మోదీ మార్క్ మ్యాజిక్ - నితీశ్ సరెం'డర్'-ఆ బిల్లే బ్రహ్మాస్త్రం..!!
Waqf Bill Impact on Bihar:దేశంలో ఇప్పుడు సర్వత్రా జరుగుతున్న చర్చ వక్ఫ్ బిల్లు. కేంద్రం తీసుకొచ్చిన ఈ వక్ఫ్ బిల్లు ఇటు లోక్‌సభలో అటు రాజ్యసభలో ఆమోదం పొందింది. కొన్ని పార్టీలు వక్ఫ్ బిల్లును వ్యతిరేకించగా.. ఎన్డీయే కూటమిలోని పార్టీలు మద్దతు తెలిపాయి. అయితే కేంద్రం ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లుపై ముస్లిం సమాజం, ముస్లిం పార్టీలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఇది కచ్చితంగా బీజేపీపై ఎన్డీయే కూటమిలోని పార్టీలపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. చట్టసభల్లో ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లు అమల్లోకి వచ్చేందుకు ఇక రాష్ట్రపతి ముద్ర వేయడం మాత్రమే మిగిలి ఉంది. అది కూడా త్వరలోనే జరిగిపోతుంది. వక్ఫ్ బిల్లు పాస్ అయిన తర్వాత దాని ప్రభావం ఎన్డీయే కూటమిపై ఏ మేరకు ఉంటుందనేది తెలియాలంటే ఈ ఏడాది జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలను కొలమానంగా తీసుకోవచ్చు.
డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా వక్ఫ్ బిల్లు
బీహార్‌లో ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పోరు బీజేపీ-జేడీయూ-ఎల్జేపీ పార్టీలతో కూడిన ఎన్డీయే కూటమి ఆర్జేడీ కాంగ్రెస్‌ల మధ్యే జరగనుంది. బీజేపీ-జేడీయూ-ఎల్‌జేపీ పార్టీలు వక్ఫ్ బిల్లుకు మద్దతు తెలపగా.. ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీలు వ్యతిరేకించాయి. ఇదిలా ఉంటే కొత్తగా బీహార్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్ సురాజ్ కూడా బిల్లును వ్యతిరేకించింది. అయితే చట్టసభల్లో ఆ పార్టీకి సభ్యత్వం లేదు.అయితే తాము ఆ బిల్లును స్వాగతించడం లేదని ఆ పార్టీ పేర్కొంది. ఇక మజ్లిస్ పార్టీ కూడా బిల్లును వ్యతిరేకించింది. దీంతో బీహార్ ఎన్నికల్లో కచ్చితంగా కూటమి ఓట్లకు చిల్లు పడే అవకాశం కనిపిస్తోందని ఈ రెండు పార్టీలు చీల్చుతాయనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వక్ఫ్ బిల్లు నిర్ణయాత్మక అంశంగా మారే అవకాశం ఉంది.

బడ్జెట్‌లో బీహార్‌కు పెద్ద పీట
బీహార్‌లో పాగా వేయాలన్నది మోదీ చిరకాల వాంఛ. నితీష్‌తో మైత్రి కొనసాగుతున్న తమ మార్కు రాజకీయం బీహార్‌లో అమలు చేస్తున్నారు. గతంలో నితీష్‌తో ఎదురైన అనుభవాలను మనసులో పెట్టుకున్న మోదీ, మరోసారి అలాంటి అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. బీహార్‌లో తమమీదే నితీష్ ఆధారపడే పరిస్థితి తీసుకురావాలనేది మోదీ - షా లక్ష్యం. బీహార్‌లో పాగా వేస్తే దాదాపుగా జమిలీ ఎన్నికలకు ప్రజామోదం లభించినట్లుగానే బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం కేంద్ర బడ్జెట్ నుంచే వ్యూహాత్మకంగా పావులు కదిపారు. ఇది కేంద్ర బడ్జెట్ కాదు.. బీహార్ బడ్జెట్ అంటూ ప్రతిపక్షాలే ప్రచారం చేసేలా కేటాయింపులు చేశారు. భారీ సంస్థలను బీహార్‌కు ప్రకటించారు. గతంలో ముస్లిం ఓటు బ్యాంకు దూరమైన కారణంగానే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినా.. మ్యాజిక్ ఫిగర్‌ను మాత్రం బీజేపీ చేరుకోలేకపోయింది. వ్యూహాత్మకంగా బీహార్ ఎన్నికలకు ముందు వక్ఫ్ బిల్లు ఆమోదించేలా చేసుకున్న బీజేపీ నాయకత్వం, బీహార్‌లో వెనుకబడి ఉన్న ముస్లిం వర్గాల ప్రజలను తమవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయినట్లుగా విశ్లేషణలు వస్తున్నాయి.ఇండియా కూటమి పార్టీలు బిల్లు వ్యతిరేకిస్తున్నా.. ముస్లిం సామాజిక అట్టడుగు వర్గాలు ఈ బిల్లును స్వాగతిస్తున్నాయి.ఇక బీహార్‌సామాజిక సమీకరణాల్లో రాజకీయం చేయడంలో బీజేపీ ఆరితేరింది. గత ఎన్నికల్లోనే సోషల్ ఇంజినీరింగ్‌లో మిగతా పార్టీలను వెనక్కు నెట్టేసింది.
బీజేపీ ప్లాన్, బీహార్ పబ్లిక్ పల్స్‌ను పసిగట్టిన సీఎం నితీష్ రూటు మార్చారు. తాను ఎన్డీయే వీడేదిలేదని తేల్చి చెప్పారు. నితీష్ ఎన్డీయే సీఎంగా ప్రకటించాలని జేడీయూ డిమాండ్ సైతం బీజేపీ తాజా ఎత్తుగడలతో కనుమరుగైంది. నితీష్‌ను బలహీనపరుస్తూ.. బీహార్ పై పట్టు పెంచుకుంటూ బీజేపీ ఆడుతున్న కొత్త గేమ్ ఆసక్తికరంగా మారింది.అటు నితీష్‌ను ఫిక్స్ చేస్తూ ఇటు బీహార్‌లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీకి వక్ఫ్ బిల్లు ఆమోదం బ్రహ్మాస్త్రంగా మారుతోంది.
బీహార్‌లో ముస్లిం ఓటు బ్యాంకు
బీహార్‌లో 29వేల బిఘాలపై వక్ఫ్ యాజమాన్య హక్కులు కలిగి ఉంది. ఇందులో 50శాతం వరకు ఆక్రమణకు గురైనవే.ఇక బీహార్ జనాభాలో 18శాతం ముస్లి సామాజిక వర్గానికి చెందినవారున్నారు. వీరు ఓటు చాలా నియోజకవర్గాల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా మారుతుంది. వక్ఫ్ బిల్లు భావోద్వేగం లేదా సెంటిమెంట్‌తో కూడుకున్నది కావడంతో ఆర్జేడీ, కాంగ్రెస్, జన్‌సురాజ్‌లాంటి పార్టీలు ఈ సెంటిమెంట్‌ను తమకు అనుకూలంగా మల్చుకునేందుకు బలంగా వాడుకుంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మూడు పార్టీల్లో ఈ ముస్లిం ఓటు బ్యాంకు ఎవరి వైపు మల్లుతుందనేదే పెద్ద ప్రశ్న. ఈ మూడు పార్టీల్లో ఎవరికి నష్టం చేస్తుందనేది కూడా ఇప్పుడప్పుడే చెప్పలేని పరిస్థితి. అయితే ఈ బిల్లుతో బీహార్‌లోని హిందూ ఓట్ బ్యాంక్ అంతా ఒక్కతాటిపైకి వచ్చి బీజేపీకి అండగా నిలిచే అవకాశం ఉందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. అదేసమయంలో ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీలకు ముస్లిం ఓటు బ్యాంకు పెరుగుతుంది. అయితే వక్ఫ్ బిల్లును ఎవరు సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లను తమవైపు తిప్పుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.బీహార్‌లో 47-50 అసెంబ్లీ స్థానాలను ముస్లిం ఓటు బ్యాంకు డిసైడ్ చేస్తుంది.

బీహార్ రాజకీయాలపై వక్ఫ్ బిల్లు ప్రభావం
బీహార్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు కేవలం ఆ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని నిర్ణయించడమే కాదు.. సీఎం నితీష్ కుమార్‌తో పాటు జనతాదల్ యునైటెడ్ పార్టీ భవిష్యత్తును కూడా డిసైడ్ చేయనున్నాయి. ఈ పార్టీకి గతంలో ముస్లింలు అండగా నిలిచారు. వక్ఫ్ బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టిన సమయంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జేడీయూ బిల్లుకు మద్దతు ఇస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అన్ని అనుమానాలను పటాపంచలు చేస్తూ కూటమిలోని ముఖ్య భాగస్వాములైన జేడీయూ, టీడీపీ, ఎల్‌జేపీల మద్దతుతో లోక్‌సభలో వక్ఫ్ బిల్లు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆమోదం పొందింది.ముస్లింల సంక్షేమం, లౌకికత్వం అనే అంశాలకు తాము కట్టుబడి ఉంటామని హైలైట్ చేస్తూ కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ బిల్లుకు మద్దతు తెలపడం జరిగింది. బీహార్ రాష్ట్రంలో ముస్లింల సంక్షేమం కోసం ఏ పార్టీ చేయనంతగా తాము చేసినట్లు జేడీయూ బిల్లుపై జరిగిన చర్చలో భాగంగా చెప్పుకొచ్చింది. అదే సమయంలో టీడీపీ కూడా ముస్లింల సంక్షేమం, వారి అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే ప్రముఖ ముస్లిం రాజకీయ నాయకులు, విపక్ష పార్టీలు వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ ఇది ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ధ్వజమెత్తారు. అంతేకాదు రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా బిల్లు ఉందని మండిపడ్డారు.
ట్రిపుల్ తలాక్ - యూపీలో బీజేపీ
ఎన్నికల ఫలితాలను చాలా ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తాయి. ప్రధానంగా కులం, మతం, సామాజిక అంశాలు ప్రధానంగా పరిగణించబడుతాయి. అయితే గతేడాది జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గొప్ప విజయాన్ని సాధిస్తుందని అంతా అంచనా వేశారు. కానీ అంచనాలన్నీ పటాపంచలై అనూహ్యంగా బీజేపీ అధికారం చేజిక్కించుకుంది. అప్పటి వరకు గత బీజేపీ సర్కారుపై హర్యానా రైతులు ఆగ్రహం, రెజ్లర్లు రోడెక్కడం,జాట్ సామాజిక వర్గం అసంతృప్తి వంటి అంశాలు కచ్చితంగా బీజేపీకి ప్రతికూలంగా మారుతాయని రాజకీయ విశ్లేషకులు, సెఫాలజిస్టులు చెప్పుకొచ్చారు. వీరంతా ఒకటి తలిస్తే ఓటరు మాత్రం బీజేపీ వైపే నిలబడ్డాడు.త్రిపుల్ తలాక్ రద్దు సమయంలో ముస్లింలకు వ్యతిరేకమంటూ రాజకీయ రచ్చ జరిగినా యూపీలో మాత్రం ముస్లిం వర్గాల నుంచి బీజేపీకి అనూహ్య మద్దతు లభించింది. ఇప్పుడు వక్ఫ్ బిల్లు విషయంలోను బీహార్‌లో అదే రిపీట్ అవుతుందనే ధీమాతో బీజేపీ నేతలున్నారు.
బీజేపీకి కచ్చితంగా ప్లస్ అవుతుందా..?
వక్ఫ్ బిల్లు ఆమోదంతో బీహార్‌లో కూడా ముస్లిం ఓటర్లు కూటమికి దూరం అవుతారన్న ప్రచారం ఉండగా.. హిందువులకు సంబంధించిన ఓట్లన్నీ పోలరైజ్ అయి అది బీజేపీకి నితీష్‌కుమార్‌కు పాజిటివ్‌గా మారే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు ఈ బిల్లును స్వాగతిస్తున్న ముస్లిం అట్టడుగు వర్గాల ప్రజలు బీజేపీ వైపు నిలుస్తారనే కాన్ఫిడెన్స్‌ను కమలం పార్టీ వ్యక్తం చేస్తోంది. ఇక కూటమికి దూరమయ్యే ముస్లిం ఓటర్లు ఎవరికి ఓటు వేస్తారా అనేదే పెద్ద ప్రశ్న. ఆర్జేడీ, కాంగ్రెస్, జన్ సురాజ్, మజ్లిస్ పార్టీలుండగా.. ఇక్కడ ముస్లిం ఓటు బ్యాంకు చీలి కూటమికి మేలు చేసే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు సీమాంచల్ వరకు మాత్రమే పరిమితమై ఉన్న ఏఐఎంఐఎం పార్టీ... ఇప్పుడు విస్తరించాలని భావిస్తోంది. మరి ఇది ఎంత వరకు కలిసొస్తుందో వేచి చూడాలి.
మజ్లిస్ పార్టీ, ప్రశాంత్ కిషోర్ జన్‌సురాజ్ పార్టీలు ముస్లిం ఓట్లను చీల్చే అవకాశం ఉంది.ఇది బీజేపీకి కలిసొస్తుంది.అయితే బీజేపీ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరేడు నెలలు సమయం ఉంది.ఈలోగా చాలా మార్పులు కనిపించే అవకాశం ఉంది. ఓ వైపు బిల్లు ద్వారా తీసుకొచ్చిన సంస్కరణలు పేద ముస్లింలకు మేలు చేకూరుస్తుందనేది కమలం పార్టీ వాదన.అయితే బీహార్ రాష్ట్ర ప్రజల్లో ఈ అంశాన్ని ఎంత బలంగా బీజేపీ తీసుకెళుతుందనేది తెలియాల్సి ఉంది. బీహార్ ఎన్నికల తర్వాత అంటే వచ్చే ఏడాది మరికొన్ని ముఖ్య రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, అస్సోం, తమిళనాడు, కేరళ అసెంబ్లీలకు ఎన్నికల జరుగుతాయి. అయితే వక్ఫ్ బిల్లు ఆమోదం పొందిన తర్వాత బీహార్ అసెంబ్లీకి జరుగుతున్న తొలి ఎన్నిక కాబట్టి ఈ రాష్ట్ర ఫలితాల అనంతరం మిగతా రాష్ట్రాల ఫలితాలు ఎలా ఉంటాయో ఒక అంచనా వేయొచ్చని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications