అమెరికాలో దుండగుడి కాల్పుల్లో నలుగురు మృతి: పోలీసుల కాల్పుల్లో నిందితుడు హతం
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు ఘటన చోటు చేసుకుంది. కొలరాడోలోని వేర్వేరు ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ క్రమంలో నిందితుడ్ని పోలీసులు కాల్చి చంపారు.
కాగా, డెన్వర్, లేక్ వుడ్ నగరాల్లో ఒకే వ్యక్తి నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడ్డాడు. విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. డెన్వర్‌లో తొలుత కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి చనిపోయారు. అక్కడి నుంచి నేరుగా లేక్ వుడ్‌కు వెళ్లాడు. అక్కడా కాల్పులకు దిగడంతో ఒకరు మృతి చెందారు. మరో వ్యక్తిని గాయపరిచాడని పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారిలో ఓ పోలీసు ఉన్నట్లు తెలిపారు.

కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు లేక్ వుడ్ ప్రాంతానికి చేరుకున్నారు. అతడిని పట్టుకొనేందుకు ప్రయత్నించారు. తప్పించుకొనేందుకు పోలీసులపైకి గన్ ఎక్కుపెట్టాడు. దీంతో ప్రతిచర్యగా పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో నిందితుడు అక్కడికక్కడే చనిపోయినట్లు లేక్ వుడ్ పోలీసు ప్రతినిధి జాన్ రొమెరో తెలిపారు.
గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. అయితే..నిందితుడు ఎందుకు కాల్పులు జరిపాడో తెలియరాలేదు. ఘటనపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. కాగా, తరచూ అమెరికాలో ఇలాంటి కాల్పుల ఘటనలో చోటు చేసుకుంటుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.












Click it and Unblock the Notifications