బాల్ థాక్రేకు బలమైన సైనికులం, మోసం చేయం: ఏక్‌నాథ్ షిండే ట్వీట్, ‘శివసేన’ డిలీట్
ముంబై: మహారాష్ట్రలో మరోసారి రాజకీయ ప్రతిష్టంభన చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్ షిండే, ఆయన అనుచరులు అజ్ఞాతంలోకి వెళ్లడంతో రాజకీయ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. శివసేన ఇప్పటికే షిండేపై చర్యలు తీసుకోగా.. తాజాగా ఆయన చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.
'మేం బాలా సాహెబ్‌కు చెందిన బలమైన సైనికులం. ఆయన మాకు హిందుత్వను నేర్పించారు. బాలాసాహేబ్, ఆనంద్ దిఘే బోధనలను పాటిస్తోన్న మేం అధికారం కోసం ఎన్నటికీ మోసానికి పాల్పడం' అంటూ ఏక్‌నాథ్ షిండే చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ ట్వీట్ చేసిన గంట సేపటికే ట్విట్టర్ బయోలో శివసేన అనే పదాన్ని తొలగించారు షిండే.

తన అనుచర ఎమ్మెల్యేలతో కలిసి సొంత ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగరవేసేందుకు సిద్ధమైన షిండేపై శివసేన వేటు వేసింది. రాష్ట్ర అసెంబ్లీ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఆయన్ను తొలగించింది. ఆ స్థానంలో అజయ్ చౌధరీని నియమించింది. ప్రస్తుతం షిండే తన అనుచరులతో కలిసి గుజరాత్‌లోని సూరత్ హోటల్‌లో ఉన్నారు. ఆయనతోపాటు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, వారంతా బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లేదంటే కొత్త పార్టీ పెట్టే అవకాశాలు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
కాగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నిర్వహించిన సమావేశానికి కొంతమంది శివసేన ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. వీరు కూడా షిండేతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అయితే, ఈ వార్తలను శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కొట్టిపారేశారు. 'శివసేన.. విధేయుల పార్టీ. బీజేపీ చేసే ప్రయత్నాలేవీ ఫలించవు. షిండే నమ్మకస్తుడైన శివసైనికుడు. మిస్సింగ్ ఎమ్మెల్యేలను సంప్రదిస్తే వారు తిరిగి వస్తారు' అని పేర్కొన్నారు రౌత్.
కాగా, థానేలో ముఖ్య నేతగా ఉన్న షిండే.. మహా వికాస్ అఘాడీ సంకీర్ణ ప్రభుత్వం తీరుతో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పుడేం జరుగుతుందనేది మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications