Tamil Nadu Polls: మహిళల్నీ, దక్షిణాదినీ ముంచిన డీఎంకే-చంద్రబాబు ఫైర్..!
తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు (Chandrababu) అక్కడ పర్యటిస్తున్నారు. ఇవాళ కోయంబత్తూరు (Coimbatore)లో ఎన్డీయే అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం చేసిన చంద్రబాబు.. అనంతరం డీఎంకే తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ లో డీఎంకే మహిళా బిల్లును ఓడించిందని ఆరోపించారు. తద్వారా డీఎంకే, ఇండీ కూటమి మొత్తం మహిళల్నే ఓడించాలని చంద్రబాబు తెలిపారు.
మంచి ఉద్దేశ్యంతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బిల్లులను తెస్తే రాజకీయాల కోసం కాంగ్రెస్, డీఎంకే వాటిని వీగిపోయేలా చేశాయని చంద్రబాబు ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకోవటం ద్వారా కాంగ్రెస్ నేతృత్వంలోని డీఎంకే మహిళలకు ద్రోహం చేసిందన్నారు. గతంలో ప్రోగ్రెసివ్ రాష్ట్రంగా ఉన్న తమిళనాడు ఇప్పుడు ఆర్ధికంగా వెనుకబడిందన్నారు. తమిళనాడులో చాలా కుంభకోణాలు చోటు చేసుకున్నాయని, మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు వ్యతిరేకించిందో డీఎంకే సమాధానం చెప్పాలని చంద్రబాబు కోరారు.

దక్షిణాది రాష్ట్రాలకు రావాల్సిన వాటాను రాకుండా డీఎంకే అడ్డుకుందని, 50 శాతం సీట్లు పెరుగుతాయని స్పష్టంగా చెబుతుంటే ఇబ్బంది ఏమిటన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం చాలా కాలంగా తనలాంటి వ్యక్తులు పోరాడుతున్నారని గుర్తుచేశారు. 2029 ఎన్నికలకే ఈ రిజర్వేషన్ అమలు కావాలని ప్రధాని మోదీ భావించారని, కేంద్రం ప్రతిపాదించిన డిలిమిటేషన్ బిల్లు వల్ల తమిళనాడు, ఏపీ, కేరళ, తెలంగాణ, కర్ణాటక లాంటి రాష్ట్రాలకు సీట్లు పెరిగి ఉండేవని తెలిపారు. డీఎంకే తీసుకున్న నిర్ణయం వల్ల మహిళలో పాటు దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయాయన్నారు.

దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగాలని డీఎంకే కోరుకుంటోందా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. మహిళలకు రిజర్వేషన్లు అవసరం లేదని డీఎంకే కోరుతోందా...? అని అడిగారు. 2027 సెన్సెస్ ప్రకారం చేస్తే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. రిజర్వేషన్ల కోసం ఎదురు చూస్తున్న మహిళల్ని డీఎంకే వంటి పార్టీలు నిరాశ పరిచాయన్నారు. కాంగ్రెస్ -డీఎంకే రాజకీయాల కారణంగా మహిళలు ఓడిపోయారన్నారు.












Click it and Unblock the Notifications