Yogi Adityanath : యూపీలో కుల గణనపై యోగీ రియాక్షన్ ఇదే..దేశవ్యాప్త డిమాండ్ల వేళ..
దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ లో కుల గణన చేపట్టాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా బీసీ రాజకీయాలు నడుపుతున్న పార్టీల నుంచి ఈ డిమాండ్లు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో యోగీ సర్కార్ పై ఒత్తిడి పెరుగుతోంది. ఇన్నాళ్లు బీసీల అండతో రాజకీయాలు చేసిన బీజేపీకి ఈ పరిణామాలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. దీంతో సీఎం యోగీ ఆదిత్యనాథ్ బీసీ జనగణన డిమాండ్లపై స్పందించారు.
విపక్ష పార్టీలు కోరుతున్న విధంగా యూపీలో కులాల వారీగా జనగణన చేపట్టే ఆలోచనేదీ తమ ప్రభుత్వానికి లేదని సీఎం యోగీ ఆదిత్యనాథ్ తేల్చిచెప్పేశారు. యూపీ అసెంబ్లీలో విపక్ష సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే అడిగిన ఓ ప్రశ్నకు యోగీ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఇందులో ఆయన.. కులాలవారీగా జన గణన వ్యవహారం కేంద్రం చేతుల్లోనే ఉందని చెప్పేశారు. దీంతో తమ ప్రభుత్వానికి ఈ కార్యక్రమం చేపట్టే ఆలోచన లేదని స్పష్టం చేశారు.

భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్‌లోని యూనియన్ జాబితాలో జనాభా గణన అంశం 69వ స్థానంలో పేర్కొన్నారని, జనాభా గణన చట్టం 1948, సెన్సస్ రూల్స్ 1990 లను భారత ప్రభుత్వం జనాభా గణన కోసం రూపొందించిందని యోగీ ఆదిత్యనాథ్ తన సమాధానంలో తెలిపారు. దీని కింద జనాభా గణన పని భారత ప్రభుత్వంచే చేయబడుతుందన్నారు. రాష్ట్రంలో కుల గణనను డిమాండ్ చేస్తున్న సమాజ్‌వాదీ పార్టీ 2022 అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చింది.
2024 లోక్‌సభ ఎన్నికల కోసం సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల ప్రణాళికలో కూడా ఈ అంశం ఉంది. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా గతంలో ఈ అంశాన్ని శాసనసభలో లేవనెత్తారు. బీహార్‌లో కొనసాగుతున్న కులాల సర్వేకు చట్టపరమైన హోదా కల్పిస్తూ ఇటీవల పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ఈ డిమాండ్ ఊపందుకుంది. పాట్నా హైకోర్టు బీహార్‌లో కుల సర్వేను పూర్తిగా చెల్లుతుందని సమర్ధించింది. ఉత్తరప్రదేశ్‌లో కుల గణన ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి ఉందని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి కూడా అన్నారు.












Click it and Unblock the Notifications