వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రిటన్-అమెరికా సంబంధాలు లిజ్ ట్రస్, బైడెన్‌ల పాలనలో మెరుగు పడతాయా, మరింత బలహీనపడతాయా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్

బ్రిటన్ కొత్త ప్రధాని లిజ్ ట్రస్, విదేశాంగ విధానాలకు సంబంధించి అనేక సవాళ్లను ఎదుర్కోనున్నారు.

అందులో ముఖ్యమైనది అమెరికాతో సంబంధాలు.

లిజ్ ట్రస్‌ గురించి ఏమనుకుంటున్నారని వాషింగ్టన్‌లోని అమెరికన్లను అడిగితే వారిలో ఎక్కువ మంది తెల్లముఖమేసి అలా చూస్తూ ఉండి పోతారు.

మరొకవైపు 'బ్రిటన్ కొత్త ప్రధాని ఎవరో చూడండి', 'లిజ్ ట్రస్ ఎవరు?' అంటూ అమెరికా పత్రికల్లో శీర్షికలు కనిపిస్తున్నాయి.

సరే ఇది ఎలా ఉన్నా బ్రిటన్ కొత్త ప్రధాని విధానాలు ఎలా ఉండనున్నాయో అమెరికా అధికార యంత్రాంగం నిశితంగా పరిశీలిస్తోంది. బోరిస్ జాన్సన్ ప్రధానిగా ఉన్నప్పుడు బ్రిటన్‌తో జో బైడెన్‌కు సఖ్యత కొరవడింది. ఇప్పుడు ఆ అంతరాలను తగ్గించి బ్రిటన్, అమెరికాల మధ్య బంధాన్ని లిజ్ ట్రస్ బలోపేతం చేస్తారో లేదో చూడాలి.

ఇక బ్రిటన్ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో బ్రిటన్, యూరోపియన్ యూనియన్ మధ్య రవాణా ఒకటి. నార్తరన్ ఐర్లాండ్ ప్రొటోకాల్ వల్ల గ్రేట్ బ్రిటన్ నుంచి నార్తరన్ ఐర్లాండ్‌కు వెళ్లే రవాణా వాహనాలకు అదనపు కస్టమ్ చెక్స్ పెట్టాల్సి ఉంటుంది.

బ్రిటన్ విదేశాంగశాఖ మంత్రిగా ఉన్నప్పుడు నార్తరన్ ఐర్లాండ్ ప్రొటోకాల్‌ను ఏకపక్షంగా తిరగరాసేందుకు లిజ్ ట్రస్‌ మద్దతు ఇచ్చారు. కానీ దాన్ని యూరోపియన్ యూనియన్‌తో పాటు అమెరికా కూడా వ్యతిరేకించింది.

'ఈ విషయంలో ఆమె బలంగా నిలబడొచ్చు. అమెరికాకు వెళ్లి అధ్యక్షుడిని కలిసినప్పుడు ఆ విషయంలో అమెరికా ఎందుకు బ్రిటన్ వైపు ఉండాలో చెప్పేందుకు ఆమె భయపడతారని నేను అనుకోవడం లేదు' అని మార్గరేట్ థాచర్ సెంటర్ ఫర్ ఫ్రీడం డైరెక్టర్ నీల్ గార్డినర్ అన్నారు.


నార్తరన్ ఐర్లాండ్ ప్రొటోకాల్ అంటే ఏంటి?

  • బ్రెగ్జిట్‌కు ముందు బ్రిటన్, యూరోపియన్ యూనియన్‌ మధ్య సరకు రవాణా చాలా సులభంగా ఉండేది.
  • కానీ బ్రెగ్జిట్ తరువాత సరుకు రవాణాకు కొత్త వ్యవస్థ అవసరమైంది. ఎందుకంటే యూరోపియన్ యూనియన్‌లో ఐర్లాండ్ ఉండగా నార్తరన్ ఐర్లాండ్ మాత్రం బ్రిటన్‌లో ఉంది.
  • బ్రెగ్జిట్ ఒప్పందంలో భాగంగా బ్రిటన్, యూరోపియన్ యూనియన్ రెండూ నార్తరన్ ఐర్లాండ్ ప్రొటోకాల్ మీద సంతకాలు చేశాయి.
  • ఐర్లాండ్ సరిహద్దుల్లో సరకు రవాణా వాహనాలను తనిఖీ చేయడానికి బదులుగా నార్తరన్ ఐర్లాండ్, గ్రేట్ బ్రిటన్ సరిహద్దుల్లో తనిఖీ చేసేందుకు ఒప్పందం కుదిరింది.
  • దీని వల్ల నిబంధనలు కఠినంగా మారి సరకు రవాణా ఇబ్బందికరంగా మారుతుందనే భయాలు పెరుగుతున్నాయి.
  • ఇలా సరిహద్దుల వద్ద చెక్ పాయింట్లు పెట్టడం వల్ల బ్రిటన్‌లో భాగంగా ఉన్న నార్తరన్ ఐర్లాండ్ స్థాయిని తగ్గించినట్లు అవుతుందని కొందరు వాదిస్తున్నారు.

ఐర్లాండ్, నార్తరన్ ఐర్లాండ్ మధ్య సంక్షోభాన్ని నివారిస్తూ జరిగిన 'గుడ్ ఫ్రైడే' శాంతి ఒప్పందానికి ఏ మాత్రం నష్టం జరిగినా అది అమెరికా కాంగ్రెస్‌లోని డెమోక్రాట్లను నొప్పిస్తుందనే విషయం ప్రెసిడెంట్ జో బైడెన్‌కు బాగా తెలుసు. ఒకనాడు నార్తరన్ ఐర్లాండ్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభాన్ని నివారించింది అమెరికానే అని ఆయన నమ్ముతారు.

బ్రిటన్‌ కొత్త ప్రధానికి తొలిసారి అమెరికా అధ్యక్షుడు ఫోన్ చేసినప్పుడు ఈ విషయాలు కూడా ప్రస్తావనలోకి వచ్చాయి.

బెల్‌ఫాస్ట్ (గుడ్ ఫ్రైడే) ఒప్పందాన్ని రక్షించాల్సిన అవసరంతోపాటు నార్తరన్ ఐర్లాండ్ ప్రొటోకాల్ మీద యూరోపియన్ యూనియన్‌తో బ్రిటన్ ఒక అంగీకారానికి రావాల్సిన ప్రాముఖ్యతను కూడా అమెరికా నొక్కి చెప్పిందని ఆ దేశ అధికారులు చెబుతున్నారు.

కానీ అలాంటి విషయాలు ఏవీ ప్రస్తావనకు రాలేదని బ్రిటన్ ప్రధాని కార్యాలయం అంటోంది.

బెల్ ఫాస్ట్ ఒప్పందం

నార్తరన్ ఐర్లాండ్ ప్రొటోకాల్ మీద బ్రిటన్, యూరోపియన్ యూనియన్ మధ్య సఖ్యత ఇంకా కుదరకపోవడం మంచిది కాదని చాలా మంది డెమోక్రాట్లు భావిస్తున్నారు. అది బ్రిటన్, అమెరికాల మధ్య వాణిజ్య సంబంధాలను దెబ్బతీస్తుందని కొందరు చెబుతున్నారు.

నార్తరన్ ఐర్లాండ్ ప్రొటోకాల్ విషయంలో బ్రిటన్ ఏకపక్షంగా ముందుకు వెళితే అది ఇబ్బందికర పరిణామాలకు దారి తీస్తుందని గతంలో బ్రిటన్ విదేశాంగ మంత్రిగా లిజ్ ట్రస్ అమెరికాకు వచ్చినప్పుడు ఆమెతో స్పీకర్ నాన్సీ పెలోసీ అన్నారు.

'ఈ విషయం వల్ల బ్రిటన్, అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు ఆగిపోయే ప్రమాదం వస్తుంది. అందులో సందేహం లేదు' అని అమెరికా కాంగ్రెస్ మ్యాన్ కీటింగ్ చెబుతున్నారు.

ఒకవేళ నార్తరన్ ఐర్లాండ్ ప్రొటోకాల్ విషయంలో బ్రిటన్ ఏకపక్షంగా ముందుకు వెళితే అది మరింత నష్టాన్ని చేస్తుందని అట్లాంటిక్ కౌన్సిల్ ఫెల్లో ఫ్రాన్సెస్ బర్వేల్ అంటున్నారు. రెండు ప్రభుత్వాల మధ్య ఉన్నత స్థాయి సంప్రదింపులు తప్పకుండా అవసరమవుతాయని ఆమె అభిప్రాయపడ్డారు.

ఒకప్పుడు బ్రిటన్ వాణిజ్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడు అమెరికాలోని అనేక రాష్ట్రాలతో విడివిడిగా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడంలో లిజ్ ట్రస్ కీలక పాత్ర పోషించారు. అయితే టారిఫ్‌లు, వాణిజ్యానికి సంబంధించిన అవంతరాలను పరిష్కరించే శక్తి అమెరికాలోని ఏ ఒక్క రాష్ట్రానికి లేదని ఫ్రాన్సెస్ అన్నారు.

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్‌లో రిపబ్లికన్ల మెజారిటీ పెరిగితే బ్రిటన్, అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందాలు కుదిరేందుకు అవకావశాలు పెరగొచ్చని గార్డినర్ చెబుతున్నారు.

'చాలా మంది రిపబ్లికన్ నేతలు బ్రిటన్‌తో ఒప్పందం చేసుకునేందుకు అనుకూలంగా ఉన్నారు' అని గార్డినర్ అన్నారు.

వాణిజ్య ఒప్పందాల విషయంలో అమెరికా, బ్రిటన్ మధ్య విబేధాలున్నప్పటికీ రక్షణ, నిఘా విషయంలో మాత్రం మరొక మాటలేకుండా కలిసిమెలిసి రెండు దేశాలు ముందుకు పోతున్నాయి.

ఇటీవల బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా కలిసి అణు అంతర్గాముల మీద ఒప్పందం కుదుర్చుకున్నాయి. అలాగే కెనడా, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్ కలిసి ఫైవ్-ఐస్ అనే నిఘా వ్యవస్థ మీద ముందుకు వెళ్తున్నాయి.

లిజ్ ట్రస్-జో బైడెన్ సంబంధాన్ని ఒక నాటి మార్గరేట్ థాచర్-రోనాల్డ్ రీగన్ బంధంతో నీల్ గార్డినర్ వంటి వాళ్లు పోలుస్తున్నారు.

'అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సహజంగానే బ్రిటన్ అంటే అంతగా మొగ్గు చూపరు. ఈ నేపథ్యంలో వచ్చే రెండేళ్లపాటు అమెరికాతో బ్రిటన్ సంబంధాలు కాస్త క్లిష్టంగానే ఉంటాయి' అని గార్డినర్ అన్నారు.

అయితే యుక్రెయిన్, చైనా రూపంలో అటు అమెరికాకి ఇటు బ్రిటన్‌కు ఉమ్మడిగా విదేశాంగ సవాళ్లు ఉన్నాయి.

మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో పోలిస్తే చైనా విషయంలో లిజ్ ట్రస్ కఠినంగా ఉన్నారు. జో బైడెన్ మాదిరిగానే ఆ దేశాన్ని నిత్యం అనుమానిస్తూ నిశితంగా పరిశీలిస్తూ ఉంటారు. యుక్రెయిన్ విషయంలోనూ బ్రిటన్ స్పందనను గతంలో జో బైడెన్ మెచ్చుకుని ఉన్నారు. కొన్ని సంవత్సరాలపాటు యుక్రెయిన్, రష్యా యుద్ధం కొనసాగుతుందని అమెరికా భావిస్తోంది. ఈ కాలంలో యుక్రెయిన్‌కు అత్యవసర సాయం చేయడం వంటి అంశాల మీద బ్రిటన్, అమెరికా కలిసి పని చేసే అవకాశం ఉంది.

బ్రిటన్, అమెరికాలలో నేతలు మారినప్పుడల్లా రెండు దేశాల మధ్య 'ప్రత్యేక బంధం’ అనే పదానికి కొత్త అర్థం, వివరణ వస్తూ ఉంటుంది. కాలం గడిచే కొద్దీ ఈ బంధంలో హెచ్చు తగ్గులు కనిపిస్తూ ఉంటాయి.

సాంస్కృతిక, చారిత్రక, భాషా పరమైన బంధాలు కొంత మేరకు పని చేయచ్చు. కానీ అంతకు మించి ఈ ఆధునిక ప్రపంచంలో సెంటిమెంట్‌కు పెద్దగా విలువ ఉండదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Will Britain-US relations improve or weaken under Liz Truss and Biden?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X