వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యోగి ఆదిత్యనాథ్: విద్యార్థి నాయకుడి నుంచి 'ముఖ్యమంత్రీ మహారాజ్' వరకు సాగిన ప్రయాణం

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ జీ మహారాజ్ అని పిలిపించుకోవడం యోగి ఆదిత్యానాథ్‌కు ఇష్టం
Click here to see the BBC interactive

''ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ జీ మహారాజ్'' అని పిలిపించుకోవడం ఆయనకు ఇష్టం. యోగి ఆదిత్యనాథ్ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి వచ్చే ప్రతీ ట్వీట్‌లో ఆయన పేరును ఇలాగే రాస్తారు.

అధికారిక ట్విట్టర్ ఖాతా బయోలో.... ''ముఖ్యమంత్రి (ఉత్తరప్రదేశ్‌); గోరక్షపీఠాధీశ్వర్, శ్రీ గోరక్షపీఠం; ఉత్తరప్రదేశ్‌ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులు; గోరఖ్‌పూర్ మాజీ ఎంపీ (లోక్‌సభ-వరుసగా 5 సార్లు) ఉత్తరప్రదేశ్‌'’ అని రాసి ఉంటుంది.

ఒక ప్రజాప్రతినిధి రాజ్యాంగ పదవిలో ఉంటూ, మతపరమైన ఒక పీఠానికి అధిపతిగా వ్యవహరించడమే కాకుండా, పాలనలో దాని నీడ స్పష్టంగా కనిపించేలా ప్రవర్తించడం భారతదేశ చరిత్రలో అరుదుగా కనిపిస్తుంది.

మహంత్ ఆదిత్యనాథ్ కాస్తా ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అవ్వగానే... రాజకీయ అధికారంతో పాటు మతపరమైన అధికారం కూడా ఆయన చేతుల్లోకి వచ్చింది. దీన్ని నిత్యం ప్రదర్శించుకోవడానికి ఆయన 'ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ జీ మహారాజ్' అనే పేరును ఎంచుకున్నారు.

ముఖ్యమంత్రి, మహారాజ్ అనే పేర్ల మిశ్రమం కేవలం పిలిపించుకునే పేరు మాత్రమే కాదు. కొంతమంది దృష్టిలో అది మత రాజకీయ ప్రయాణంలో బలం, బలహీనత కూడా.

అధికారుల నుంచి జర్నలిస్టులు, నేతలు అంతా ఆయన పాదాలను తాకేందుకు ప్రయత్నిస్తుంటారు

పాదాభివందనాల సంస్కృతి

2017లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యాక గోరఖ్‌పూర్ ప్రెస్ క్లబ్ ఆయనను ఆహ్వానించింది. ఆనాటి సమావేశం గురించి సీనియర్ జర్నలిస్టు మనోజ్‌సింగ్‌ గుర్తు చేసుకున్నారు.

''ముఖ్యమంత్రి మీటింగ్‌ హాల్‌లోకి రాగానే ఆ ప్రెస్ మీట్‌కు ఏర్పాట్లు చేసిన జర్నలిస్టులు మాట్లాడటం మానేసి ''అదిగో మా ముఖ్యమంత్రి వచ్చారు, మా దేవుడు వచ్చారు'' అనడం మొదలు పెట్టారు.

ఆ తర్వాత ముఖ్యమంత్రి వేదికపై కూర్చోవడంతో అక్కడ ఉన్న జర్నలిస్టులంతా ఒక్కొక్కరుగా వేదికపైకి వెళ్లి ఆయనకు స్వాగతం పలికి పాదాలకు నమస్కరించారు.

పెద్దల ఆశీస్సులు పొందడానికి పాదాలను తాకడం ఉత్తరప్రదేశ్‌లో సర్వసాధారణం. కానీ, ఆ సమయంలో వారంతా మహంత్ లేదా ముఖ్యమంత్రి పాదాలను ఆశీస్సులు పొందడానికో, గౌరవించడానికో మొక్కారని చెప్పడం కష్టం.

కాళ్లు మొక్కే జర్నలిస్టు జర్నలిజం ఎలా చేయగలరని మనోజ్ సింగ్ అంటారు.

