El Nino: 70 ఏళ్ల చరిత్ర..! రుతుపవనాలను మార్చేయబోతున్న మెగా చేంజ్!
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులను శాసించే 'ఎల్ నినో' (El Nino) ప్రభావం మళ్లీ తెరపైకి వచ్చింది. రాబోయే 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభం నాటికి పసిఫిక్ మహాసముద్రంలో తీవ్రమైన ఎల్ నినో పరిస్థితులు ఏర్పడవచ్చని ప్రాథమిక అంచనాలు వెలువడుతున్నాయి. సాధారణంగా ఎల్ నినో వస్తోందంటే చాలు.. భారత్‌లో కరువు పరిస్థితులు ఏర్పడతాయని, వర్షాలు పడవనే ఆందోళన అందరిలోనూ మొదలవుతుంది.
అయితే, ఈసారి రాబోయే ఎల్ నినో వల్ల 2027 భారత రుతుపవనాలకు (Monsoon) భారీ నష్టం వాటిల్లుతుందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి తొందరపాటు అవసరం లేదని, భయపడాల్సిన పని లేదని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు. చారిత్రక వాతావరణ నమూనాలను పరిశీలిస్తే.. ఎంతటి బలమైన ఎల్ నినో అయినా సరే, భారత వర్షాకాలం ప్రారంభం కావడానికి ముందే క్రమంగా బలహీనపడిపోతుందని వారు విశ్లేషిస్తున్నారు.

వాతావరణ శాస్త్రవేత్తలు 1951 నుండి ఇప్పటివరకు సంభవించిన అతి బలమైన ఎల్ నినో రికార్డులను లోతుగా పరిశీలించారు. ముఖ్యంగా 1982-83, 1997-98, ఇటీవలి 2015-16 నాటి తీవ్రమైన వాతావరణ సంఘటనలను విశ్లేషించినప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. ఈ బలమైన ఎల్ నినోలన్నీ కూడా ఆయా సంవత్సరాల చివరి నాటికి (అంటే శీతాకాలంలో) గరిష్ట స్థాయికి (ఉచ్ఛస్థితికి) చేరుకుంటాయి. ఆ తర్వాత, సరిగ్గా భారతదేశంలో నైరుతి రుతుపవనాలు ప్రారంభమయ్యే సమయానికి (వేసవి ముగిసే సరికి) వాటి శక్తిని కోల్పోయి పూర్తిగా బలహీనపడతాయి.
గత చరిత్ర ఏం చెబుతోంది?
ఉదాహరణకు, 1997-98 నాటి ఎల్ నినో ప్రభావాన్ని చూస్తే.. 1997 చివరి నాటికి పసిఫిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఏకంగా 2°C పైగా నమోదయ్యాయి. కానీ, కట్ చేస్తే.. 1998 మధ్యకాలానికి (భారత రుతుపవనాల సమయానికి) వచ్చేసరికి ఆ ఎల్ నినో తన శక్తిని కోల్పోవడమే కాకుండా.. వర్షాలకు అనుకూలించే 'లా నినా' (La Nina) పరిస్థితులుగా మారిపోయింది. 2015-16 లో కూడా సరిగ్గా ఇదే తరహా వాతావరణ నమూనా పునరావృతమైంది. దీనిని బట్టి చూస్తే, తీవ్రమైన ఎల్ నినోలు ఎక్కువ కాలం నిలబడలేవని స్పష్టమవుతోంది.
భారత వాతావరణ శాఖ (IMD)కి చెందిన ఒక ఉన్నతాధికారి తెలిపిన వివరాల ప్రకారం.. సాధారణంగా బలమైన ఎల్ నినోలు రుతుపవనాలకు ముందే బలహీనపడి, తటస్థ (Neutral) లేదా వర్షాలను ఇచ్చే లా నినా పరిస్థితులకు దారితీస్తాయి. ప్రస్తుతం పశ్చిమ పసిఫిక్ మహాసముద్ర ఉపరితలంలో శీతలీకరణ సంకేతాలు (సముద్రం చల్లబడటం) కనిపిస్తున్నాయని, ఇవి వాతావరణంలో రాబోయే సానుకూల మార్పును సూచిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ, ఇంత ముందే చెప్పే దీర్ఘకాలిక అంచనాలలో ఎప్పుడూ కొంత అనిశ్చితి (మార్పులు) ఉంటుందని ఆయన హెచ్చరించారు.
కరువులు గ్యారెంటీ కాదు!
బలమైన ఎల్ నినో ఏర్పడినంత మాత్రాన భారత రుతుపవనాలు స్వయంచాలకంగా (ఆటోమేటిక్‌గా) బలహీనపడిపోతాయనే వాదనలో నిజం లేదని నిపుణులు తేల్చిచెప్పారు. ప్రముఖ ప్రైవేట్ వాతావరణ సంస్థ 'స్కైమెట్' వైస్ ప్రెసిడెంట్ జి.పి. శర్మ దీనిపై స్పందిస్తూ.. "గతంలో అత్యంత బలమైన ఎల్ నినో నమోదైన సంవత్సరాలలో భారతదేశంలో కరువులు వచ్చిన దాఖలాలు ఉన్నాయి, అదే సమయంలో సాధారణ వర్షపాతం నమోదైన సందర్భాలూ ఉన్నాయి. కాబట్టి ఇది ఎప్పుడూ మిశ్రమ ఫలితాలనే ఇచ్చింది" అని స్పష్టం చేశారు. భారతదేశంలో కురిసే వర్షపాతాన్ని కేవలం ఎల్ నినో ఒక్కటే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉండే అనేక ఇతర సంక్లిష్ట వాతావరణ కారకాలు ప్రభావితం చేస్తాయని ఆయన వివరించారు. కాబట్టి 2027 వర్షాలపై ఇప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.














Click it and Unblock the Notifications