యాసిన్ ఫ్యామిలీని ఢిల్లీ హోటల్ నుంచి నెట్టేశారు
శ్రీనగర్: జమ్మూ-కాశ్మీర్ వేర్పాటువాద గ్రూప్ లిబరేషన్ ఫ్రంట్ (జెకెఎల్ఎఫ్) ఛైర్మన్ యాసిన్ మాలిక్‌కు చేదు అనుభవం ఎదురైంది. తమ నాయకుడు మహ్మద్ యాసిన్ మాలిక్ ఢిల్లీకి వెళ్లిన సమయంలో అక్కడ అతను బుక్ చేసుకున్న హోటల్ నుంచి అతన్ని, అతని కుటుంబ సభ్యులను బలవంతంగా హోటల్ యాజమాన్యం ఖాళీ చేయించిందని, అందువల్ల అతనితోపాటు అతని కుటుంబ సభ్యులు కొన్ని గంటలపాటు రోడ్డు మీదనే వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని జమ్మూ-కాశ్మీర్ వేర్పాటువాద గ్రూప్ లిబరేషన్ ఫ్రంట్ (జెకెఎల్ఎఫ్) సోమవారం ఆరోపించింది.
మాలిక్ కుటుంబ సభ్యులతోపాటు అతని 18 నెలల కూతురుతో ఆదివారం ఢిల్లీ వెళ్లినట్లు జెకెఎల్ఎఫ్ పేర్కొంది. ఆయన ఢిల్లీలోని నిజాముద్దీన్ హోటల్‌లో రెండు గదులు బుక్ చేసుకున్నట్లు తెలిపింది. అయితే హోటల్ యాజమాన్యం అర్ధరాత్రి సమయంలో తమ నాయకుడ్ని, అతని కుటుంబ సభ్యులతోపాటు ఖాలీ చేయించిందని జెకెఎల్ఎఫ్ ఆరోపించింది.

మాలిక్, అతని కుటుంబ సభ్యులు చాలాసేపు రోడ్డుపైనే వేచి చూశారని, ఆ తర్వాత అతని స్నేహితుని ఇంటికి వెళ్లారని జెకెఎల్ఎఫ్ తెలిపింది. ఒకవేళ తమ నేత రావడం వల్ల ఢిల్లీ నగరం కలత చెందినట్లయితే..కాశ్మీర్ ప్రజలు దేశ రాజధానికి రాకుండా ఏదైనా చట్టం చేయాల్సిన అవసరం ఉందని జెకెఎల్ఎఫ్ పేర్కొంది.
కేవలం రాజకీయ భావజాలం కలిగి ఉన్నందువల్లే తమ నాయకుడ్ని ఆ హోటల్ యాజమాన్యం అతని కుటుంబ సభ్యులతో సహా ఖాళీ చేయించిందని, ఇలాంటి ఘటన ఏ స్థాయిలో కూడా న్యాయబద్దం కాదని జెకెఎల్ఎఫ్ తెలిపింది.












Click it and Unblock the Notifications