హిందుత్వవాదాన్ని, గుర్తింపును యోగి ఎన్నడూ దాచుకోరు

ఎక్కడ చూసినా కాషాయమయం

యోగి ఆదిత్యనాథ్‌కు ఉన్న రెండు గుర్తింపులను వేరు చేయడం కూడా కష్టం. ఎందుకంటే ఆయన ఎప్పుడూ వాటిని తనతోనే ఉంచుకోవాలని అనుకుంటారు.

ప్రభుత్వ పత్రాలలో ఆయన పేరుతో మహంత్ లేదా మహారాజ్ అనే విశేషణాలు కనిపించవు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కాషాయ దుస్తులు ధరించడం ఆయన గుర్తింపుకు అద్దం పడతాయి.

లఖ్‌నవూకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ సిద్ధార్థ్ కలహన్స్ దీని గురించి వివరించారు.''ఆయన అధికారంలో ఉంటే, అధికారులు, కార్యకర్తలు ఆయనకు నచ్చినపనే చేస్తారు. ఆయన కుర్చీ వెనక తెల్లటి వస్త్రాలకు బదులుగా కాషాయ వస్త్రాలను వేలాడదీస్తారు. టాయిలెట్ ప్రారంభోత్సవానికి వెళ్లినా అక్కడి గోడలకు కాషాయం రంగులే వేస్తారు'' అని అన్నారు.

యోగి ఆదిత్యనాథ్ నెలలో కనీసం ఒకట్రెండుసార్లు గోరఖ్‌పూర్‌ని సందర్శిస్తారు. ఆలయంలో పూజలు, మతపరమైన సంప్రదాయాలు, పండుగలలో పాలుపంచుకుంటారు. అన్ని మతపరమైన కార్యకలాపాల ఫొటోలు ఆయన వ్యక్తిగత అకౌంట్స్‌తో సమానంగా అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో కూడా షేర్ అవుతాయి.

యోగి పాలనలో మతం ప్రతిచోటా స్థిరపడింది. పోలీస్ స్టేషన్లలో చిన్నచిన్న దేవాలయాలు నిర్మించారు. ప్రతి మంగళవారం, న్యాయవాదులు గోరఖ్‌పూర్ జిల్లా కోర్టులో హనుమాన్ చాలీసాను చదువుతారు.

ముఖ్యమంత్రి కావడానికి పదేళ్ల ముందు 2007 జనవరిలో, అప్పటి గోరఖ్‌పూర్ ఎంపీగా ఉన్న ఆదిత్యనాథ్ కర్ఫ్యూ సమయంలో ''మత భావాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారు'' అన్న ఆరోపణలపై అరెస్టయ్యారు.

''అప్పుడు కూడా ఆయన్ను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసు అధికారి ముందుగా వచ్చి ఆయన పాదాలకు నమస్కరించారు'' అని జర్నలిస్ట్ మనోజ్ సింగ్ చెప్పారు.

''ఆయన పట్ల కొందరికి విశ్వాసం ఏ స్థాయిలో ఉంటుందంటే, ఆయనను అరెస్టు చేసినట్లు తెలియడంతో గోరఖ్‌నాథ్ ఆలయంలో ఉన్న ఓ గోవు కన్నీరు పెట్టిందని ఒక ప్రధాన హిందీ వార్తాపత్రికలో రాశారు'' అని వివరించారు మనోజ్ సింగ్.

మతపరమైన ఆధిపత్య భావాలు, రాడికల్ హిందుత్వ రాజకీయాలు యోగి ఆదిత్యనాథ్‌ పరిపాలనలో స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఓసారి ఆ రాష్ట్ర డీజీపీ ప్రభుత్వ హెలికాప్టర్‌ ద్వారా శివభక్తులపై పూల వర్షం కురిపించారు.

యాంటీ రోమియో స్క్వాడ్, అక్రమ కబేళాలకు తాళం వేయడం, వివాహం కోసం మత మార్పిడి చట్టాలు, ఆయన ప్రసంగాలు, ప్రకటనలు అన్నీ మతం, అధికారంతో కలగలిసి ఉంటాయి.

2020లో ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌ ఉపఎన్నికల సభలో మాట్లాడుతూ ''లవ్‌ జిహాద్‌కు పాల్పడే వారు మారకపోతే రామ్‌నామ్‌ సత్య హై కార్యక్రమం మొదలవుతుంది'' అని హెచ్చరించారు.

ఆయన పాలనలో మతాంతర వివాహాల వ్యతిరేకత తీవ్రంగా మారింది. దానికి 'లవ్-జిహాద్' అనే పేరు పెట్టారు.

సీఏఏ నిరసనలను కఠినంగా అణచివేసే ప్రయత్నం చేశారు యోగి

వ్యతిరేకతపై అణచివేత

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా ఆందోళన జరిగినప్పుడు యోగి ప్రభుత్వం కొంతమంది నిరసనకారులను 'ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించినందుకు' దోషులుగా గుర్తించి వారి పేర్లు, చిరునామాలు, ఫొటోలను లఖ్‌నవూలో పోస్టర్ల రూపంలో వేయించింది. వారిలో మానవ హక్కుల కార్యకర్తలు, రిటైర్డ్ సీనియర్ అధికారులే ఎక్కువగా ఉన్నారు.

ఇది వ్యక్తిగత గోప్యతకు భంగమని, వీటిని వెంటనే తొలగించాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించిన తర్వాత కూడా పోస్టర్లను అంటించారు.

మోదీ, అమిత్ షాల తర్వాత దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో బీజేపీకి ప్రచారం చేసిన ఏకైక నాయకుడు యోగి ఆదిత్యనాథ్. ఆయన కేరళకు వెళ్లి యూపీ తరహా పాలన తెచ్చుకోవాలని అక్కడి ప్రజలకు సూచించారు.

2019 సంవత్సరంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో, అంతకు ముందు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన "కమల్‌నాథ్ జీ... మీకు అలీ అనే మాట ముఖ్యమైనది కావచ్చు, కానీ మాకు మాత్రం బజరంగ్ బలి సర్వస్వం'' అని అన్నారు.

2018 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ శాసనసభలో ''నేను హిందువును, ఈద్ జరుపుకోను. అలా జరుపుకోకపోవడం పట్ల నేను గర్విస్తున్నాను'' అని వ్యాఖ్యానించారు.

యోగి ఆదిత్యనాథ్ పాలనా కాలంలో గతంలో ఎన్నడూ లేనంతగా కాషాయీకరణ జరిగిందని ''షేడ్స్ ఆఫ్ శాఫ్రాన్: ఫ్రమ్ వాజ్‌పేయి టు మోదీ'' అన్న పుస్తకం రాసిన సబా నఖ్వీ అన్నారు.

''హిందుత్వ నిర్వచనాన్ని ఆయన ముస్లింలపై విద్వేషంగా మార్చారు. మధ్యప్రదేశ్ వంటి ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా తమ భాష, విధానాలు అదే విధంగా మార్చుకోవడాన్నిబట్టి ఇది చాలా ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు రుజువైంది'' అని సబా అన్నారు.

ఉత్తరప్రదేశ్‌లో మత మార్పిడికి వ్యతిరేకంగా చట్టం తీసుకొచ్చిన తర్వాత, 5 బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అదే తరహాలో చట్టాలను తీసుకువచ్చాయి.

''హిందువులు పోలరైజ్ కావడం వల్ల కలిగే ప్రయోజనాలపై ఆయనకు స్పష్టత ఉంది. ఆ ఆలోచన ఆయనలో పాతుకుపోయింది. యూపీలో అప్పటికే మతతత్వం విజృంభిస్తోంది. ఇప్పుడు ఆయనకు ఒక విజన్ ఉంది. దాన్ని బయటపెట్టడం ప్రారంభించారు'' అన్నారు సబానఖ్వీ.

ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయంగా ఉత్తముడైన నాయకుడిని ప్రజలు కోరుకోవడం లేదని జర్నలిస్ట్ విజయ్ త్రివేది అన్నారు.

''యోగి ఆదిత్యనాథ్ లక్ష్యం మైనార్టీలలో భయాన్ని సృష్టించడం కాదు. హిందువులలో భయాన్ని సృష్టించడం ద్వారా వారిని తనకు అనుకూలంగా సమీకరిస్తున్నారు. విధ్వంసక సమస్యలకే తప్ప నిర్మాణాత్మక ప్రయోజనాల కోసం పని చేయడానికి ప్రజలు ముందుకు రావడంలేదు. బాబ్రీ మసీదు ఘటన ఇందుకు మంచి ఉదాహరణ'' అన్నారు త్రివేది.

రాజకీయాలను, మతాన్ని విడదీయలేని బంధంగా మార్చారని యోగి విమర్శకులు అంటుంటారు

విద్యార్థి సంఘం నుంచి దేవాలయం మీదుగా రాజకీయాలు

యోగి ఆదిత్యనాథ్ జీవిత చరిత్రను 'యదా యదా హి యోగి' పేరుతో రాసిన విజయ్ త్రివేది తెలిపిన వివరాల ప్రకారం, యోగి ఆదిత్యనాథ్ 1972లో గర్వాల్‌లోని ఓ గ్రామంలో జన్మించారు. ఆయన అసలు పేరు అజయ్ మోహన్ బిష్త్. మొదటి నుంచి ఆయనకు రాజకీయాలంటే ఆసక్తి.

ప్రస్తుత ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని హేమవతి నందన్ బహుగుణ యూనివర్సిటీ నుంచి అజయ్ బిష్త్ బీఎస్సీ చేశారు.

కాలేజీ రోజుల్లో ఆధునిక డ్రెస్సులు, నల్ల కళ్ల జోళ్లు ధరించడానికి యోగి ఇష్టపడేవారని ఆయన జీవిత చరిత్ర పుస్తకంలో విజయ్ త్రివేది పేర్కొన్నారు. 1994లో దీక్ష తీసుకున్న తర్వాత అజయ్ బిష్త్ కాస్తా ఆదిత్యనాథ్ యోగి అయ్యారు.

చిన్నతనం నుంచి ఆరెస్సెస్ శాఖలకు వెళ్లిన ఆయన కాలేజీ రోజుల్లో విద్యార్థి సంఘం ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు. అయితే, ఆరెస్సెస్ అనుబంధ విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో స్వతంత్రంగా పోటీ చేసి ఓడిపోయారు.

''ఓడిపోయిన కొన్ని నెలల తర్వాత అంటే జనవరి 1992లో బిష్త్ గదిలో చోరీ జరిగిందని, అందులో ఎంఎస్సీలో ప్రవేశానికి అవసరమైన అనేక పత్రాలు మాయమయ్యాయని విజయ్ త్రివేది రాశారు. అడ్మిషన్‌కు సంబంధించి సహాయం కోసం బిష్త్ మొదటిసారి మహంత్ వైద్యనాథ్‌ను కలిశారు. ఆ తర్వాత రెండేళ్లలోనే ఆయన యోగిగా మారడమే కాక, మహంత్ వైద్యనాథ్‌కు వారసుడు కూడా అయ్యారు.

దీక్షతో పేరు మారడమే కాదు, పూర్వ ప్రపంచంతో బంధాలు కూడా తెగిపోయాయి. 2020 సంవత్సరంలో, ఆయన తండ్రి ఆనంద్ బిష్త్ అనారోగ్యంతో మరణించినప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్న ఆదిత్యనాథ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ''కరోనా మహమ్మారిని ఓడించే వ్యూహంలో భాగంగా లాక్‌డౌన్ విజయవంతం చేసేందుకు నేను కృషి చేస్తున్నాను. ఆయన కర్మకాండలు మీరే నిర్వహించండి. నేను హాజరు కాలేను'' అని పేర్కొన్నారు.

దీక్ష తర్వాత ఆదిత్యనాథ్ యోగి తన అధికారిక పత్రాలలో తండ్రి పేరు స్థానంలో మహంత్ వైద్యనాథ్ పేరును రాయడం ప్రారంభించారు.

మహంత్ వైద్యనాథ్ అప్పట్లో రామ మందిర ఉద్యమంలో పని చేస్తున్నారు. ఆయన కూడా గోరఖ్‌పూర్ నుంచి నాలుగుసార్లు ఎంపీగా పని చేశారు.

గోరఖ్‌నాథ్ ఆలయానికి, అధికారానికి మధ్య ఉన్న బంధం ఇంకా పాతది. మహంత్ వైద్యనాథ్ కంటే ముందు మహంత్ దిగ్విజయ్‌నాథ్ దీనిని రాజకీయ కేంద్రంగా మార్చారు. ఆయన కూడా గోరఖ్‌పూర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.

ముఖ్యమంత్రి పీఠానికి గోరఖ్‌పూర్ మెట్లు

1994లో మహంత్ వైద్యనాథ్ నుంచి దీక్ష తీసుకున్న తర్వాత యోగి ఆదిత్యనాథ్‌గా గుర్తింపు పొందడంతో అజయ్ బిష్త్ రాజకీయ ప్రయాణం ప్రారంభమైంది. ఆ తర్వాత వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం దాదాపు ఖాయమైంది.

ఐదేళ్ల తర్వాత 26 ఏళ్ల వయసులో గోరఖ్‌పూర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 6 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.

''ఆ రోజుల్లోనే బీజేపీ నుంచే కాకుండా తనకు ప్రత్యేకమైన వర్గం కావాలని ఆయన కోరుకున్నారు. హిందూ యువ వాహినిని స్థాపించారు. పేరుకు అది సాంస్కృతిక సంస్థే అయినా, దానికంటూ ఒక ప్రత్యేక సైన్యం ఉంది'' అని జర్నలిస్ట్ మనోజ్ సింగ్ అన్నారు.

"హిందూ యువ వాహిని లక్ష్యం మతాన్ని రక్షించడం. మతపరమైన ఉద్రిక్తతలో ఈ సంస్థ జోక్యం చేసుకుంటుంది. ఈ సంస్థకు నాయకత్వం వహిస్తుండగా యోగి ఆదిత్యనాథ్ 2007లో అరెస్టయ్యారు'' అని ఆయన వివరించారు.

11 రోజులపాటు జైలులో ఉన్న ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. పదేళ్లుగా ఏ ప్రభుత్వ హయాంలోనూ ఈ కేసుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2017లో ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి కాగానే ఆయన ఆధ్వర్యంలోని హోంశాఖ ఈ కేసును విచారించడానికి సీబీసీఐడీకి అనుమతి ఇవ్వలేదు.

2014లో ఆదిత్యనాథ్ తన ఎన్నికల అఫిడవిట్‌లో తనపై అనేక కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.

రాజకీయ నాయకులపై 'రాజకీయ ప్రేరేపిత' కేసులను ఉపసంహరించుకునేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 2017లో చట్టానికి సవరణ చేసింది. దాని ప్రకారం ఏ కేసులను 'రాజకీయ ప్రేరేపితం'గా పరిగణించాలో నిర్ణయించే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది.

హిందూ యువ వాహినితో ఎంపీ ఆదిత్యనాథ్ బలం పుంజుకున్నారు. నాయకుడిగా ఆయన గుర్తింపు గోరఖ్‌పూర్ దాటి విస్తరించింది.

తూర్పు ఉత్తరప్రదేశ్‌లో తన హిందూ వాహిని నేతలకు టిక్కెట్లు కావాలని ఆయన తరచూ పట్టుబట్టేవారు. బీజేపీ అంగీకరించకపోతే, ఆయన తన పార్టీ(బీజేపీ) అభ్యర్థికి పోటీగా హిందూ వాహిని అభ్యర్థిని నిలబెట్టేవారు.

ముఖ్యమంత్రి అయ్యాక కూడా పార్టీ ముందు తన అభిప్రాయాన్ని చెప్పేందుకు ఆయన ఎప్పుడూ వెనుకంజ వేయలేదు. హిందుత్వ భావజాలం కారణంగా ఆయనకు పెరిగిన ప్రజాదరణే ఇందుకు కారణమని సబా నఖ్వీ అభిప్రాయపడ్డారు.

మోదీ-షాల ఆధ్వర్యంలోని బీజేపీలో ఏ నాయకుడూ ఎదురు మాట్లాడే పరిస్థితి ఉండదు. కానీ, ఆయన మాత్రం నిర్మొహమాటంగా తనకు కావాల్సింది అడిగేవారని నఖ్వీ అన్నారు.

''బీజేపీ నాయకత్వం చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులను సులువుగా తొలగించింది. కానీ, యూపీ సీఎంను మాత్రం తొలగించలేకపోయింది. ఎందుకంటే ఇంత ముఖ్యమైన రాష్ట్రంలో ఆయన స్థానాన్ని భర్తీ చేయగలవారు ఎవరు?'' అని సబా నఖ్వీ అన్నారు.

ముఖ్యమంత్రి కావడంతోపాటు ఎన్నో పెద్ద నిర్ణయాలు తీసుకోవడంతో ఆయన ఇమేజ్‌ పటిష్టమైన పరిపాలనాదక్షుడిగా మారిపోయింది.

''ఆయన హార్డ్‌టాస్క్ మాస్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆయన చెప్పినట్లు పని చేయాల్సి ఉంటుందని ఉద్యోగులు అర్థం చేసుకున్నారు'' అని సిద్ధార్థ్ కలహన్స్ అభిప్రాయపడ్డారు.

''కేవలం నిర్ణయాలు తీసుకోవడమే కాదు, తదుపరి సమావేశంలో దాని స్టేటస్ తెలుసుకుంటారు. పని జరగలేదని తెలిసినప్పుడు వారిపై చర్యలు తీసుకోవడం ఆయన స్టైల్'' అని విజయ్ త్రివేది అభిప్రాయపడ్డారు.

మోదీ వారసుడు యోగి అన్న ప్రచారం ఇటీవల జరిగింది

ప్రధాని మోదీ వారసుడా?

రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి పదవికి పోటీదారుగా పరిగణించేంత శక్తివంతమైన నాయకుడిగా యోగి మారారా?

అది నిజం కాదంటారు సబా నఖ్వీ. ''నాయకుడిగా మోదీ ముందు ఆదిత్యానాథ్ స్థానం చాలా చిన్నది. రాజకీయాలలో ముందుకు సాగడానికి ఏకాభిప్రాయం తీసుకోవడం, కార్పొరేట్ ప్రపంచంతో సంబంధాలు పెట్టుకోవడం వంటి ఉపాయాలు ఆయనకు తెలియవు'' అన్నారు సబా.

రాష్ట్రాన్ని నడిపించే బాధ్యతకంటే ముందే, ఆయన గోరఖ్‌నాథ్ ఆలయం ఆధ్వర్యంలో అనేక పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర సంస్థలకు నాయకత్వం వహించారు.

''ఆయనదంతా ఫ్యూడల్ వ్యవహారశైలి. అన్నీ ఆయన నియంత్రణలో ఉంటాయి. ప్రభుత్వాన్ని కూడా ఆయన అలాగే నడుపుతారు. ఎమ్మెల్యేలు కాదు, మంత్రులు కూడా తమ మనసులో మాటను ఆయనకు చెప్పే సాహసం చేయలేరు'' అని మనోజ్ సింగ్ అన్నారు.

మోదీ పాలనా విధానం నుంచి చాలా విషయాలు నేర్చుకోవడానికి యోగి ప్రయత్నించారని విజయ్ త్రివేది అభిప్రాయపడ్డారు.

''ప్రభుత్వ విధానాలను ప్రచారం చేయడం, ప్రభుత్వాన్ని ఒక్కడిగా నడపడం, మీడియాను నియంత్రించడం మొదలైనవి నేర్చుకున్నారు. కానీ ఆయన హిందుత్వను, అభివృద్ధిని కలిపి నడిపించాలనుకున్నారు. కానీ, అది వర్కవుట్ కాలేదు'' అని అన్నారాయన.

ఆయన మీడియాలో ఒక పెద్ద నెట్‌వర్క్‌ను సృష్టించారు. లఖ్‌నవూ, గోరఖ్‌పూర్‌లలో రెండు వేర్వేరు మీడియా టీమ్‌లు ఉంటాయి. వీటిలో ప్రభుత్వంతోపాటు బయటి ఏజెన్సీలు కూడా పని చేస్తుంటాయి.

ఆయనకు ముగ్గురు మీడియా సలహాదారులున్నారు. వీరు వార్తాపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాల కోసం ప్రత్యేక సందేశాలు సిద్ధం చేస్తుంటారు.

''మునుపెన్నడూ లేనంతగా పెద్ద పెద్ద ప్రకటనలు వెలువడుతున్నాయి. ఆయన విజయాల మీద అనేక డాక్యుమెంటరీలు ఛానెళ్లలో ప్రసారమవుతుంటాయి'' అని జర్నలిస్ట్ సిద్ధార్ధ్ కలహన్స్ అన్నారు.

ఉత్తర్ ప్రదేశ్‌ బీజేపీలో ఆయనకు సరితూగగల నాయకుడు లేడని విమర్శకులు సైతం అంటారు

యోగి ఆదిత్యనాథ్ వారసుడెవరు?

గత నాలుగున్నరేళ్లలో ఉత్తరప్రదేశ్‌ లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎలాంటి మార్పులు తీసుకువచ్చారు? గోరఖ్‌పూర్ ఎంపీగా యోగి ఆదిత్యనాథ్ ఐదు ప్రైవేట్ మెంబర్ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టారు.

వీటిలో యూనిఫాం సివిల్ కోడ్, అధికారికంగా దేశం పేరును 'ఇండియా' నుంచి 'భారత్'గా మార్చడం, గోహత్యపై నిషేధం, మత మార్పిడికి వ్యతిరేకంగా చట్టం, అలహాబాద్ హైకోర్టు గోరఖ్‌పూర్ బెంచ్ ఏర్పాటు వంటివి ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో గోహత్య నిరోధక చట్టాన్ని మరింత కఠినతరం చేసి మత మార్పిడిని నిషేధిస్తూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు.

''ఒక మహంత్ కూడా పాలించగలరని అసెంబ్లీలో, అతని విధానాలలో తన మత అభిప్రాయాలను వినిపించవచ్చని ఆయన పదవీ కాలంలో నిరూపితమైంది'' అన్నారు మనోజ్ సింగ్.

ఉత్తరప్రదేశ్‌ పోలీసులు శక్తిమంతంగా ఉంటారు. యోగి పదవీకాలంలో వారికి మరింత స్వేచ్ఛ దొరికింది. ప్రభుత్వం తన ప్రకటనలలో ఎన్‌కౌంటర్‌లను ఒక అచీవ్‌మెంట్‌గా పరిగణించేది. దీని ద్వారా యోగి ఆదిత్యనాథ్ కఠినమైన పరిపాలకుడు అన్న ఇమేజ్ వచ్చింది.

యోగి కాలంలో పాలనా విధానం బాగా మారిందని, న్యాయ వ్యవస్థ కఠినంగా మారిందని, అయితే అది ఒక సామాజిక వర్గానికి వ్యతిరేకంగా జరిగిందని విజయ్ త్రివేది అభిప్రాయపడ్డారు.

యోగి విధానాలు ఒక వర్గంలో ఆగ్రహాన్ని, మరో వర్గానికి ఆదరణను పెంచాయి. కానీ ప్రజాస్వామ్యంలో ఎన్నికల ఫలితాలే నిజమైన ప్రమాణం. 70 శాతం మంది 30 శాతం మంది ఎంపికను అంగీకరించాలి. మనకు నచ్చకపోతే మన వ్యవస్థ మారాలి'' అన్నారాయన.

రాష్ట్రంలో ప్రభుత్వ సందేశం చాలా ప్రభావవంతంగా వ్యాప్తి చెందుతోంది. ''జర్నలిస్టులు ఆయనకు వ్యతిరేకంగా రాయడానికి ప్రయత్నించినప్పుడు జైలులో పడటం సర్వసాధారణంగా మారింది'' అన్నారు సబా నఖ్వీ.

''రాష్ట్రంలో ప్రజల నిరసనలు ఇంతకు ముందులాగా కనిపించడం లేదు. పోలరైజేషన్ రాజకీయాలు నచ్చనివారు మౌనంగా ఉంటున్నారు'' అని సిద్ధార్థ్ కలహన్స్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Yogi Adityanath: The journey from student leader to 'Chief Minister Maharaj'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X