కిడ్నాప్: కదులుతున్న కారులో మహిళపై గ్యాంగ్‌రేప్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. కదులుతున్న కారులో ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పు ఆనంద్ విహార్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంతో ఆహార పదార్థాలు తెచ్చుకునేందుకు షాపింగ్ మాల్‌కు వెళ్లిన బాధితురాలిని నలుగురు దుండగులు బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు.
అనంతరం ఆమెను కదులుతున్న కారులోనే సామూహిక అత్యాచారం చేశారు. ప్రతిఘటించేందుకు ప్రయత్నించిన ఆమెపై దాడి చేశారు. తర్వాత ఆమెను మధు విహార్ లోని కడ్కీ మోడ్ ప్రాంతంలో వదిలేసి పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, నిందితులు, వారు ఉపయోగించిన కారును గుర్తించామని పోలీసులు తెలిపారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని చెప్పారు.

జర్మనీ యువతిపై అత్యాచారం
తాను బస చేస్తున్న హోటల్ అడ్రస్ మరిచిపోయి సాయం కోరిన ఓ జర్మనీ యువతి(19)పై అత్యాచారానికి ఒడిగట్టడమే కాకుండా తన ముఠాతో కలిసి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడొక ఆటో డ్రైవర్. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రసాద్‌నగర్ ప్రాంతంలో రెండు నెలల క్రితం ఈ దురాగతం జరిగిందని శనివారం పోలీసులు పేర్కొన్నారు. అడ్రస్ చెబుతామని నమ్మించిన ఆటో డ్రైవర్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కాల్పుల కలకలం: ఇద్దరు మృతి
ఢిల్లీలోని బదర్‌పూర్ టోల్ ప్లాజా వద్ద ఆదివారం ఉదయం కాల్పుల ఘటన కలకలం రేపింది. ద్విచక్రవాహనంపై వచ్చిన గుర్తుతెలియని దుండుగులు టోల్ ప్లాజా సిబ్బందిపై కాల్పులు జరిపి నగదుతో పరారయ్యారు. ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డు, క్యాషియర్‌లు మృతిచెందగా మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.












Click it and Unblock the Notifications