‘జెండా మీరు ఎగరేయండి: తర్వాత మదర్సాలపై..’
లక్నో: గణతంత్ర దినోత్సవం సందర్భంగా మదర్సాలు తమ ప్రాంగణాలపై త్రివర్ణ పతాకాలు ఎగరేయాలంటూ ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థ.. ముస్లిం రాష్ట్రీయ మంచ్(ఎంఆర్‌ఎం) పిలుపుపై వివాదం రేగింది.
దీనిపై ప్రముఖ ఇస్లామిక్ మత సంస్థ దారుల్ ఉలూం దేవబంద్ విమర్శలు వ్యక్తం చేయగా.. తామెప్పుడూ ఇలాంటి సంస్థల దేశభక్తిని అనుమానించలేదని ఎంఆర్‌ఎం వివరణ ఇచ్చింది.
ఎంఆర్‌ఎం పిలుపుపై అభ్యంతరం వ్యక్తం చేసిన దేవబంద్ సంస్థ.. భారత రాజ్యాంగాన్నీ, జాతీయ జెండాపై ఆర్‌ఎస్‌ఎస్‌కు నమ్మకం ఉందా? అని ప్రశ్నించింది.

దాదాపు అన్ని సంస్థలూ జాతీయ జెండాను ఎగరవేసి, స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలను జరుపుకొంటున్నాయని ప్రెస్ కార్యదర్శి అష్రఫ్ ఉస్మానీ పేర్కొన్నారు. ఆ సంస్థ (ఆర్‌ఎస్‌ఎస్) కాషాయ జెండాను మాత్రమే ఆరాధిస్తుందనీ, ముందు వారి ప్రధాన కార్యాలయం, ఇతర చోట్లా త్రివర్ణ జెండాను ఎగరేసి, మదర్సాల గురించి మాట్లాడాలన్నారు.
దీనిపై ఎంఆర్‌ఎం జాతీయ కన్వీనర్ మొహమ్మద్ అఫ్జల్ వివరణ ఇస్తూ.. జనవరి 26న, ఆగస్టు 15న జాతీయ జెండాలు ఎగరేయాలంటూ గత ఐదేళ్లుగా మదర్సాలను కోరుతున్నామన్నారు. వారి దేశభక్తిపై తమకెలాంటి అనుమానం లేదనీ, వారిని పరీక్షించేందుకూ కాదని తెలిపారు.
ప్రతీ స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజున అన్ని సరస్వతీ శిక్షా మందిర్ పాఠశాలల్లో జాతీయ పతాకాన్ని ఎగరవేయడం జరుగుతుందని చెప్పారు. దేశ వ్యాప్తంగా అన్ని ఆర్ఎస్ఎస్ కార్యాలయాల్లోనూ జాతీయ దినోత్సవాలను జరుపుతున్నామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications