న్యూయార్క్‌లో అర్ధరాత్రి కాల్పులు... ఇద్దరు మృతి,14 మందికి గాయాలు...
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. న్యూయార్క్‌లోని రోచెస్టర్‌లో ఉన్న పెన్సిల్వేనియా అవెన్యూలో శుక్రవారం(సెప్టెంబర్ 18) అర్ధరాత్రి జరిగిన ఓ పార్టీలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా మరో 14 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న రెండు ఆస్పత్రుల్లో చేర్చారు.
మృతుల్లో ఒకరిని 18-22ఏళ్ల వయసున్న యువతిగా మరొకరిని అదే వయసున్న యువకుడిగా పోలీసులు గుర్తించారు. గాయపడ్డవారిలో ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం లేదని పోలీస్ అధికారి సిమన్స్ తెలిపారు. పార్టీకి హాజరైనవారి నుంచి వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నామని... ఇప్పటికైతే కాల్పులకు గల కారణం,నిందితులకు సంబంధించిన వివరాలేవీ తెలియరాలేదని చెప్పారు. ఇప్పటివరకూ ఎవరినీ అదుపులోకి కూడా తీసుకోలేదని చెప్పారు.

Recommended Video
కాల్పుల సమాచారం అందినవెంటనే తాము సంఘటనా స్థలానికి చేరుకున్నామని... ఆ సమయంలో దాదాపు 100 మంది అక్కడినుంచి బయటకు పరుగుతీయడం చూశామని చెప్పారు. ఇంత భారీ ఎత్తున ఇక్కడ పార్టీ జరుగుతున్నా ఎవరి నుంచి తమకెలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. కోవిడ్ పరిస్థితుల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఇలా అక్రమంగా భారీ ఎత్తున పార్టీలు నిర్వహించడం సరికాదన్నారు. ఇలా పోకడలు ఏమాత్రం మంచివి కాదని అభిప్రాయపడ్డారు. కాల్పులపై ఇప్పటికైతే ఏ అంచనాకు రాలేకపోయామని... నిందితుల ఒకరా లేక ఎక్కువమంది ఉన్నారా అన్నది ఇప్పుడే చెప్పలేమని అన్నారు.












Click it and Unblock the Notifications