు.

ప్రియాంకా గాంధీ ఇంత ఆగ్రహం వ్యక్తం చేయడం లేదా ప్రభుత్వాన్ని ఇంత బలంగా వ్యతిరేకించడం ఇదేం మొదటిసారి కాదు.

యూపీ పోలీసులతో ప్రియాంకా గాంధీ వాగ్వాదం

ప్రియాంకా గాంధీ వైఖరి

మాజీ ఐపీఎస్ అధికారి ఎస్ఆర్ దారపురి కుటుంబాన్ని కలవడానికి వెళ్లినప్పుడు కూడా ప్రియాంకా గాంధీ, పోలీసులతో గొడవపడిన వీడియో వైరల్ అయిన సంగతి మీకు గుర్తు ఉండే ఉంటుంది.

ఆమె అక్కడితో ఆగకుండా ఒక పార్టీ కార్యకర్త స్కూటర్ మీద దారపురి ఇంటికి వెళ్లారు.

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసరన ప్రదర్శనల్లో దారపురి పాల్గొన్నారు.

సోన్‌భద్ర భూవివాదంలో ఆదివాసుల హత్య, హథ్‌రస్ అత్యాచారం, కోవిడ్ సమయంలో వలస కూలీల వెతలు.. ఇలా పలు అంశాల్లో ప్రియాంకా గాంధీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాధితులకు చేరువయ్యేందుకు ప్రయత్నించారు.

రాజకీయాల్లో చురుకైన పాత్ర

ఉత్తర్‌ప్రదేశ్‌లోని రెండు నియోజకవర్గాలు అమేథీ, రాయ్‌బరేలీలతో ప్రియాంకకు చిరకాల అనుబంధం ఉంది.

గతంలో తన తండ్రి రాజీవ్ గాంధీకే కాకుండా తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీల కోసం కూడా ఆమె ప్రచారం చేస్తూ వస్తున్నారు.

కాగా, 2019లో ఉత్తర్‌ప్రదేశ్ తూర్పు ప్రాంతానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులు కావడంతో ప్రియాంక అధికారికంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

మరి కొన్ని నెలల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రియాంకా గాంధీకి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగిస్తారా లేదా అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి.

సల్మాన్ ఖుర్దీష్ ఇచ్చిన ఒక ప్రకటనలో దీనికి సంబంధించిన సూచనలు కనిపించాయి.

ఇటీవల, ఎన్నికల తీర్మాన పత్రానికి సంబంధించి లఖ్‌నవూలో కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది.

దాని తరువాత సల్మాన్ ఖుర్దీష్ మాట్లాడుతూ, ప్రియాంకా గాంధీ ఆ రాష్ట్రంలో ప్రజలను కలుసుకుంటున్నారని, వారికి మెరుగైన, పారదర్శంగా పనిచేసే ప్రభుత్వాన్ని అందించేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు, ప్రియాంకా గాంధీ పోటీ ఇవ్వగలరా అని అడిగిన ప్రశ్నకు జవాబుగా.. "ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో భవిష్యత్తే నిర్ణయిస్తుంది. ప్రియాంక గాంధీ ముఖం, ఆయన (ఆదిత్యనాథ్) ముఖం కన్నా మెరుగ్గా ఉంటుంది. ఇదే నిజం" అని సల్మాన్ ఖుర్దీష్ అన్నారు.

ఎన్నికల ద్వారా ఆమె పార్టీకి అధ్యక్షురాలు కావాలి. అదే జరిగితే ప్రియాంక మంచి అభ్యర్థి అవుతారు

ప్రియాంక సామర్థ్యం, నైపుణ్యం

"ఉత్తర్‌ప్రదేశ్‌లో మాత్రమే కాదు, దేశ రాజకీయాల్లోనే ఆమె ముఖ్య పాత్ర పోషించగలరన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. దిల్లీకి దారి లఖ్‌నవూ మీదుగానే ఉందని మాకు తెలుసు. కానీ, గత కొన్నేళ్లుగా కాంగ్రెస్, ఇతర పార్టీలపై ఆధారపడి ఉంది. బలహీనంగా ఉంది. అయితే, అకస్మాత్తుగా పార్టీలో మార్పులు రాగలవా? ఇది భవిష్యత్తే నిర్ణయిస్తుంది" అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంజయ్ ఝా బీబీసీతో అన్నారు.

"అనేక రంగాల్లో బీజేపీ విఫలం అవుతోంది. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ఓ పక్క కరోనా, దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థ, మరోపక్క నిరుద్యోగం, అవినీతి పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షత వహించడానికి, పార్టీనే కాకుండా దేశాన్ని కూడా ఓ కొత్త దిశలోకి నడిపించడానికి ప్రియాంకా గాంధీకి ఇదొక మంచి అవకాశం" అని ఆయన అభిప్రాయపడ్డారు.

2012లో రాహుల్ గాంధీ గురించి కూడా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇలాంటివే అభిప్రాయాలు వినిపించాయని, అయితే అప్పట్లో రాహుల్ అందుకు సిద్ధంగా లేరని సీనియర్ జర్నలిస్ట్ రషీద్ కిద్వాయి అన్నారు. ఆ తరువాత యూపీలో కాంగ్రెస్ గ్రాఫ్ చాలా వేగంగా పడిపోయింది.

"సల్మాన్ ఖుర్దీష్ చెప్పినది ఒక వర్గం అభిప్రాయం. ఆమె పార్టీకి అధ్యక్షత వహించాలా, లేక ప్రధాన కార్యదర్శిగానే పనిచేయాలా, పార్టీలో సమస్యలపై దృష్టి పెట్టాలా అనేది మరొక వర్గం చెబుతుంది" అని కిద్వాయి అన్నారు.

''ప్రియాకా గాంధీకి ఒక విజన్ ఉంది. ఆమె ప్రజలకు ప్రేరణ కలిగించగలరు. ఆమె సమర్థులు. నైపుణ్యం కలిగిన వ్యక్తి. పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. బాగా మాట్లాడతారు. ప్రజలతో ఆమె వ్యవహరించే తీరు, సంబంధాలు బాగుంటాయి. బాగా ప్రచారం చేస్తారు. ఎన్నికల ద్వారా ఆమె పార్టీకి అధ్యక్షురాలు కావాలి. అదే జరిగితే ప్రియాంక మంచి అభ్యర్థి అవుతారు. ఆమె పార్టీకి మంచి ట్రంప్ కార్డ్ కూడా కాగలరు. ప్రియాంకా గాంధీ ముందుకు వస్తే, మేమంతా ఆమెకు తోడుగా ఉంటాం. కాంగ్రెస్ పార్టీలో యువకులు, వృద్ధులు జీ-23 సభ్యులు అందరూ ఆమెకు మద్దతిస్తారు" అని సంజయ్ ఝా చెప్పారు.

ప్రియాంకా గాంధీ వాద్రా

'రాజకీయాల్లో వాక్చాతుర్యం ఉంటే సరిపోదు'

దేశంలో ఏదైనా ఘోరమైన సంఘటన జరిగినప్పుడు ప్రియాంకా గాంధీ కచ్చితంగా తన స్వరాన్ని వినిపిస్తున్నారు కానీ, హథ్‌రస్ లేదా లఖీంపూర్ ఖేరీ లాంటి సంఘటనలు రోజూ జరగవని జర్నలిస్ట్ స్మితా గుప్తా అంటున్నారు. ఆమె చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను కవర్ చేస్తున్నారు.

"దీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడంలో ప్రియాంకగానీ, రాహుల్‌గానీ సఫలీకృతులు కాలేకపోయారు. ఘోరమైన సంఘటనలు అప్పుడప్పుడూ జరుగుతాయి. అలాంటి సందర్భాల్లో వాక్చాతుర్యం బయటపడుతుంది. రాహుల్ కన్నా ప్రియాంక బాగా మాట్లాడతారు. కానీ వాక్చాతుర్యం మాత్రం ఉంటే సరిపోదు" అని స్మితా గుప్తా అభిప్రాయపడ్డారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రియాంకకుగానీ, రాహుల్‌కుగానీ పగ్గాలు అప్పజెపితే కాంగ్రెస్‌పై సానుకూల ప్రభావం ఉండకపోవచ్చని స్మిత అన్నారు.

వాళ్లిద్దరివీ తెలిసిన ముఖాలు. పార్టీ కార్యకర్తలు కూడా బాగా పనిచేస్తారు. కానీ దీంతో కాంగ్రెస్ గెలవగలదా లేదా అనేది మాత్రం చెప్పడం కష్టమని ఆమె అన్నారు.

"పార్టీ కార్యకర్తల్లో ఆమె అంత పాపులర్ కాదు. మీరెక్కడికైనా వెళ్లి పార్టీ కార్యకర్తలతో మాట్లాడి రాహుల్, ప్రియాంకల ప్రస్తావన తీసుకురండి. వాళ్లు రాహుల్‌నే ఎన్నుకుంటారు. ఎందుకంటే ఆమె (ప్రియాంక) చాలా అహంకారి. కానీ, వేదికపై ఆమె దూకుడు, దేనికైనా టక్కున జవాబిచ్చే సామర్థ్యం బాగుంటాయి. ఈ లక్షణాలు రాహుల్‌లో కనిపించవు. కానీ, కార్యకర్తలతో మాట్లాడితే మీకు తెలుస్తుంది, ఆమెకు చాలా చెడ్డ ఇమేజ్ ఉందని.

ప్రియాంకేమీ ఇందిరా గాంధీ కాదు, ఎన్నికల్లో గెలవడానికి. గెలవనప్పుడు ఎవరైనా ఆమె అహంకారాన్ని ఎందుకు భరిస్తారు? 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత వారితో చేరాలని ఎవరైనా ఎందుకు అనుకుంటారు? అట్టడుగు స్థాయిలో పనిచేస్తున్నవారు కూడా ఆత్మగౌరవాన్ని ఆశిస్తారు" అని స్మితా గుప్తా అన్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత అఖిలేష్ ప్రతాప్ సింగ్ ఇందుకు విరుద్ధమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ప్రజలు ప్రియాంకా గాంధీని సీరియస్‌గా తీసుకుంటారని అన్నారు.

"ప్రజా సమస్యలపై రోడ్డుపైకి వచ్చిన ఏకైక నాయకురాలు ఆమె. తన గొంతు చాలాసార్లు వినిపించారు. ఆరుసార్లు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పలుమార్లు లాఠీ దెబ్బలు తిన్నారు. మీర్జాపూర్‌లో రైతుల సమస్య అయినా, అలహాబాద్‌లో మత్స్యకారుల సమస్య, హథ్‌రస్ రేప్ కేసు, రైతుల సమస్య.. ఏదైనా సరే ఆమె ప్రజల పక్షాన నిలబడ్డారు. ప్రధాన కార్యదర్శిగా ఆమె తన పనిని సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. ఆ బాధ్యత చాలా పెద్దది. కానీ సంస్థలో ఎవరు ఎలాంటి పాత్ర పోషిస్తారన్నది హై కమాండ్ మాత్రమే నిర్ణయిస్తుంది" అని ఆయన అన్నారు.

ప్రియాంకా గాంధీ వాద్రా, రాహుల్ గాంధీ

ట్రబుల్‌ షూటర్ పాత్ర

ప్రస్తుతం ప్రియాంకా గాంధీ పార్టీలో ట్రబుల్‌షూటర్ లేదా ఫైర్‌ఫైటర్ పాత్రలో కనిపిస్తున్నారని, ఒకవిధంగా అహ్మద్ పటేల్ లేని లోటును పూడుస్తారని రషీద్ కిద్వాయి అభిప్రాయం వ్యక్తం చేశారు.

"యూపీలో ఆమె ప్రధాన కార్యదర్శి. ఇక్కడి రాజకీయ కార్యకలాపాలను కూడా ఆమె చూస్తున్నారు. కాంగ్రెస్ పట్ల అసంతృప్తి ఉన్న వారంతా ప్రియాంక తలుపులు తడతారు."

అయితే ప్రియాంక, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి పోటీ చేస్తారా లేదా అనేది సందేహమేనని, ఇది అర్థం చేసుకోవాలంటే ఓసారి గతంలోకి తొంగి చూడాలని కిద్వాయి అన్నారు.

"2004 ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఇంగ్లండ్‌లో తన ఉద్యోగాన్ని వదిలేసి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. తన ప్రొఫెషనల్ జీవితాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చి రాహుల్ చాలా గొప్ప త్యాగం చేశారని సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ భావించారు.

2019లో రాహుల్ గాంధీకి సహాయం చేయడానికి ప్రియాంక రాజకీయాల్లోకి వచ్చారుగానీ ఆయన స్థానం తీసుకోవడానికి కాదు. సోనియా, ప్రియాంకలకు ఒకటే లక్ష్యం. రాజకీయాల్లో, కాంగ్రెస్ పార్టీలో రాహుల్ ప్రథమ స్థానంలో ఉండాలి. ఈ నేపథ్యంలో ప్రియాంక తనను తాను ఎప్పటికీ పోటీదారుగా మలుచుకోలేరు" అని కిద్వాయి వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Why Congress party did not hand over the reins to Priyanka Gandhi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X