మిత్రుల కారు రేస్ లేడీ టెక్కీ ప్రాణం తీసింది
పుణే : కార్ రేసింగ్ ఓ 25ఏళ్ల యువతి నిండు ప్రాణాన్ని బలిగొంది. ఓ స్నేహితుల గ్యాంగ్ సరదా కోసం రోడ్డుపై కార్ రేసింగ్ కి పాల్పడగా.. మితిమీరిన వేగంతో అదుపు తప్పిన కారు డివైడర్ ని ఢీ కొట్టి, పక్కనే ఉన్న రెస్టారెంట్ లోకి చొచ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కృతిక అక్కడిక్కడే మృతి చెందగా మిగతావారికి తీవ్ర గాయాలయ్యాయి.
శనివారం అర్థరాత్రి దాటాక కాట్రాజ్-దేహు బైపాస్ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి ఓ ఎనిమిది మంది స్నేహితుల బృందమంతా కలిసి దత్తానగర్ లో ఉన్న వంజరి రెసిడెన్సీలో పార్టీ చేసుకున్నారు. అర్థరాత్రి ఒంటిగంట సమయంలో పార్టీ ముగించుకుని అనంతరం 2.30 గంటల ప్రాంతంలో స్నేహితులంతా కలిసి రెండు కార్లలో లాంగ్ డ్రైవ్ కోసం లోనావ్ల వరకు వెళ్లిరావాలని బయలుదేరారు.

ఇదే క్రమంలో కాట్రాజ్-దేహు బై పాస్ రోడ్డు దగ్గరికి రెండు కార్లు చేరుకోగానే.. కార్ రేసింగ్ కి దిగాలని ఇరు కార్ల డ్రైవర్లు సరాదాగా పందెం పెట్టుకున్నారు. దీంతో రెండు కార్లు మితిమీరిన వేగంతో రోడ్డుపై రయ్యిమని దూసుకెళ్లాయి. ఈ క్రమంలో రెండు కార్లు ఒకదానికొకటి ఢీ కొనగా, అదుపు తప్పిన ఓ కారు డివైడర్ ని ఢీ కొట్టింది. భారతి విద్యాపీఠ్ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ జాదవ్ ఈ వివరాలను వెల్లడించారు.
ఘటనలో సన్నీ తపాసే, సుమిత్ వంజరి, ఆర్తి సోన్ వానే, సౌరభ్ షిండే, గణేశ్ గైక్వాడ్, చైతన్య జోషి, తుషార్ జాదవ్ గాయపడ్డారు. కృతిక మాత్రం అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఘటన జరిగిన సమయంలో కారు 100కి.మీ వేగంతో ప్రయాణిస్తున్నట్టు అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ జాదవ్ తెలిపారు.












Click it and Unblock the Notifications