చైనా, టర్కీలపై ఈ రకంగా పగ తీర్చుకున్న భారత్..!!
China and Turkey: పొరుగుదేశం చైనాతో సుదీర్ఘకాలంగా సరిహద్దు గొడవలను ఎదుర్కొంటోంది భారత్. లఢక్ మొదలుకుని.. అరుణాచల్ ప్రదేశ్ వరకూ తరచూ సరిహద్దులను దాటుకుని భారత భూభాగంపైకి చొచ్చుకుని వస్తోన్నారా దేశ సైనికులు. ఫలితంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటోన్నాయి.
అటు టర్కీ కూడా తక్కువేమీ తినలేదు. భారత్ కు వ్యతిరేకంగా చాప కింద నీరులా విస్తరిస్తూ వస్తోంది. మొన్నటికి మొన్న పాకిస్తాన్ కు బాహటంగా మద్దతు ఇచ్చింది. భారత్ పై దాడులు సాగించడానికి డ్రోన్ సహాయాన్నీ అందించింది టర్కీ. పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత సంభవించిన పరిణామాల్లో పాక్ వైపు నిలిచింది.

భారత్ కు వ్యతిరేకంగా తమ దేశ ప్రజలను ఎగదోస్తోన్నాయి కొన్ని మీడియా సంస్థలు. భారత్ కు వ్యతిరేకంగా విస్తృతంగా కథనాలను ప్రచురిస్తోన్నాయి. అంతంత మాత్రంగానే కొనసాగుతూ వస్తోన్న సత్సంబంధాలు మరింత దెబ్బతినేలా కథనాలను వండివార్చుతున్నాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఈ నేపథ్యంలో- ఈ రెండు దేశాలకు చెందిన ప్రధాన మీడియా సంస్థలపై వేటు వేయడానికి కేంద్ర ప్రభుత్వం తెర తీసింది. చైనాకు చెందిన అధికారిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ న్యూస్, టర్కీలోని టీఆర్టీ వరల్డ్ ఎక్స్ అకౌంట్లను విత్ హెల్డ్ లో ఉంచింది. వాటిని నిషేధించింది.
ఎక్స్ లోకి వెళ్లి గ్లోబల్ టైమ్స్ న్యూస్ లేదా టీఆర్టీ వరల్డ్ అని టైప్ చేస్తే.. అవి ఓపెన్ కావట్లేదు. అకౌంట్ విత్ హెల్డ్ ఇన్ ఇండియా అనే అక్షరాలు కనిపిస్తోన్నాయి. ఎక్స్ గైడ్ లైన్స్, కోర్టు ఉత్తర్వులు.. వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదే తరహా ఇబ్బందిని రాయటర్స్ కూడా ఎదుర్కొన్నప్పటికీ- ఆ తరువాత దీన్ని పరిష్కరించుకుంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతానికి రాయటర్స్ ఎక్స్ అకౌంట్ భారత్ లో అందుబాటులో ఉంటోంది. రాయటర్స్ టెక్ న్యూస్, రాయటర్స్ ఫ్యాక్ట్ చెక్, రాయటర్స్ పిక్చర్స్, రాయటర్స్ ఆసియా, రాయటర్స్ చైనా వంటి ఇతర ఎక్స్ అకౌంట్స్ ప్రస్తుతం పని చేస్తోన్నాయి.












Click it and Unblock the Notifications