కొత్త ఏడాదిలో మారణహోమం: ముంబై తరహాలో జనంపై యథేచ్ఛగా కాల్పులు
Montenegro shooting 2025: కొత్త సంవత్సరం తొలి రోజున యూరప్‌లోని మాంటెనెగ్రోలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. మారణహోమాన్ని సృష్టించాడు. ఈ ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఘటన తరువాత షూటర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అదే తుపాకీతో తనను తాను కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

యూరప్‌లోని ఓ చిన్న దేశం మాంటెనెగ్రో. ఆ దేశ కాలమానం ప్రకారం.. సాయంత్రం 7 గంటల సమయంలో సెటింజె అనే టౌన్‌లో ఈ కాల్పుల ఘటన సంభవించింది. రాజధాని పాడ్గోరికాకు 38 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ టౌన్. కొత్త ఏడాది వేడుకల్లో మునిగి ఉన్న సమయంలో ఓ రెస్టారెంట్‌లో తొలుత కాల్పులు జరిపాడో సాయుధుడు.
అతన్ని 45 సంవత్సరాల అలెక్జాండర్ మార్టినోవిక్‌గా గుర్తించారు. రెస్టారెంట్‌లో కాల్పులు జరిపిన అనంతరం పారిపోయాడు. మరో రెండు చోట్ల కాల్పులకు తెగబడ్డాడు. మొత్తం ఈ మూడు ఘటనల్లో 10 మంది మరణించారు. వారిలో ఇద్దరు చిన్న పిల్లలు సైతం ఉన్నారు. పలువురు గాయపడ్డారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అలెగ్జాండర్ మార్టినోవిక్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతను స్థానికుడేనని నిర్ధారించారు. గతంలో అక్రమంగా మారణాయుధాలను వినియోగించిన రికార్డ్ ఉన్నట్లు గుర్తించారు. సంఘటన చోటుచేసుకున్న గంట తరువాత పోలీసులు అతను నివసిస్తోన్న ఫ్లాట్‌కు సమీపించగా.. షూటర్ ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది.
రెస్టారెంట్‌లో చోటు చేసుకున్న ఘర్షణలు ఈ కాల్పులకు కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించినట్లు పోలీస్ డైరెక్టర్ లాజర్ స్కెపానొవిక్ తెలిపారు. సమగ్ర దర్యాప్తునకు ఆదేశించామని అన్నారు. ఈ ఘటన వెనుక ఉగ్రవాద చర్యలు ఉన్నట్లు ఇంకా నిర్ధారణ కాలేదని చెప్పారు. ఈ కాల్పుల ఉదంతం పట్ల మాంటెనెగ్రో అధ్యక్షుడు జకొవ్ మిలాటొవిక్, ప్రధానమంత్రి మిలొజ్కొ స్పజిక్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications