జర్నలిస్టుగా నటించడం ఎందుకు?: విలేకరికి రాహుల్ గాంధీ చురకలు
న్యూఢిల్లీ: లోక్ సభ సెక్రెటేరియట్ తనపై అనర్హత వేటు వేసిన నేపథ్యంలో- కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) తొలిసారిగా మీడియా ముందుకొచ్చారు. దేశ రాజధానిలోని ఏఐసీసీ (AICC) ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi)పై మరోసారి ఘాటు విమర్శలు చేశారు. మోదీపై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలంటూ భారతీయ జనతా పార్టీ (BJP) నాయకులు చేసిన డిమాండ్ ను తోసిపుచ్చారు. తనకు అంత అవసరం రాలేదనీ, లోక్ సభ (Lok Sabha)లో ఉన్నా, లేకున్నా తాను జనంతోనే ఉంటానని తేల్చి చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటి పేరు (Modi Surname) వ్యవహారంలో సూరత్ న్యాయస్థానం రాహుల్ గాంధీని దోషి తేల్చిన నేపథ్యంలో లోక్ సభ సెక్రెటేరియట్ ఈ నిర్ణయం తీసుకుంది. మోదీ ఇంటిపేరును ప్రస్తావించడం దేశవ్యాప్తంగా ఉన్న ఇతర వెనుకబడిన కులాల (OBC)లను కించపరిచినట్టేననే వాదనలను బీజేపీ తెర మీదికి తీసుకొచ్చింది. ఓబీసీ (OBC) అంటే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీకి చిన్న చూపేనని, ప్రధాని మోదీని ఇంటిపేరుతో విమర్శించడం ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ఓబీసీ సామాజిక వర్గ ప్రజలను అవమానించాడని బీజేపీ ఆరోపిస్తోంది.

తాజాగా జరిగిన విలేెకరుల సమావేశంలో ఓ జర్నలిస్ట్ ఇదే అంశాన్ని ప్రస్తావించాడు. మోదీ ఇంటిపేరుతో ప్రధానిని విమర్శించడం వల్ల ఓబీసీ సామాజిక వర్గాల వారికి అవమానించినట్లు కాదా? అంటూ ప్రశ్నించగా.. దానికి రాహుల్ గాంధీ ఘాటుగా సమాధానం ఇచ్చారు. జర్నలిస్టునని చెప్పుకొంటూ బీజేపీ కోసం ఎందుకు పని చేస్తున్నావని నిలదీశారు. ఆ ప్రశ్న ఏదో సూటిగా అడగొచ్చు కదా? అని అడిగారు. బీజేపీ కోసం పని చేస్తోన్నప్పుడు ఆ పార్టీ బ్యాడ్జీని తగిలించుకుని విలేకరుల సమావేశానికి హాజరు కావొచ్చు కదా? అని ప్రశ్నించారు. జర్నలిస్టుగా ఎందుకు నటించడం? అంటూ చురకలు అంటించారు. రాహుల్ గాంధీ వేసిన ఈ ప్రశ్నకు జర్నలిస్టులందరూ గట్టిగా నవ్వడం కనిపించింది.












Click it and Unblock the Notifications