అది మహిళా బిల్లు కాదు.. అధికార దాహం!: బీజేపీకి ప్రియాంక స్ట్రాంగ్ కౌంటర్!!
లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెనుదుమారం రేపుతోంది. ప్రతిపక్ష ఇండియా కూటమి మహిళా వ్యతిరేకం అంటూ బీజేపీ విమర్శలు గుప్పిస్తుండగా.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ దీనిపై గట్టిగా కౌంటర్ ఇచ్చారు. శనివారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. ప్రభుత్వం తెచ్చిన ఈ బిల్లు మహిళా రిజర్వేషన్ల కోసం కాదని, అది కేవలం నియోజకవర్గాల పునర్విభజన కోసమేనని సంచలన కామెంట్స్ చేశారు.
ప్రభుత్వ ఉద్దేశంపై ప్రియాంక ప్రశ్నలు
మహిళా రిజర్వేషన్ల పేరుతో ప్రభుత్వం దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. "ప్రభుత్వం ఇంత హడావిడిగా ప్రత్యేక సమావేశాలు ఎందుకు నిర్వహించిందో అందరికీ అర్థమవుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కేవలం అధికారం కోసమే ఈ బిల్లును తెరపైకి తెచ్చారు. మహిళల పేరుతో రాజకీయాలు చేయాలనుకుంటున్నారు కానీ.. మహిళలు అంత తెలివితక్కువ వారు కాదు" అని ప్రియాంక మండిపడ్డారు. మణిపూర్ ఘటన, ఉన్నావ్ కేసు, మహిళా రెజ్లర్ల పోరాటం సమయంలో లేని ప్రేమ ఇప్పుడు మహిళా రిజర్వేషన్లపై ఎందుకు పుట్టుకొచ్చిందని ఆమె ప్రశ్నించారు.

అది రిజర్వేషన్ బిల్లు కాదు.. పెద్ద కుట్ర!
ఈ బిల్లులో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం కంటే సీట్ల భౌగోళిక పరిస్థితులను మార్చే కుట్ర దాగి ఉందని ప్రియాంక గాంధీ విమర్శించారు. "మేము నిన్న పార్లమెంటులో ప్రభుత్వాన్ని ఓడించాం. ఈ బిల్లు పాస్ అయితే మహిళల ప్రభుత్వంగా చెప్పుకోవాలని.. పాస్ కాకపోతే ప్రతిపక్షాలను మహిళా వ్యతిరేకులుగా చిత్రీకరించాలని బీజేపీ ముందుగానే ప్లాన్ చేసింది. ప్రభుత్వం చేసిన ఈ కుట్రను మేము తిప్పికొట్టాం" అని ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. సీట్ల సంఖ్యను పెంచే వ్యూహంతో అధికారాన్ని కాపాడుకోవడమే ప్రభుత్వ అసలు లక్ష్యమని ఆమె దుయ్యబట్టారు.
కాంగ్రెస్ డిమాండ్ ఏంటి?
మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే.. 2023లో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన పాత బిల్లునే అమలు చేయాలని ప్రియాంక డిమాండ్ చేశారు. "2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే, 2023 బిల్లుకు చిన్నపాటి సవరణలు చేసి తీసుకురండి. మేము దానికి పూర్తి మద్దతు ఇస్తాం. సీట్లను పెంచడానికి మహిళా రిజర్వేషన్లకు ముడిపెట్టడం సరికాదు" అని ఆమె పేర్కొన్నారు. గతంలో యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ 'లడ్కీ హూ.. లడ్ శక్తి హూ' నినాదంతో 40 శాతం టిక్కెట్లు మహిళలకే ఇచ్చిందని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.
బీజేపీ ఆందోళనలు .. ప్రతిపక్షాల ఐక్యత
మరోవైపు బిల్లు వీగిపోవడంతో బీజేపీ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ప్రతిపక్ష పార్టీలు మహిళా బిల్లును అడ్డుకున్నాయని ఆరోపిస్తూ ఆందోళనలు చేస్తోంది. అయితే ఇది రాజ్యాంగానికి, ప్రతిపక్షాల ఐక్యతకు లభించిన విజయమని ప్రియాంక గాంధీ అభివర్ణించారు. అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం ఇవన్నీ చేస్తోందని, కానీ దేశ ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో మహిళలే ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని ప్రియాంక గాంధీ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications