తొక్కిసలాటలో ఆయనే ఏ1
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కరూర్ తొక్కిసలాట ఘటనలో భారీగా అరెస్టులు చోటు చేసుకుంటోన్నాయి. ఈ ఘటనకు సంబంధించి యూట్యూబర్ కమ్ జర్నలిస్ట్ ఫెలిక్స్ గెరాల్డ్‌ను చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ఆయన చిత్రీకరించిన ప్రచురించిన వీడియోల నిమిత్తం విచారణ కోసం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించి నకిలీ వార్తలను ప్రచారం చేశారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.
రెడ్‌పిక్స్ యూట్యూబ్ ఛానెల్‌ను నడుపుతున్నారు గెరాల్డ్. గతంలో పలు దినపత్రికల్లో పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన నకిలీ కంటెంట్‌ను అప్‌లోడ్ చేశాడని పోలీసులు తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ నిర్వహించారు. పక్కా సాక్ష్యాధారాలు లభించడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో పోలీసులు మరిన్ని వివరాలను వెల్లడించాల్సి ఉంది.

కరూర్ తొక్కిసలాటకు సంబంధించి సోషల్ మీడియాలో రెచ్చగొట్టే కంటెంట్‌ను పోస్ట్ చేశారనే ఆరోపణలతో ఇప్పటికే 25 మందిపై సోమవారం చెన్నై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కంటెంట్ శాంతికి భంగం కలిగించే అవకాశం ఉందని, ఉద్రిక్తతలను పెంచవచ్చని అధికారులు పేర్కొన్నారు. అందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వారందరినీ కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని అన్నారు.
మరోవైపు తమిళనాడు వెట్రి కజగం జిల్లా కార్యదర్శి మతియళగన్‌ను కూడా సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. తొక్కిసలాటలో సంబంధించి నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో ఆయనను ఏ1గా చేర్చారు. ఆయనపై ఇంకా ఎలాంటి ఆరోపణలు ఉన్నాయనేది ఇంకా తెలియరావాల్సి ఉంది. ఎఫ్‌ఐఆర్‌లో ఇప్పటివరకు టీవీకే అధినేత విజయ్ పేరు లేదు.
ముగ్గురు పార్టీ కార్యవర్గ సభ్యుల పేర్లు ఇందులో ఉన్నాయి. కరూర్ జిల్లా కార్యదర్శి మతియళగన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బస్సీ ఎన్ ఆనంద్, సంయుక్త కార్యదర్శి సీటీఆర్ నిర్మల్ కుమార్ పేర్లు ఈ ఎఫ్ఐఆర్ లో పొందుపరిచారు పోలీసులు. వేళుసామిపురానికి చేరుకోవడానికి ముందు విజయ్ అనుమతుల్లేకుండా రోడ్‌షోలు నిర్వహించాడని, అక్కడ ఆయన కాన్వాయ్ భారీ జనసందోహం మధ్య చిక్కుకుపోవడం వల్లే ఆలస్యంగా వచ్చాడని ఎఫ్‌ఐఆర్ లో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications