సిఎం కేజ్రీవాల్ హింట్: మూణ్నాళ్ల ముచ్చటేనా?
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేస్తారనే ప్రచారం ముమ్మరమైంది. ఇది చివరి సెషన్‌లాగా కనిపిస్తోందని ఆయన శుక్రవారం శాసనసభలో అన్నారు. జన్ లోక్‌పాల్ బిల్లును అడ్డుకుంటే రాజీనామా చేస్తానని ఆయన ముందే హెచ్చరించారు. జన్ లోక్‌పాల్ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టడాన్ని కాంగ్రెసు, బిజెపి సభ్యులు అడ్డుకున్నారు. బిల్లును ప్రతిపాదించడాన్ని వ్యతిరేకిస్తూ 42 మంది సభ్యులు ఓటు చేయగా, సమర్థిస్తూ 27 మంది సభ్యులు ఓటు చేశారు.
జన్ లోక్‌పాల్ బిల్లును ప్రతిపాదించకుండా కాంగ్రెసు, బిజెపి సభ్యులు అడ్డుకున్నారని కేజ్రీవాల్ విమర్శించారు. కేజ్రీవాల్ ప్రసంగాన్ని ప్రతిపక్షాల సభ్యులు అడ్డుకున్నారు. గత రెండు రోజులుగా శాసనసభలో జరుగుతున్న సంఘటనల పట్ల తాను తీవ్ర నిరాశకు గురైనట్లు తెలిపారు.

ఆమ్ ఆద్మీ పార్టీ అత్యవసర సమావేశానికి కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. అతి ప్రధానమైన బిల్లును సభలో ప్రతిపాదించకుండా అడ్డుకున్నందుకు నిరసనగా కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశాలున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కేజ్రీవాల్ రాజీనామా చేస్తారనే వార్తలను కాదనలేమని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు యోగేంద్ర యాదవ్ కూడా చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కార్యాలయానికి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. తాము వీధుల్లో పోరాటం చేస్తామని, ప్రభుత్వాన్ని రక్షించుకునే ఉద్దేశం ఏమీ లేదని, దేశాన్ని అవినీతి నుంచి కాపాడుతామని కేజ్రీవాల్ అన్నారు.












Click it and Unblock the Notifications