3 డోసుల వ్యాక్సిన్.. గంటల వ్యవధిలో ఇంజెక్ట్.. ఆ మహిళ..
వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. 100 రోజుల తర్వాత కరోనా కేసుల సంఖ్య 40 వేలకు దిగువన నమోదైంది. దేశంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ వ్యాక్సిన్లను పంపిణి చేస్తున్నారు. సోమవారం సాయంత్రానికి దేశంలోని 32.8 కోట్లమందికి మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. 5.5 కోట్ల మందికి సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తయింది.
వ్యాక్సినేషన్ ప్రక్రియలో పలు చోట్ల పొరపాట్లు జరుగుతున్నాయి. మొదటి డోస్, రెండవ డోస్ టీకా మార్చి వేయడం.. వ్యాక్సిన్ ఫీల్ చేయకుండానే ఖాళీ సిరంజి ఇంజెక్ట్ చేయడం.. ఒక సారి రెండు డోసులు ఇవ్వడం వంటి పొరపాట్లు జరుగుతున్నాయి. తాజాగా జరిగిన తప్పిదం చర్చనీయాంశంగా మారింది. ఓ మహిళకు గంటల వ్యవధిలో మూడు డోసుల వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది.

థానే మున్సిపాల్ కార్పొరేషన్‌లో పనిచేసే మహిళకు గంటల వ్యవధిలో మూడు డోసుల వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ విషయం ఆమె భర్తకు చెప్పడంతో సిబ్బంది నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. తన భార్య తొలిసారి వ్యాక్సిన్ వేసుకుంటున్నందున ఆమెకు వ్యాక్సిన్ ప్రక్రియ గురించి అవగాహన లేదని భర్త మీడియాకు తెలిపారు. సిబ్బంది గంటల వ్యవధిలో మూడు డోసులు ఇవ్వడంతో ఆమెకు జ్వరం వచ్చిందని తెలిపారు.
జ్వరం మరుసటి రోజు ఉదయం తగ్గిందని, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వివరించాడు. ఇక ఈ సమస్యను స్థానిక కార్పొరేటర్ వద్ద లేవనెత్తగా ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిమితంగానే ఉందని వైద్యులు తెలిపారు. వ్యాక్సినేషన్‌లో జరిగిన పొరపాటుకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.












Click it and Unblock the Notifications