అయోధ్య రామ్ లల్లాకు 155 దేశాల నీటితో యోగీ జలాభిషేకం-జాబితాలో చైనా, పాకిస్తాన్..
యూపీలోని అయోధ్యలో రామమందిరం శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటోంది. వచ్చే ఏడాది జనవరి 1న రామమందిరం ప్రారంభించేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే దీనిపై హోంమంత్రి అమిత్ షా సైతం కీలక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో అంతకుముందే అయోధ్యలోని రామ్ లల్లాకు భారీ స్ధాయిలో జలాభిషేకం చేసేందుకు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ సిద్ధమవుతున్నారు.
ఏప్రిల్ 23న అయోధ్య రామ్ లల్లాకు 155 దేశాల నీటితో జలాభిషేకం నిర్వహించాలని యోగీ ఆదిత్యనాథ్ నిర్ణయించారు. చైనా,పాకిస్తాన్, కెనడా, రష్యా, టిబెట్, కజకిస్దాన్, ఉక్రెయిన్ వంటి దేశాలు ఇందులో ఉన్నాయి. పాకిస్తాన్ లోని రావి నది నుంచి నీటిని ఇందుకోసం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.

రావి నది నీటిని పాకిస్తాన్ నుంచి దుబాయ్ కు పంపి అక్కడి నుంచి భారత్ కు తీసుకురానున్నారు. కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కలిసి యోగీ ఆదిత్యనాథ్ జల్ కలశ్ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని అయోధ్య ట్రస్ట్ వర్గాలు వెల్లడించాయి.
ప్రధాని మోడీ, యోగీ ఆదిత్యనాథ్ మార్గదర్శకత్వంలో అయోధ్య రామమందిరం పనులు వేగంగా సాగుతున్నట్లు ట్రస్ట్ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది జనవరిలోనే 60 శాతం పనులు పూర్తయినట్లు ట్రస్ట్ తెలిపింది. ఈ పనులతో పాటు అనుబంధంగా చేపట్టాల్సిన ఇతర కార్యక్రమాల్ని కూడా యోగీ సర్కార్ వేగవంతం చేస్తోంది. ఈ క్రమంలోనే రామ్ లల్లాలో జలాభిషేకం చేపట్టబోతున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications