త్వరలోనే ఒలింపిక్స్‌లోకి యోగా? ప్రధాని సంచలన వ్యాఖ్యలు!
భారతీయ సాంప్రదాయ వారసత్వమైన యోగా, క్రీడా ప్రపంచంలో ఒక చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. గుజరాత్‌లోని చారిత్రాత్మక నగరం అహ్మదాబాద్ వేదికగా తొలి 'ప్రపంచ యోగాసన ఛాంపియన్‌షిప్' శుక్రవారం (జూన్ 5) అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ఈ విశ్వ క్రీడలను లాంఛనంగా ప్రారంభించారు. క్రీడా ప్రపంచ చరిత్రలోనే ఇది ఒక సువర్ణ అధ్యాయమని, అహ్మదాబాద్ వేదికగా యోగాసనాలకు సరికొత్త దిశ లభించిందని ప్రధాని ఆకాంక్షించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన అహ్మదాబాద్ నగరంలో ఈ ప్రతిష్టాత్మక వేడుక జరగడం దేశానికే గర్వకారణమని పేర్కొంటూ, ప్రపంచవ్యాప్తంగా తరలివచ్చిన అథ్లెట్లకు ఆయన ఘన స్వాగతం పలికారు.
రాబోయే జూన్ 21న జరగనున్న 'అంతర్జాతీయ యోగా దినోత్సవం' కంటే ముందే ఈ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించడం ద్వారా ఆరోగ్యం, సంక్షేమాలకు ఒక అద్భుతమైన మేళవింపు లభించిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రధాన కార్యక్రమం కోల్‌కతాలో జరగనున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దాదాపు పదేళ్ల క్రితం ఐక్యరాజ్యసమితిలో 190 దేశాల రికార్డు స్థాయి మద్దతుతో భారత్ ప్రారంభించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రయాణాన్ని, మానవాళి సమగ్ర ఆరోగ్యానికి యోగాతో ఉన్న ముడిని ప్రధాని ఈ సందర్భంగా వివరించారు.

ఒలింపిక్స్‌లో యోగాసనాలకు చోటు దక్కేలా..
ప్రపంచవ్యాప్తంగా యోగాకు ఆదరణ పెరగడం పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. కోట్లాది మంది ప్రజలు తమ దైనందిన జీవితంలో ధ్యానం, ప్రాణాయామాలను భాగం చేసుకోవడం శుభపరిణామన్నారు. యోగాసనాలను కేవలం ఒక సాధనగానే కాకుండా, ఒక పోటీ క్రీడగా (Competitive Sport) తీర్చిదిద్దడంలో ఈ ఛాంపియన్‌షిప్ కీలక పాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. "ఈ ఛాంపియన్‌షిప్ ద్వారా యోగాసనానికి అంతర్జాతీయ క్రీడగా గుర్తింపు లభిస్తుంది. భవిష్యత్తులో ఒలింపిక్స్ వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రీడా వేదికలపై కూడా యోగాసనం చోటు దక్కించుకుంటుందనే నమ్మకం నాకుంది" అని మోదీ స్పష్టం చేశారు.
ఉపాధి అవకాశాలు.. 'యోగా ఫర్ హెల్తీ ఏజింగ్'
యోగా ఒక క్రీడగా విస్తరిస్తున్న తరుణంలో, కేవలం అథ్లెట్లకే కాకుండా కోచ్‌లు (శిక్షకులు), క్రీడా శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ వంటి విభిన్న రంగాలలో యువతకు సరికొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రధాని విశ్లేషించారు. ఈ ఏడాది 'యోగా ఫర్ హెల్తీ ఏజింగ్' (ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా) అనే ప్రత్యేక ఇతివృత్తంతో (Theme) ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోందని పేర్కొన్నారు. దూరదృష్టితో, నిత్యం ఆరోగ్యంగా ఉండాలనుకునే వారికి యోగా ఒక అమూల్యమైన మార్గమని, నిత్యం యోగా సాధన చేసేవారికి అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆయన స్పష్టం చేశారు.
'యోగా 365'కు పిలుపు.. క్రీడాకారులే రాయబారులు
కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'యోగా 365' ప్రచారాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న క్రీడాకారులందరూ యోగాకు గ్లోబల్ అంబాసిడర్లుగా మారి, తమ దేశాలకు తిరిగి వెళ్ళిన తర్వాత యోగా సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. పాల్గొన్న అథ్లెట్ల క్రమశిక్షణ, అంకితభావం, ప్రతిభ నేటి యువతకు ఎంతో ఆదర్శమని కొనియాడారు. అనంతరం, "మొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్‌షిప్ 2026, అహ్మదాబాద్‌ను ప్రారంభించినట్లు ప్రకటిస్తున్నాను" అంటూ ప్రధాని మోదీ ఈ చారిత్రాత్మక క్రీడలను అధికారికంగా ప్రారంభించారు.














Click it and Unblock the Notifications